ODI WC 2023: భారత్‌తో తలపడేది ఎవరు? రెండు బెర్తుల కోసం నాలుగు జట్ల పోటీ.. సెమీస్ రేసు ఇలా..

వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) చివరి దశకు చేరింది. ఇప్పటికే రెండు జట్లు సెమీస్‌కు అర్హత సాధించగా.. మరో రెండు బెర్తుల కోసం తీవ్ర పోటీ నెలకొంది.

Updated : 08 Nov 2023 09:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత్‌, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్నాయి. లీగ్‌ దశలో 8 మ్యాచ్‌లు ఆడిన టీమ్ఇండియా అన్నింట్లోనూ విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అగ్రస్థానంతోనే భారత్‌ సెమీస్‌లోనూ ఆడనుంది. అయితే, ఎవరు ప్రత్యర్థిగా మారతారనేది ఆసక్తికరరంగా మారింది. ఎందుకంటే మిగతా రెండు సెమీస్‌ బెర్తుల కోసం నాలుగు జట్లు పోటీలో నిలిచాయి. ఇప్పుడా ఆ జట్ల పరిస్థితి ఎలా ఉందంటే?

ఆస్ట్రేలియా (10 పాయింట్లు)

ఆస్ట్రేలియా కూడా దాదాపు సెమీస్‌కు చేరుకోవడం ఖాయం. అయితే, ఏ స్థానమనేది మిగతా మ్యాచ్‌లు, జట్ల ఫలితాలపై ఆధార పడి ఉంది. 7 మ్యాచుల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లతో కొనసాగుతోంది. ఇంకా ఆ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అఫ్గాన్‌తో కాస్త ప్రమాదకరమే కానీ.. బంగ్లాదేశ్‌ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాకపోవచ్చు. రెండింట్లోనూ ఓడినా సెమీస్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. అది నెట్‌రన్‌రేట్‌పై ఆధారపడి ఉంది.


న్యూజిలాండ్‌ (8)

ఈ వరల్డ్‌ కప్‌లో భారత్‌ తర్వాత మొదట్లో సాధికారికంగా ఆడిన జట్టు కివీస్‌. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి సెమీస్‌ వైపు పరుగులు తీసింది. కానీ, ఆ తర్వాతే న్యూజిలాండ్‌ బోల్తా పడింది. మళ్లీ నాలుగు ఓటములను చవిచూసి సెమీస్‌ బెర్తు కోసం పోరాడాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ప్రస్తుతం 8 మ్యాచుల్లో నాలుగేసి విజయాలు, ఓటములతో ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్‌ శ్రీలంకతో నవంబర్ 9న తలపడనుంది. ఇందులో గెలిచినా సెమీస్‌కు చేరుతుందనే నమ్మకం లేదు. పాక్‌, అఫ్గాన్‌ తమ ఆఖరి మ్యాచుల్లో ఓడితేనే కివీస్‌ నాకౌట్‌ దశకు చేరుకుంటుంది. కివీస్‌కు ఓటమి ఎదురైతే మాత్రం సెమీస్‌ ఆశలు వదులుకోవాల్సిందే. నెట్‌రన్‌రేట్‌ ప్రకారం బెర్తు దక్కే అవకాశాలు తక్కువే.


పాకిస్థాన్‌ (8)

ఇప్పటి వరకు పాక్‌ ఆటతీరును చూసిన తర్వాత సెమీస్‌ రేసులో నిలుస్తుందని ఎవరూ భావించలేదు. అందుకే పాక్‌ను ఎవరి అంచనాలకు అందని జట్టుగా అభివర్ణిస్తుంటారు. ఈ వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచుల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో 8 పాయింట్లు సాధించింది. గత మ్యాచ్‌లో కివీస్‌పై అద్భుత విజయంతో నెట్‌రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకుంది. తన చివరి మ్యాచ్‌లో (నవంబర్ 11న) ఇంగ్లాండ్‌తో పాక్‌ ఆడనుంది. ఫామ్‌ పరంగా ఇంగ్లాండ్‌ గొప్పగా లేదు. పాక్‌ భారీ విజయం సాధిస్తే మాత్రం సెమీస్‌ బెర్తు ఖాయమవుతుంది. ఒక వేళ ఓడినా ఛాన్స్‌లు ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది.


అఫ్గానిస్థాన్‌ (8)

సంచలన విజయాలతో వరల్డ్‌ కప్‌ సెమీస్‌ రేసును రసవత్తరంగా మార్చిన జట్టు అఫ్గానిస్థాన్‌. ఇంగ్లాండ్‌ను ఓడించి తర్వాత కివీస్‌ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన అఫ్గాన్‌ పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా పాకిస్థాన్‌, శ్రీలంక, నెదర్లాండ్స్‌ను మట్టికరిపించి సెమీస్‌ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 7 మ్యాచుల్లో నాలుగు విజయాలు, మూడు ఓటములతో 8 పాయింట్లను సాధించింది. న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌తో పోలిస్తే సెమీస్‌ అవకాశాలు అఫ్గాన్‌కే ఎక్కువగా ఉన్నాయి. కానీ, తన చివరి రెండు మ్యాచ్‌ల్లో బలమైన జట్లతో తలపడాల్సి ఉండటమే అఫ్గాన్‌కు కాస్త ఇబ్బందికరం. ఆస్ట్రేలియాతో నవంబర్ 7న, దక్షిణాఫ్రికాతో నవంబర్ 10న అఫ్గాన్ ఆడనుంది. ఇప్పటికే సంచలన విజయాలు సాధించిన అఫ్గాన్‌ అలాంటి ప్రదర్శననే పునరావృతం చేసి ఒక్క మ్యాచ్‌ గెలిచినా సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. అఫ్గాన్‌ చివరి రెండు మ్యాచ్‌లను గెలిస్తే మాత్రం పాక్‌, న్యూజిలాండ్‌ ఇంటిముఖం పట్టాల్సిందే.

పాయింట్ల పట్టికలో భారత్‌ తొలి స్థానాన్ని ఎవరూ ఆక్రమించలేరు. రెండు, మూడు స్థానాల కోసం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య తీవ్ర పోటీ ఉండొచ్చు.  నాలుగో స్థానంలోకి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక సెమీస్‌లో తొలి స్థానంలో ఉన్న జట్టు.. నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో తలపడనుంది. రెండో స్థానంలో ఉన్న జట్టు, మూడో స్థానంలో ఉన్న జట్టుతో ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని