IND vs SA: టీమ్‌ఇండియాకు ఎందుకీ వరుస ఓటములు?

యుజ్వేంద్ర చాహల్‌, హార్దిక్‌ పాండ్య, అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌.. ఈ నలుగురు ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో మంచి ప్రదర్శన చేసిన వాళ్లే. వికెట్‌ టేకర్లుగా, పొదుపుగా బౌలింగ్‌ చేసినవారిగా సత్తా చాటారు...

Published : 14 Jun 2022 01:37 IST

అక్కడ మెరిసిన వాళ్లే.. ఇక్కడ తేలిపోతున్నారు..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

యుజ్వేంద్ర చాహల్‌, హార్దిక్‌ పాండ్య, అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌.. ఈ నలుగురు ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో మంచి ప్రదర్శన చేసిన వాళ్లే. వికెట్‌ టేకర్లుగా, పొదుపుగా బౌలింగ్‌ చేసినవారిగా సత్తా చాటారు. తీరా దక్షిణాఫ్రికాతో అంతర్జాతీయ టీ20 సిరీస్‌ ఆడేసరికి విఫలమవుతున్నారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికి ఆడింది రెండు మ్యాచ్‌లే అయినా.. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో టీమ్‌ఇండియా ఓటములకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నారు.

యుజ్వేంద్ర చాహల్‌: ఈసారి భారత టీ20 లీగ్‌లో యుజ్వేంద్ర చాహల్ అత్యధిక వికెట్లు(27) తీసిన బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు సరైన ప్రదర్శన చేయలేక ఒకానొక దశలో టీమ్‌ఇండియాలోనే చోటు కోల్పోయే పరిస్థితికి చేరుకున్న అతడు ఈసారి రాజస్థాన్‌ తరఫున అద్భుతంగా మెరిశాడు. 7.75 ఎకానమీతో పొదుపుగానూ బౌలింగ్‌ చేశాడు. దీంతో ఆ జట్టు ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మళ్లీ టీమ్‌ఇండియాలోకి వచ్చిన చాహల్‌ దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. తొలి టీ20లో 2.1 ఓవర్లే బౌలింగ్‌ చేసి 12 ఎకానమీతో 26 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఇక రెండో టీ20లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసినా 49 పరుగులిచ్చాడు. ఈసారి ఒక్క వికెటే తీశాడు. ఎకానమీ 12.20గా నమోదైంది. దీంతో చాహల్‌ పరుగులను నియంత్రించలేక, వికెట్లు రాబట్టలేక విఫలమయ్యాడు.

అవేశ్‌ ఖాన్‌: గతేడాది భారత టీ20 లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచిన దిల్లీ పేసర్‌ అవేశ్‌ ఖాన్‌.. ఈసారి కొత్త జట్టు లఖ్‌నవూ తరఫున ఆడాడు. దీంతో ఈ సీజన్‌లోనూ అతడు గొప్పగా బౌలింగ్‌ చేశాడు. 8.72 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా మొత్తం 18 వికెట్లు పడగొట్టి లఖ్‌నవూ ప్లేఆఫ్స్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, అవేశ్‌ ఇప్పుడు టీమ్‌ఇండియా తరఫున దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో వికెట్లు తీయలేకపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 35 పరుగులిచ్చాడు. దాంతో 8.80 ఎకానమీ నమోదు చేశాడు. ఇక రెండో టీ20లో 3 ఓవర్లు బౌలింగ్‌ చేసి 17 పరుగులే ఇచ్చి మంచి ఎకానమీ 5.70 సాధించాడు. ఇలా రెండు మ్యాచ్‌ల సగటు ఎకానమీ 7.25తో బాగానే ఉన్నా ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. దీంతో అవేశ్‌ కూడా విఫలమైనట్లుగానే కనిపిస్తున్నాడు.

హర్షల్‌ పటేల్‌: ఇక బెంగళూరు పేసర్‌గా హర్షల్‌ పటేల్ గత రెండు సీజన్లలో గొప్పగా రాణించాడు. గతేడాది అతడు 32 వికెట్లతో మెరిస్తే ఈసారి ఆ మాత్రం కాకపోయినా 19 వికెట్లతో రాణించాడు. ఎకానమీ కూడా ఈసారి 7.66 బాగానే నమోదు చేశాడు. దీంతో బెంగళూరు ప్లేఆఫ్స్‌ చేరడంలో హర్షల్‌ తనవంతు కృషి చేశాడు. కానీ, ఇప్పుడు దక్షిణాఫ్రికాతో ఆడుతోన్న టీ20 సిరీస్‌లో అంత గొప్పగా బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. తొలి టీ20లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెటే తీశాడు. ఎకానమీ 10.80గా నమోదు చేశాడు. ఇక రెండో టీ20లో 3 ఓవర్లు బౌలింగ్‌ చేసి 17 పరుగులిచాడు. ఒక్క వికెటే తీసి 5.70 ఎకానమీ నమోదు చేశాడు. దీంతో హర్షల్‌ వికెట్లు తీయలేక.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడుతున్నాడు.

అక్షర్‌ పటేల్‌: ఇక అక్షర్‌ పటేల్‌ గతేడాది భారత టీ20 లీగ్‌లో దిల్లీ తరఫున బాగా రాణించినా ఈసారి వికెట్ల పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 6 వికెట్లే తీశాడు. అయితే, 7.46 ఎకానమీ మెరుగ్గా ఉండటంతో ఇప్పుడు టీమ్‌ఇండియా తరఫున దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అతడు ఈ రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి టీ20లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 40 పరుగులు ఇచ్చి 10 ఎకానమీ నమోదు చేశాడు. ఒక్క వికెటే తీశాడు. ఇక రెండో టీ20లో ఒక్క ఓవరే బౌలింగ్‌ చేసి 19 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అక్షర్‌ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. కీలకంగా ఆడతారనుకున్న బౌలర్లందరూ సమష్టిగా విఫలమవ్వడమే టీమ్‌ఇండియా తొలి రెండు మ్యాచ్‌ల ఓటములకు కారణాలుగా కనిపిస్తున్నాయి.

మిగిలిన మ్యాచ్‌ల్లో గెలవాలంటే..

ఇక ఇప్పటికే రెండు మ్యాచ్‌లు కోల్పోయిన టీమ్‌ఇండియా ఈ సిరీస్‌లో నిలవాలంటే విశాఖపట్నంలో జరిగే మూడో టీ20లో తప్పక గెలవాలి. అది జరగాలంటే బౌలింగ్‌ యూనిట్‌లో మార్పులు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సహజంగానే విశాఖ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. దీంతో ఈ బౌలింగ్‌ యూనిట్‌నే మూడో టీ20లోనూ భారత జట్టు కొనసాగిస్తే మరిన్ని కష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో మూడో టీ20లో భారత్‌ గెలవాలంటే కచ్చితంగా ఈ విభాగంలో మార్పులు చేయాల్సిందే. మరోవైపు ఈ సిరీస్‌లో ఇంకా అవకాశం రాని యువ బౌలర్లు ఉన్నారు. పంజాబ్‌కు చెందిన అర్ష్‌దీప్‌ సింగ్‌ భారత టీ20 లీగ్‌లో డెత్‌ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. అలాగే హైదరాబాద్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ తన వేగంతో వికెట్ల పండుగ చేసుకున్నాడు. అలాగే లఖ్‌నవూకు చెందిన రవి బిష్ణోయ్‌ తన లెగ్‌ స్పిన్‌తో ప్రత్యర్థులను మధ్య ఓవర్లలో కట్టడి చేశాడు. దీంతో మిగిలిన మ్యాచ్‌ల్లో వీరికి అవకాశం ఇస్తే టీమ్‌ఇండియాకు గెలిచే అవకాశాలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని