World cup 2024: పొట్టి కప్పులో విరాట్‌ ఆడడా?

ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన కోహ్లి.. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్‌ ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 10 Dec 2023 12:16 IST

కోహ్లి భవిష్యత్‌ ఏంటీ?

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అతడే. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుడూ అతడే. అతడి సగటుకు దరిదాపుల్లోకి వచ్చే ఆటగాడే లేడు. పొట్టి ఫార్మాట్లో అతని నిలకడ అమోఘం. ప్రస్తుతం ఫామ్‌ కూడా సూపర్‌గా ఉంది. కానీ వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఆ ఆటగాడు ఆడతాడా? అంటే కచ్చితంగా అవునని సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆ ఆటగాడే విరాట్‌ కోహ్లి. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన కోహ్లి.. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్‌ ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రోహిత్‌ సరే.. మరి కోహ్లి

2024 జూన్‌లో వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. 2007లో ఆరంభ టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన తర్వాత టీమ్‌ఇండియా మరోసారి పొట్టి కప్పు సొంతం చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే టీ20 ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలవాలనే పట్టుదలతో భారత్‌ ఉంది. అందుకే యువ రక్తాన్ని ఎక్కిస్తూ, దూకుడును అందిపుచ్చుకుంటూ జట్టును నిర్మించే దిశగా బీసీసీఐ సాగుతోంది. సీనియర్లను కాదని కుర్రాళ్లకు టీ20లకు అవకాశమిస్తోంది. మరోవైపు నిరుడు టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓటమి తర్వాత రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి తామే స్వయంగా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నారు. కానీ వన్డే ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌ చేర్చిన నేపథ్యంలో వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనూ కుర్రాళ్లను నడిపించాలని రోహిత్‌ను బీసీసీఐ కోరింది. దీనికి రోహిత్‌ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇప్పుడిక టీ20ల్లో కోహ్లి భవితవ్యంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రపంచకప్‌లో ఆడే భారత టీ20 ప్రాధాన్య జట్టులో కోహ్లి పేరు లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై త్వరలోనే కోహ్లితో బీసీసీఐ చర్చించే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇషాన్‌ కోసమేనా?

సుదీర్ఘ కెరీర్లో కోహ్లి ఇప్పటివరకూ 2011, 2015, 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లాడాడు. 2012, 2014, 2016, 2021, 2022 టీ20 ప్రపంచకప్‌ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. 2011 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో ఉన్నాడు. కానీ కెప్టెన్‌గా ప్రపంచకప్‌ అందుకోలేకపోయిన అతను.. ఆటగాడిగా మరోసారి కప్పును ముద్దాడాలనే లక్ష్యంతో ఉన్నాడు. అయితే ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓటమితో ఆ కల తీరలేదు. దీంతో వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌తో చివరి ప్రయత్నం చేయాలని కోహ్లి చూస్తున్నాడు. కానీ అతనికి ఆ అవకాశం దక్కేలా లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కోహ్లి ఆడే మూడో స్థానాన్ని ఇషాన్‌ కిషన్‌కు కట్టబెట్టాలని జట్టు మేనేజ్‌మెంట్‌ చూస్తోంది. అందుకే ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అతణ్ని మూడో స్థానంలో ఆడించింది. పొట్టి ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో, అఫ్గానిస్థాన్‌తో టీమ్‌ఇండియా మూడేసి టీ20లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లోనూ మూడో స్థానంలో ఇషాన్‌నే ఆడించే అవకాశముంది. సఫారీతో సిరీస్‌కు కోహ్లి దూరంగానే ఉన్నాడు. కానీ ప్రపంచకప్‌కు మాత్రం కోహ్లీని దూరం పెడితే ఆ నిర్ణయం తీవ్ర విమర్శలకు తావిచ్చే అవకాశముంది. కోహ్లి ఫామే అందుకు కారణం. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో 765 పరుగులతో అతను అగ్రస్థానంలో నిలిచాడు. ఇక టీ20ల విషయానికి వస్తే అంతర్జాతీయ క్రికెట్లో 115 మ్యాచ్‌ల్లో 52.73 సగటుతో 4008 పరుగులతో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనూ అత్యధిక పరుగులు (1141) సాధించిన ఆటగాడూ అతనే. జట్టులో 35 ఏళ్ల కోహ్లి ఉనికే వేరు. అతనుంటే జట్టులో ఉండే ఉత్సాహం వేరు. ఇప్పటికీ అతని పరుగుల ఆకలి తీరడం లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం దక్కినా అతను రాణిస్తాడని చెప్పొచ్చు. కానీ బీసీసీఐ మాత్రం కోహ్లి విషయంలో సానుకూలంగా లేదనే అంటున్నారు. ఒకవేేళ గొడవెందుకు అనుకుని కోహ్లి స్వయంగా టీ20ల నుంచి తప్పుకుంటాడా? లేదా అతణ్ని ఆడించేలా బీసీసీఐ తీరు మార్చుకుంటుందా? అన్నది వేచి చూడాలి.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని