World Cup Final 2023: అహ్మదాబాద్‌.. కొట్టేనా జిందాబాద్‌

భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఆదివారం వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) ఆతిథ్యం ఇవ్వనుంది.

Published : 18 Nov 2023 16:58 IST

వాంఖడేలా టీమ్‌ఇండియాను గెలిపిస్తుందా? 

ముంబయిలోని వాంఖడే మైదానం.. ఈ పేరు వినగానే అక్కడ టీమ్‌ఇండియా (Team India) సాధించిన ఎన్నో ఘనతలు గుర్తుకొస్తాయి. ఎన్నో విజయాలు స్ఫూరిస్తాయి. తనకు సొంత మైదానమైన ఇక్కడ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ (Sachin Tendulkar) పరుగుల వరద పారించారు. రికార్డుల మోత మోగించారు. కానీ అదంతా 2011కు ముందువరకే. ఆ తర్వాత వాంఖడే అంటే.. ధోని సిక్సర్‌తో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలిచిన క్షణం, విరాట్‌ భుజాలపై సచిన్‌ ఊరేగిన దృశ్యం, రెండోసారి భారత్‌ వన్డే విశ్వవిజేతగా నిలిచిన వేళ మనసులోని నుంచి పెళ్లుబికిన కన్నీళ్లు.. ఇవే గుర్తుకొస్తాయి. 2011లో వాంఖడేలో ఫైనల్లో శ్రీలంకపై గెలిచిన భారత్‌ రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇప్పుడు మళ్లీ 12 ఏళ్ల తర్వాత 2023 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌ ఆడబోతోంది. ఇప్పుడు వేదిక అహ్మదాబాద్‌కు మారింది. మరి ప్రపంచలోని అతి పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) టీమ్‌ఇండియాకు  మరుపురాని బహుమతినిస్తుందా? ఇక్కడ కప్పుకు భారత్‌ మూడోసారి ముద్దు పెడుతుందా? 

కళ్లన్నీ ఇక్కడే.. 

సొంతగడ్డపై ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో.. అజేయ రికార్డు కొనసాగిస్తూ భారత్‌ ఫైనల్‌ చేరింది. ఆదివారం తుదిపోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దృష్టంతా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం మీదకు మళ్లింది. ప్రపంచంలోనే పెద్దదైన ఈ క్రికెట్‌ స్టేడియంలో లక్షా 32 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్‌ చూసే అవకాశముంది. 1982లో సర్దార్‌ పటేల్‌ స్టేడియంగా 54 వేల సీటింగ్‌ సామర్థ్యంతో ఇది ప్రారంభమైంది. మొతేరా స్టేడియంగానూ ప్రసిద్ధికెక్కింది. పాత స్టేడియం స్థానంలో కొత్త దాని నిర్మాణం 2015లో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్దదిగా మారిన ఈ స్టేడియాన్ని 2021లో పునఃప్రారంభించారు. ఈ మైదానంలో మొత్తం 11 పిచ్‌లున్నాయి. టెస్టు క్రికెట్లో సునీల్‌ గావస్కర్‌ 10 వేల పరుగుల మైలురాయిని చేరుకుంది ఇక్కడే. టెస్టుల్లో 432వ వికెట్‌తో అప్పుడు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కపిల్‌ దేవ్‌ రికార్డు సృష్టించింది కూడా ఇక్కడే. ఇక్కడ 1987, 1996 ప్రపంచకప్‌ల్లో ఒక్కో మ్యాచ్‌ జరిగింది. 2011 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. వన్డేల్లో 18 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా సచిన్‌ ఇక్కడే చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో సచిన్‌ తొలి డబుల్‌ సెంచరీని ఇక్కడే సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల కెరీర్‌ను, 30 వేల పరుగులను ఇక్కడే పూర్తిచేసుకున్నాడు. 

అజేయంగా..

ఈ స్టేడియంలో ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో భారత ఇప్పటివరకూ ఓడిపోలేదు. 1987లో జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. 2011 ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఈ ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఇప్పుడదే జోరు కొనసాగించి ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించాలనే భారత్‌ చూస్తోంది. ఓవరాల్‌గా ఇక్కడ ఇప్పటివరకూ 18 వన్డేలు ఆడిన భారత్‌ 10 మ్యాచ్‌ల్లో గెలిచి, 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. రికార్డులు చూస్తే అక్కడ అత్యధిక స్కోరు దక్షిణాఫ్రికా (2010లో భారత్‌పై 365/2) చేసింది. అత్యధిక పరుగులు ద్రవిడ్‌ (342), అత్యధిక వికెట్లు కపిల్‌ దేవ్‌ (10) సాధించారు. ఇక్కడి పిచ్‌ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా సహకరించే అవకాశముంది. నల్లమట్టి పిచ్‌పై ఫైనల్‌ జరిగే అవకాశముంది. ఈ టోర్నీలో జట్లు 400 పరుగులు చేసినా విజయంపై ధీమాగా ఉండలేని పరిస్థితి. కానీ ఈ ఫైనల్లో 315 పరుగుల స్కోరును కాపాడుకోవచ్చని స్థానిక క్యూరేటర్‌ చెప్పారు. మరోవైపు స్పిన్‌ పిచ్‌ రూపొందిస్తున్నారని, ఫైనల్లో సిరాజ్‌ స్థానంలో అశ్విన్‌ను ఆడించే అవకాశముందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మంచి బౌన్స్‌ లభించి ఇక్కడి పిచ్‌ సాధారణంగా పేసర్లకే ఎక్కువ అనుకూలమనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో జోరుమీదున్న మన పేస్‌ త్రయం మరోసారి చెలరేగి జట్టును విశ్వవిజేతగా నిలపాలని అభిమానులు కోరుకుంటున్నారు. వాంఖడే సరసన నరేంద్ర మోదీ స్టేడియం చేరాలని ఆకాంక్షిస్తున్నారు. 

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని