INDw Vs SLw: మహిళల ఆసియా కప్‌.. ‘లంక’ను కొట్టాలి.. ‘భారత్‌’ టైటిల్‌ పట్టేయాలి!

మహిళల ఆసియా కప్‌లో భారత్‌దే ఎప్పుడూ ఆధిపత్యం. ఏడు టైటిళ్లలో ఆరుసార్లు టీమ్‌ఇండియా కైవసం చేసుకొంది. తాజాగా ఏడో కప్‌ కోసం శ్రీలంకతో ఫైనల్‌ పోరులో తలపడేందుకు సిద్ధమైంది.

Published : 14 Oct 2022 01:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుత ఏడాదిలో పురుష క్రికెటర్లు చేయలేని ఘనతను.. భారత మహిళామణులు సాధించే అవకాశం వచ్చింది. ఆసియా కప్‌లో భారత్‌ అదరగొట్టేసి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇదేంటి ఇప్పుడంతా పొట్టి ప్రపంచకప్‌ మేనియా కదా.. ఆసియా కప్‌ ఎక్కడొచ్చిందని కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఇది మహిళల ఆసియా కప్‌.. టైటిల్‌ కోసం శ్రీలంకతో భారత్‌ శనివారం (అక్టోబర్ 15న) తలపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్లలో ఆధిక్యం ఎవరు..? బలాలు ఏంటనేవి చూద్దాం.. 

లీగ్‌ దశలో ఒక మ్యాచ్‌ మినహా.. (అదీ పాక్‌పై టీమ్‌ఇండియా ఓడింది) అన్ని మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్‌కు చేరుకొన్న టీమ్‌ఇండియా ఇక్కడా ఆధిపత్యం ప్రదర్శించింది. థాయ్‌లాండ్‌ను భారత్‌ చిత్తు చేసేసింది. ఇక శ్రీలంక కూడా గ్రూప్‌ స్టేజ్‌లో మనపై, పాక్‌ చేతిలోనే ఓటమిపాలైంది. ఇప్పుడు సెమీస్‌లో పాక్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకొంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియాపైనా చెలరేగే అవకాశం లేకపోలేదు. అందుకే లంకతో బహుపరాక్‌గా ఉండాలని విశ్లేషకులు సూచించారు. ఇప్పటివరకు ఏడుసార్లు మహిళా ఆసియా కప్‌ టోర్నమెంట్ జరిగితే.. ఆరు టైటిళ్లను సొంతం చేసుకొంది. గత సీజన్‌లో బంగ్లాదేశ్‌ గెలవడం విశేషం. పురుషుల ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా సూపర్-4 స్టేజ్‌కే పరిమితమై ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. 

ఆ ఇద్దరు నిలకడగా.. 

భారత బ్యాటింగ్‌ లైనప్‌లో నిలకడగా ఆడుతున్న ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ ముందుంజలో ఉండగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్‌ కౌర్‌, డిప్యూటీ స్మృతీ మంధాన అప్పుడప్పుడు బ్యాట్‌ను ఝులిపించారు. అయితే కనీసం ఇద్దరు కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. కానీ మంధానతోపాటు హర్మన్‌ కూడా ఇంకా బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఉంది. టైటిల్‌ను నెగ్గాలంటే స్కోరు బోర్డుపై భారీ స్కోరు ఉండాలి. అప్పుడే బౌలర్లపై ఒత్తిడి తగ్గి అనుకున్న ఫలితం రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. మిడిలార్డర్‌లో రిచా ఘోష్, హేమలత, పూజా వస్త్రాకర్‌ పెద్దగా రాణించలేదు. తుదిపోరులో ఆ లోటుపాట్లను సవరించుకోవాలి. 

బౌలింగ్‌లో అదరగొడుతూ.. 

టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కంటే బౌలింగ్‌ ఎంతో పటిష్టంగా ఉంది. దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, రాధా యాదవ్‌, హేమలతతో కూడిన స్పిన్ దళం ప్రత్యర్థులను తిప్పేసింది. ఆరంభంలో పేసర్‌ రేణుకా సింగ్‌ కూడా ఫర్వాలేదనిపించినా.. ఆల్‌రౌండర్‌గా పేరొందిన పూజా వస్త్రాకర్‌ మాత్రం కట్టుదిట్టమైన బంతులను సంధించి అవతలి బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి చేసింది. లక్ష్యం ఎంత తక్కువ ఉన్నప్పటికీ బౌలింగ్‌ బలంతో భారత్‌ వైపు మ్యాచ్‌లు తిరిగాయి. షఫాలీ వర్మ బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణించడం విశేషం. ఫీల్డింగ్‌ కూడా అత్యున్నత నాణ్యంగా ఉండటం టీమ్‌ఇండియాకు కలిసొచ్చే అంశం. చురుకైన ఫీల్డింగ్‌, దూకుడైన బ్యాటింగ్‌, పదునైనా బౌలింగ్‌తో ఫైనల్‌లోనూ లంకను చుట్టేయాలి. 

లంకేమీ తక్కువ కాదు..

ఆసియా కప్‌ ఫైనల్‌కు చేరిన శ్రీలంక జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. పోరాడితే పోయేదేముంది.. అన్నట్లుగా చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని లంక సెమీస్‌లోనూ స్వల్ప లక్ష్యం కాపాడుకోవడం అద్భుతం. బ్యాటింగ్‌లో ఆ జట్టు కెప్టెన్, ఓపెనర్‌ ఆటపట్టుతోపాటు అనుష్క సంజీవని, మాధవి కీలక ప్లేయర్లు.. లోయర్‌ ఆర్డర్‌లో రాణించేంత బ్యాటర్‌ లేకపోవడం లంక వీక్‌నెస్‌. అయితే బౌలింగ్‌ విభాగం మాత్రం పటిష్టంగా ఉంది. ఉదాహరణకు సెమీఫైనల్‌నే తీసుకొంటే బ్యాటింగ్‌ బలంగా ఉన్న పాకిస్థాన్‌ను కట్టిడి చేయడమంటే సాధారణ విషయం కాదు. తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక 122/6 స్కోరు చేయగా.. పాక్‌ను 121/6కే పరిమితం చేసి ఒక్క పరుగుతో విజయం సాధించింది. ఇన్‌కో రణవీర, అచిని కులసూరియా, సుగంధిక కుమారి, మల్షా షెహాని కూడిన బౌలింగ్‌ దళంతో టీమ్‌ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిందే. 

* ఇరు జట్లూ 21 టీ20ల్లో తలపడగా.. భారత్ 16 మ్యాచుల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచుల్లో లంక గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 

* లంకపై భారత్‌ యావరేజ్‌ స్కోరు 126 పరుగులు కాగా.. భారత్‌పై శ్రీలంక సగటు స్కోరు 110

*  2013-14 సీజన్‌లో భారత్‌ 147 పరుగులు సాధించగా.. లంక 148 పరుగులు చేసి గెలిచింది. ఇదే అత్యధిక స్కోరు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని