T20 World Cup: కప్పుతో ముగిస్తారా?

ఆ ఇద్దరు భారత క్రికెట్‌ జట్టు మూలస్తంభాలు. దాదాపు దశాబ్దన్నరగా టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ భారాన్ని మోస్తున్నారు. అత్యుత్తమ ప్రదర్శనతో దిగ్గజాలుగా ఎదిగారు. ఆ ఇద్దరి ఆటతీరు వేరు. వ్యక్తిత్వమూ వేరు. కానీ జట్టు విషయానికి వచ్చే సరికి విజయాల కోసం పోరాడటంలో వెనక్కి తగ్గరు.

Updated : 31 May 2024 06:46 IST

ఆ ఇద్దరు భారత క్రికెట్‌ జట్టు మూలస్తంభాలు. దాదాపు దశాబ్దన్నరగా టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ భారాన్ని మోస్తున్నారు. అత్యుత్తమ ప్రదర్శనతో దిగ్గజాలుగా ఎదిగారు. ఆ ఇద్దరి ఆటతీరు వేరు. వ్యక్తిత్వమూ వేరు. కానీ జట్టు విషయానికి వచ్చే సరికి విజయాల కోసం పోరాడటంలో వెనక్కి తగ్గరు. ఆ ఇద్దరే.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ. ఇప్పటికే చెరో ప్రపంచకప్‌ సొంతం చేసుకున్న వీళ్లు.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో జట్టును గెలిపించడమే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. పొట్టి ఫార్మాట్లో ఈ ఇద్దరికీ ఇదే చివరి ప్రపంచకప్‌ అనే సంకేతాల నేపథ్యంలో టైటిల్‌తో ముగిస్తారా? అన్నది చూడాలి. 

ఈనాడు క్రీడావిభాగం

టీ20ల్లో యువ రక్తాన్ని ఎక్కించే దిశగా టీమ్‌ఇండియా సాగుతోంది. అందుకే కోహ్లి, రోహిత్‌ కొద్దికాలంగా టీ20లకు దూరంగా ఉంటున్నారు. 2022 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఈ ఏడాది జనవరిలో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లోనే తిరిగి ఆడారు. మధ్యలో 14 నెలల పాటు పొట్టి ఫార్మాట్‌లో జట్టుకు ప్రాతినిథ్యం వహించలేదు. అసలు ఈ టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు ఆడటంపైనా మొదట సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ కెప్టెన్‌గా రోహిత్‌ను, అనుభవజ్ఞుడైన ఆటగాడు కావడంతో కోహ్లీని జట్టులోకి తీసుకున్నారు. బహుశా ఈ ఇద్దరికీ ఇదే చివరి టీ20 ప్రపంచకప్‌ కావొచ్చేమో! 2026 టీ20 ప్రపంచకప్‌ సమయానికి రోహిత్‌కు 39, కోహ్లీకి 37 ఏళ్లు ఉంటాయి. ఆ తర్వాతి ఏడాదే (2027) వన్డే ప్రపంచకప్‌ ఉండటంతో.. దానిపై దృష్టి పెట్టి కోహ్లి, రోహిత్‌ టీ20ల నుంచి తప్పుకునే అవకాశాలున్నాయి. 

రికార్డుల రారాజు: టీ20 ప్రపంచకప్‌కు కోహ్లి ఎంపికను కొంతమంది ప్రశ్నించారు. కానీ టీ20 ప్రపంచకప్‌ల్లో కోహ్లి ప్రదర్శన చూస్తే ఎవరూ ఈ మాట అనరు. 2012 నుంచి అయిదు టీ20 ప్రపంచకప్‌లు ఆడిన కోహ్లి అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. 25 ఇన్నింగ్స్‌ల్లో 81.50 సగటుతో 1141 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్‌ 131.30గా ఉంది. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌ఇండియాలో సభ్యుడైన కోహ్లి ఆ తర్వాత ఆటగాడిగా, కెప్టెన్‌గా మరో కప్‌ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 2014 టీ20 ప్రపంచకప్‌లో ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌ చేర్చినా తుదిపోరులో నిరాశే ఎదురైంది. అప్పుడు 319 పరుగులు చేసిన కోహ్లి.. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2021లో కెప్టెన్‌గా జట్టును గెలిపించలేకపోయాడు. 2022లోనూ అత్యధిక పరుగులు (296) చేసింది కోహ్లీనే అయినా అప్పుడు సెమీస్‌లోనే జట్టు ఓడింది. ఇలా టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన గణాంకాలు ఉన్న కోహ్లి ఈ సారి జట్టుకు కప్‌ అందిస్తాడనే అంచనాలు మెండుగానే ఉన్నాయి. ఇటీవల ఐపీఎల్‌లో అతను చెలరేగడమే అందుకు కారణం. 741 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇదే ఊపును పొట్టికప్‌లోనూ కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. కోహ్లి జట్టులో ఉంటే ఆ ఉత్సాహమే వేరు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో రాణిస్తూ సహచరులకూ ప్రేరణగా నిలుస్తాడు. ఉత్తమ ప్రదర్శన చేసేలా వాళ్లలో స్ఫూర్తి నింపుతాడు. 

నడిపించే నాయకుడు: ఇప్పటికే ఒకసారి టీ20 ప్రపంచకప్‌ (2007) ఖాతాలో వేసుకున్న రోహిత్‌ శర్మ ఇప్పుడు రెండోదానిపై కన్నేశాడు. కెప్టెన్‌గా కప్‌ను అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. పొట్టికప్‌ ఆరంభం నుంచి అన్ని ప్రపంచకప్‌ (8)లూ ఆడిన ఇద్దరు ఆటగాళ్లలో రోహిత్‌ ఒకరు. మరొకరేమో బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌. ఇంతటి అనుభవం ఉన్న రోహిత్‌ చివరిసారి టీ20 ప్రపంచకప్‌లో జట్టును టైటిల్‌ దిశగా నడిపించాలన్నది అభిమానుల కోరిక. 2022 టీ20 ప్రపంచకప్‌లో అతని సారథ్యంలో జట్టు సెమీస్‌ చేరింది. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓడింది. టీ20 ప్రపంచకప్‌ల్లో రోహిత్‌ 36 ఇన్నింగ్స్‌ల్లో 963 పరుగులు చేశాడు. ఇటీవల ఐపీఎల్‌లో రోహిత్‌ ప్రదర్శన (417 పరుగులు) అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఒక్కసారి టీమ్‌ఇండియా జెర్సీ వేసుకుంటే రోహిత్‌ భిన్నమైన బ్యాటర్‌గా కనిపిస్తాడు. చివరగా ఆడిన అంతర్జాతీయ టీ20లో అఫ్గాన్‌పై అజేయ సెంచరీ (121) చేశాడు. ఓపెనింగ్‌లో ధనాధన్‌ ఆరంభాలను ఇస్తూ జట్టు భారీస్కోర్లకు పునాది వేసే పాత్ర అతనిదే. ఇక కెప్టెన్‌గా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వాడుకుంటూ.. జట్టు నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాల్సి ఉంటుంది. ఈ ప్రపంచకప్‌లో మన జట్టు ఉత్తమంగానే ఉంది. ఈ ఆటగాళ్లను ముందుండి నడిపించాల్సిన బాధ్యత రోహిత్‌దే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని