Rohit Sharma: రోహిత్‌ దారెటు?

ముంబయి ఇండియన్స్‌తో రోహిత్‌ ఇన్నింగ్స్‌ ముగిసినట్లేనా! వచ్చే సీజన్‌కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్‌ బౌచర్‌ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది.

Updated : 19 May 2024 04:36 IST

ముంబయి ఇండియన్స్‌తో రోహిత్‌ ఇన్నింగ్స్‌ ముగిసినట్లేనా! వచ్చే సీజన్‌కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్‌ బౌచర్‌ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది.

ముంబయి: ఐపీఎల్‌ ఆరంభానికి ముందు, మొదలయ్యాక అత్యంత చర్చనీయాంశం రోహిత్‌ను ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ నుంచి తప్పించడమే. సారథిగా అయిదు ట్రోఫీలు అందించిన రోహిత్‌ను తొలగించడం, హార్దిక్‌ పాండ్యను గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి కొనుగోలు చేసి మరీ కెప్టెన్సీ అప్పగించడంతో పెద్ద వివాదమే చెలరేగింది. ఫ్రాంఛైజీ నిర్ణయంపై ముంబయి అభిమానులు భగ్గుమన్నారు. సోషల్‌ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్వయంగా  హార్దిక్‌ పాండ్యకు కూడా సెగ తప్పలేదు. అతడు ఒత్తిడికి గురయ్యాడు. మ్యాచ్‌ల సందర్భంగా ముంబయి అభిమానులే అతణ్ని గేలి చేశారు. కొందరు ముంబయి ఆటగాళ్లకు కూడా హార్దిక్‌కు పగ్గాలు అప్పగించడం ఇష్టం లేదన్న వార్తలొచ్చాయి. దీనిపై రోహిత్‌ శర్మ మాత్రం ఇప్పటివరకు పెదవి విప్పలేదు. కానీ కెప్టెన్సీ కోల్పోయిన అతడు ఇక ముంబయి ఇండియన్స్‌కు కొనసాగడన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో సాగుతున్నాయి. అతడు ఫ్రాంఛైజీ మారడం ఖాయమన్నది చాలా మంది అభిప్రాయం. తాజాగా ముంబయి ప్రధాన కోచ్‌ మార్క్‌ బౌచర్‌ వ్యాఖ్యలు రోహిత్‌ ముంబయిని వీడడం నిశ్చయమని చెబుతున్నాయి. రోహిత్‌ తన భవిష్యత్తును తానే చూసుకుంటాడని బౌచర్‌ వ్యాఖ్యానించాడు. ‘‘రోహిత్‌ భవిష్యత్తు గురించి పెద్దగా చర్చే జరగలేదు. ఈ సీజన్‌లో ముంబయి ఆఖరి మ్యాచ్‌ ముందు రోహిత్‌తో మాట్లాడా. కానీ అది సీజన్‌ను కాస్త సమీక్షించడానికే’’ అని అతడు అన్నాడు. ‘‘భవిష్యత్తు గురించి అడిగితే ‘టీ20 ప్రపంచకప్‌’ అని రోహిత్‌ చెప్పాడు. నేను తెలుసుకోవాలనుకున్నది అంతే’’ అని బౌచర్‌ చెప్పాడు. ‘‘రోహిత్‌ తన భవిష్యత్తు గురించి తానే ఆలోచించుకోగలడు. వచ్చే ఏడాది పెద్ద వేలం ఉంది. ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు?’’ అని అన్నాడు. వేలం గురించి బౌచర్‌ మాట్లాడుతున్నాడంటే.. రోహిత్‌ ముంబయిని వీడడం లాంఛనమేనని భావించవచ్చు. 37 ఏళ్ల రోహిత్‌ తనకు ఇప్పట్లో రిటైరయ్యే ఉద్దేశం లేదని, ఇంకొన్నాళ్లు క్రికెట్‌ ఆడతానని ఇప్పటికే స్పష్టం చేశాడు. మరి ఐపీఎల్‌లో అతడి ప్రయాణం ఎలా సాగుతుందో ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రస్తుతానికి ముంబయితో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఆ జట్టును వీడి మరో జట్టుకు ఆడే ఆలోచన అతడికి ఉందో లేదో తెలియదు. ఇటీవల తన స్నేహితుడు అభిషేక్‌ నాయర్‌తో మాట్లాడుతూ.. తనకు ఇదే చివరి ఐపీఎల్‌ అనే అర్థంలో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో అతడు ముంబయిని వీడితే మరో ఫ్రాంఛైజీకి ఆడతాడా..? ఐపీఎల్‌లో తన తర్వాతి ఇన్నింగ్స్‌ ఎక్కడ మొదలుపెడతాడో చూడాలి.

పాపం హార్దిక్‌... బౌచర్‌: అభిమానులు హార్దిక్‌ పాండ్యను గేలి చేయడం విచారం కలిగించిందని బౌచర్‌ అన్నాడు. అది స్టార్‌ ఆల్‌రౌండర్‌పై ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పాడు. ‘‘అలా గేలి చేయడం మంచిది కాదు. హార్దిక్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు విచారం కలిగింది. అలాంటి అనుభవం ఎదురైతే ఎవరికైనా బాధగానే ఉంటుంది’’ అని బౌచర్‌ అన్నాడు. ‘‘కొన్ని విషయాలు ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. అంతిమంగా అది జట్టును ప్రభావితం చేస్తుంది. బయటి పరిణామాలతో హార్దిక్‌కు కష్టంగా అనిపించి ఉంటుంది. డ్రెస్సింగ్‌రూమ్‌లో అతడికి చాలా మద్దతు లభించింది. ఆటగాళ్లు కూడా అతడికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆటగాడికి ఆ పరిస్థితులు కష్టమైనవే’’ అని చెప్పాడు. మైదానం బయటి విషయాలు జట్టుకు ఇబ్బందిగా మారినప్పుడు, జట్టు మేనేజ్‌మెంట్‌ వాటిపై దృష్టిపెట్టాలని బౌచర్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని