Yashasvi Jaiswal: ఐపీఎల్‌లోనూ స్లెడ్జింగ్‌.. కానీ అందరికీ తెలియదంతే: జైస్వాల్‌

రాజస్థాన్‌ యువ ఓపెనర్‌గా యశస్వి.. ఇటీవల ఐపీఎల్‌ సీజన్‌లో పరుగుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీంతో వెస్టిండీస్‌ పర్యటన కోసం ప్రకటించిన జట్టులోకి యశస్వి వచ్చాడు. 

Updated : 01 Jul 2023 13:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత యువ క్రికెటర్లలో యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) గురించే ప్రధాన చర్చ. మూడేళ్ల కిందట ఐపీఎల్‌లో అరంగేట్రం చేసినప్పటికీ.. 2023 సీజన్ అతడి కెరీర్‌లో అత్యుత్తమం. అదే జాతీయ జట్టులోకి వచ్చేలా చేసింది. వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో జైస్వాల్‌ వివిధ విషయాలపై ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.

ఆటలోనే కాదు, నిజజీవితంలోనూ ఎవరైనా పరుషంగా మాట్లాడినా పట్టించుకోనని చెప్పాడు. మైదానంలో ప్రత్యర్థులు స్లెడ్జింగ్‌ చేస్తే నోటితో కాకుండా ఆటతో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. ఐపీఎల్‌లో ఇలాంటివి జరగవు కదా అని హోస్ట్‌ వ్యాఖ్యానించగా ‘‘ఎవరన్నారు..? స్లెడ్జింగ్‌ ఎక్కడైనా జరుగుతుంది. కానీ అది బయటవారికి తెలియదు. ఇక నా విషయానికొస్తే మా అమ్మ, చెల్లి గురించి ఎవరైనా ఏమన్నా సరే నా మనసులోకి వెళ్లనివ్వను. ఆ మాటలు అస్సలు పట్టించుకోను’’ అని చెప్పాడు.

2023 ఐపీఎల్ సీజన్‌ విషయానికొస్తే.. రాజస్థాన్‌ రాయల్స్ తరఫున జైస్వాల్‌ ఆడాడు. 14 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమ చేతివాటం ఓపెనర్‌ 625 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో చాలా రోజులు నిలిచినా ఆఖరుకు ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. ఆ ప్రదర్శనే ఇప్పుడు విండీస్‌ టూర్‌కు ఎంపికయ్యేలా చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని