Rahul Dravid - Team India: ద్రవిడ్‌ ఉంటాడా.. వెళ్తాడా?

వన్డే ప్రపంచకప్‌ ముగిసింది. ఇంతటితో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మల వన్డే కెరీర్‌ ముగిసిందా అనే చర్చ జరుగుతోంది. వీళ్లేమీ అధికారికంగా రిటైర్మెంట్‌ ప్రకటించలేదు. వీళ్లిద్దరూ వన్డేలకు దాదాపు దూరమైనట్లే అని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) భవితవ్యం మీదా చర్చ జరుగుతోంది. 

Updated : 22 Nov 2023 17:11 IST

టీమ్‌ఇండియా కోచ్‌గా కొనసాగడంపై సందిగ్ధత

వన్డే ప్రపంచకప్‌ ముగిసింది. ఇంతటితో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మల వన్డే కెరీర్‌ ముగిసిందా అనే చర్చ జరుగుతోంది. వీళ్లేమీ అధికారికంగా రిటైర్మెంట్‌ ప్రకటించలేదు. వీళ్లిద్దరూ వన్డేలకు దాదాపు దూరమైనట్లే అని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) భవితవ్యం మీదా చర్చ జరుగుతోంది. అధికారికంగా అయితే ప్రపంచకప్‌తోనే రాహుల్‌ పదవీకాలం ముగిసింది. కానీ అతను కొనసాగింపును కోరుకుంటాడా.. బోర్డు అతడికా అవకాశమిస్తుందా.. అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రెండేళ్ల కిందట టీ20 ప్రపంచకప్‌ ముంగిట భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవిని చేపట్టాడు రాహుల్‌ ద్రవిడ్‌. ఆ టోర్నీలో విఫలమైనప్పటికీ ద్రవిడ్‌ శిక్షణలో అనేక ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచింది టీమ్‌ఇండియా. ఎంతోమంది యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశం దక్కింది. గత రెండేళ్లలో భారత్‌ ఏ ఐసీసీ ట్రోఫీ గెలవలేదు కానీ.. మిగతా ప్రదర్శన మాత్రం బాగానే సాగింది. అతను కోచ్‌గా ఉండగానే మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్‌ కావడం గొప్ప ఘనతే. అధికారికంగా తన చివరి బాధ్యత అయిన వన్డే ప్రపంచకప్‌లో జట్టును విజేతగా నిలపడానికి రాహుల్‌ శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ కప్పు విజయానికి చేరువగా వచ్చి విఫలమైంది భారత్‌. ఫైనల్‌ అనంతరం ద్రవిడ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన భవితవ్యంపై ఇంకా ఏమీ ఆలోచించలేదన్నాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో భారత్‌ ఆడబోయే టీ20 సిరీస్‌కు లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు. ద్రవిడ్‌ సంగతేంటన్నది స్పష్టత లేదు. వచ్చే నెలలో భారత జట్టు టీ20 సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. ఆ పర్యటన మొదలయ్యేలోపు రాహుల్‌ కొనసాగడంపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ద్రవిడ్‌ సరేనంటే బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని ఇంకో ఏడాది పాటు పొడిగించే అవకాశముంది. కానీ ద్రవిడ్‌ ఔనంటాడా అన్నదే సందేహం.

బలవంతంగానే తెచ్చారు

ద్రవిడ్‌ తరం దిగ్గజ ఆటగాళ్లలో కోచ్‌లు కావడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడలేదు. అందుకు ప్రధాన కారణం.. 15-20 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడి, పర్యటనల్లోనే గడిపిన ఈ ఆటగాళ్లందరూ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని భావించడమే. పెద్ద బాధ్యతలు నెత్తికెత్తుకుని మళ్లీ తీరిక లేకుండా గడిపితే కుటుంబానికి మరింత దూరమవుతామన్న భావనతో సచిన్, గంగూలీ, జహీర్‌ ఖాన్, సెహ్వాగ్‌.. ఇలా చాలామంది దిగ్గజ ఆటగాళ్లు పూర్తి స్థాయి కోచ్‌లుగా మారలేదు. ఐపీఎల్‌ జట్లకు కోచ్‌లుగా, మెంటార్‌లుగా వ్యవహరించారే తప్ప టీమ్‌ఇండియా కోచ్‌ స్థానానికి వీళ్లెవ్వరూ పోటీ పడలేదు. అయితే ద్రవిడ్‌ మాత్రం ముందు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌గా.. అలాగే అండర్‌-19, ఇండియా-ఎ జట్ల కోచ్‌గా పని చేశాడు. ఆ బాధ్యతల్లో గొప్ప ప్రతిభ చూపించాడు. రిషబ్‌ పంత్, శుభ్‌మన్, ఇషాన్‌ కిషన్‌.. ఇలా ఎంతోమంది యువ ప్రతిభావంతులు ద్రవిడ్‌ శిక్షణలోనే ఎదిగారు. వీళ్లంతా ద్రవిడ్‌ కోచ్‌గా ఉండగా అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన ఆటగాళ్లు. అయితే తన స్వస్థలమైన బెంగళూరులో ఉంటూ ఎన్‌సీఏ బాధ్యతలు చూసుకుంటూ.. అండర్‌-19 కోచ్‌గా యువ క్రికెటర్లను సానబెట్టడం వరకే తన పాత్ర పరిమితం కావాలని ద్రవిడ్‌ భావించాడు. కానీ అతణ్ని బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా సౌరభ్‌ గంగూలీ పట్టుబట్టి టీమ్‌ఇండియా కోచ్‌ పదవిలోకి తీసుకొచ్చాడు. రవిశాస్త్రి పదవీ కాలం ముగిశాక జట్టుకు ద్రవిడ్‌ అవసరాన్ని వివరించి అతను కోచ్‌ బాధ్యతలు చేపట్టేలా చూశాడు. ద్రవిడ్‌ ఒకింత అయిష్టంగానే ఈ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు తన బాధ్యత ముగిసింది. ద్రవిడ్‌ టీమ్‌ఇండియా కోచ్‌ కావడంలో కీలక పాత్ర పోషించిన గంగూలీ ఇప్పుడు బోర్డులో లేడు. అతడిలా రాహుల్‌ను కొనసాగమని ఇప్పుడు ఎవరూ బలవంతం చేయకపోవచ్చు. ద్రవిడ్‌ సైతం జట్టును పట్టుకుని వేలాడే తరహా కాదు. పైగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో కోచ్‌గా తప్పుకొంటాడేమో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అతను కోచ్‌గా తప్పుకొనేట్లయితే.. ద్రవిడ్‌ తర్వాత ఎన్‌సీఏ చీఫ్‌ కావడమే కాక, భారత జట్టుకు కొన్ని సిరీస్‌ల్లో తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించిన మన వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రధాన కోచ్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని