World Cup 2023: ఇప్పుడొచ్చింది మ‌జా.. వన్డే ప్రపంచకప్‌లో ఎట్టకేల‌కు హోరాహోరీగా మ్యాచ్‌లు

వన్డే ప్రపంచకప్‌‌ (World Cup 2023)లో సగానికి పైగా మ్యాచ్‌లు అయిపోయాయి. సెమీస్ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటిదాకా టోర్నీలో ఎన్నో మెరుపు ప్రదర్శనలు చూశాం. కొన్ని సంచలన విజయాలూ నమోదయ్యాయి. కొన్ని జట్లు అంచనాలను మించి అదరగొడుతుంటే.. కొన్ని జట్లు స్థాయికి ఏమాత్రం తగని ప్రదర్శనతో వెనుకబడ్డాయి.

Published : 31 Oct 2023 16:36 IST

వన్డే ప్రపంచకప్‌‌ (World Cup 2023)లో సగానికి పైగా మ్యాచ్‌లు అయిపోయాయి. సెమీస్ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటిదాకా టోర్నీలో ఎన్నో మెరుపు ప్రదర్శనలు చూశాం. కొన్ని సంచలన విజయాలూ నమోదయ్యాయి. కొన్ని జట్లు అంచనాలను మించి అదరగొడుతుంటే.. కొన్ని జట్లు స్థాయికి ఏమాత్రం తగని ప్రదర్శనతో వెనుకబడ్డాయి. అంతా బాగానే ఉంది కానీ.. ప్రపంచకప్‌లో ఉత్కంఠతో ఊపేసిన మ్యాచ్‌లు ఎన్ని అని చూస్తే వేళ్ల మీద లెక్కబెట్టడం కూడా కష్టమవుతోంది. హోరాహోరీ పోరాటాలు లేకుండా.. చాలా వరకు ఏకపక్షంగా సాగిపోతూ.. ఫలితం మీద అసలు ఉత్కంఠ అన్నదే లేకుండా సాగిపోతున్న టోర్నీ సగటు క్రికెట్ అభిమానుల్లో నిరాసక్తత వ్యక్తమైంది. ఇలాంటి స‌మ‌యంలో వ‌రుస‌గా కొన్ని మ్యాచ్‌లు హోరాహోరీగా సాగ‌డంతో అభిమానుల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది.

శుక్రవారం దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ప్రపంచకప్‌లో ఇది 26వ మ్యాచ్. కానీ ఇప్పటిదాకా జరిగిన 25 మ్యాచ్‌ల్లో లేని ఉత్కంఠను ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లోనే ఆస్వాదించారు. నిజానికి ఇది కూడా ఏకపక్షంగా ముగిసే మ్యాచ్ లాగే కనిపించింది. అయిదు వికెట్లు చేతిలో ఉండగా.. 80 బంతుల్లో 36 పరుగులు చేయడం ఒక లెక్కా అనుకున్నారు. కానీ పాకిస్థాన్ గొప్పగా పుంజుకుని వరుసగా వికెట్లు తీస్తూ పోటీలోకి వచ్చింది. మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చింది. దక్షిణాఫ్రికా చేతిలో ఒక్క వికెట్టే ఉండగా 27 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన పరిస్థితి రావడంతో ఫలితం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్లలో బంతి బంతికీ ఉత్కంఠ పెరిగిపోయింది. చివరికి దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రపంచకప్ మొదలయ్యాక ఏ మ్యాచ్‌లోనూ లేని ఉత్కంఠ ముగింపు ఈ మ్యాచ్‌కు లభించింది. త‌ర్వాతి రోజే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ కూడా ఇలాగే ఉత్కంఠ‌భ‌రితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 388 ప‌రుగుల భారీ స్కోరు సాధించ‌గా.. అంత పెద్ద ల‌క్ష్యానికి కివీస్ చేరువ‌గా వ‌చ్చింది. కానీ చివ‌రి ఓవ‌ర్లో 19 ప‌రుగులు అస‌వ‌ర‌మైతే.. ఆ జ‌ట్టు 9 వికెట్లకు 383 ప‌రుగులే చేసి 5 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచ్ టోర్నీలో ఇదొక్కటే కావ‌డం విశేషం. ఈ మ్యాచ్‌లు చూశాక కానీ.. ప్రపంచకప్‌లో ఏం మిస్సవుతున్నామో అభిమానులకు అర్థం కాలేదు.

సంచలనాల్లోనూ ఏకపక్షాలే..

ఈ ప్రపంచకప్‌లో కొన్ని సంచలన ఫలితాలు వచ్చాయి. ఇంగ్లాండ్ జట్టు.. అఫ్గానిస్థాన్ చేతిలో ఓడిపోయింది. నెదర్లాండ్స్.. దక్షిణాఫ్రికాను ఓడించింది. అఫ్గాన్ తర్వాత పాకిస్థాన్ మీదా సంచలన విజయం సాధించింది. కానీ ఇలాంటి సంచలన ఫలితాల్లో కూడా మ్యాచ్‌లేమీ ఉత్కంఠభరితంగా జరగలేదు. అఫ్గానిస్థాన్ ఏకంగా 69 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓటమి చాలా ముందే ఖరారైపోయింది. ఇక దక్షిణాఫ్రికా మీద నెదర్లాండ్స్ కూడా 38 పరుగుల తేడాతో నెగ్గడాన్ని బట్టి ఆ మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా ఏమీ సాగలేదని అర్థం చేసుకోవచ్చు. ఆ మ్యాచ్‌లో మిల్లర్ వికెట్ పడగానే దక్షిణాఫ్రికా ఓటమి తప్పదని ముందే అర్థమైపోయింది. పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ కూడా 8 వికెట్ల తేడాతో నెగ్గింది. పాక్ పోటీలో లేకుండా ఏమీ లేదు కానీ.. అఫ్గాన్ సాధికారికంగానే గెలిచింది. మరీ ఉత్కంఠ ఏమీ లేదు. కాకపోతే మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే కొంచెం హోరాహోరీగా జరిగింది. నెదర్లాండ్స్‌పై శ్రీలంక కొంచెం కష్టపడింది కానీ.. 263 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఆ జట్టు మరీ ఏమీ కష్టపడలేదు. 10 బంతులుండగా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

చివరికి ఆ మ్యాచ్ కూడా..

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో మన జట్టే గెలవాలని అభిమానులు కోరుకున్నా.. ఆ మ్యాచ్‌ హోరాహోరీగా సాగాలని కోరుకుంటారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల పోరు ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో, ఎంత మజానిచ్చిందో తెలిసిందే. కానీ వన్డే ప్రపంచకప్‌లో మాత్రం ఈ రెండు జట్ల పోరు ఏకపక్షమైంది. పాక్ కేవలం 191 పరుగులకే కుప్పకూలగా.. లక్ష్యాన్ని భారత్ 117 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత్ ఆడిన మిగతా మ్యాచ్‌లు సైతం ఆశించినంత ఉత్కంఠభరితంగా ఏమీ సాగలేదు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో ఛేదన ఆరంభంలో తడబడ్డా చివరికి కానీ చివరికి 52 బంతులుండగానే 4 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌ భారత్‌కు గట్టి పోటీనే ఇచ్చింది కానీ.. చివర్లో భారత్ సులువుగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌ల గురించి చెప్పాల్సిన పని లేదు. పూర్తి ఏకపక్షం. ఇక టోర్నీలో మిగతా మ్యాచ్‌లేవీ కూడా హోరాహోరీగా సాగలేదు. ఉత్కంఠ రేకెత్తించలేదు. టీ20 ప్రపంచప్‌లో మాదిరి హోరాహోరీ పోరాటాలు.. ఉత్కంఠభరిత ముగింపులు లేకపోవడం వన్డే ప్రపంచకప్ పట్ల అభిమానుల్లో ఆసక్తిని త‌గ్గించేలా క‌నిపించింది. కానీ తాజా మ్యాచ్‌లు అభిమానుల్లో ఉత్సాహం తీసుకొచ్చాయి. సెమీస్ దిశ‌గా రేసు ఆస‌క్తిక‌రంగా సాగుతున్న నేప‌థ్యంలో మున్ముందు మ‌రిన్ని హోరాహోరీ పోరాటాలు చూడొచ్చేమో.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని