World Para Athletics Championships 2024: సుమిత్‌దే స్వర్ణం

ప్రపంచ పారా అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఒకేరోజు మూడు స్వర్ణాలు మన సొంతమయ్యాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సుమిత్‌ ఎఫ్‌-64, జావెలిన్‌త్రోలో పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. మంగళవారం తుదిపోరులో అతడు జావెలిన్‌ను 69.50 మీటర్లలో విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.

Updated : 22 May 2024 06:44 IST

మరియప్పన్, ఏక్తాలకూ పసిడి
ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ 

కోబె (జపాన్‌): ప్రపంచ పారా అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఒకేరోజు మూడు స్వర్ణాలు మన సొంతమయ్యాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సుమిత్‌ ఎఫ్‌-64, జావెలిన్‌త్రోలో పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. మంగళవారం తుదిపోరులో అతడు జావెలిన్‌ను 69.50 మీటర్లలో విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. మరో భారత అథ్లెట్‌ సందీప్‌ (60.41 మీ) కాంస్యం నెగ్గాడు. దులాన్‌ (శ్రీలంక, 66.49 మీ) రజతం సాధించాడు. గతేడాది హాంగ్జౌ పారా ఆసియాక్రీడల్లో 73.29 మీటర్లతో స్వర్ణం సాధించిన 25 ఏళ్ల సుమిత్‌.. ప్రపంచ రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు టోక్యో పారాలింపిక్స్‌ రజత విజేత తంగవేలు మరియప్పన్‌ సత్తా చాటాడు. టీ63, హైజంప్‌లో అతడు 1.88 మీటర్ల దూరం ఎగిరి స్వర్ణం సాధించాడు. అమెరికా అథ్లెట్లు ఎజ్రా (1.85 మీ),  సామ్‌ (1.82 మీ) రజత, కాంస్య పతకాలు గెలిచారు. గత ఎనిమిదేళ్లలో పెద్ద టోర్నీల్లో మరియప్పన్‌ గెలిచిన తొలి పసిడి ఇదే. 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణంతో అతడు వెలుగులోకి వచ్చాడు.

మెరిసిన ఏక్తా: ఎఫ్‌-51 క్లబ్‌ త్రోలో ఏక్తా బ్యాన్‌ స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో ఉత్తమంగా 20.12 మీటర్ల దూరం నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. మరో భారత అమ్మాయి కాశిష్‌ లక్రా (14.56 మీటర్లు) రజతం, బౌసెఫ్‌ (12.70 మీ, అల్జీరియా) కాంస్యం సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో మెరవడం ఏక్తాకు ఇదే తొలిసారి కాదు. గతేడాది హాంగ్జౌ పారా ఆసియా క్రీడల్లో ఆమె స్వర్ణ పతకాన్ని అందుకుంది. హరియాణా ప్రభుత్వంలో సివిల్‌ సర్వీసెస్‌ అధికారిగా పని చేస్తున్న 38 ఏళ్ల ఏక్తా.. టోక్యో పారాలింపిక్స్‌లోనూ పోటీపడింది. వైద్య రంగం వైపు వెళ్లాలని ఆమె అనుకున్నా.. 2003లో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై వెన్నుపూస దెబ్బతినడంతో ఆమె జీవితం మారిపోయింది. వీల్‌ఛైర్‌కే పరిమితమైంది. ఆ తర్వాత పారా క్రీడలను ఎంచుకుని క్లబ్‌త్రోలో రాణిస్తోంది. ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లోనూ సత్తా చాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు