WTC Final: నాలుగో టెస్టు డ్రా అయి.. శ్రీలంక క్లీన్‌స్వీప్‌ చేస్తే భారత్‌ ఇంటికే..

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమ్ఇండియా (Team India).. మూడో టెస్టులో ఓటమిపాలై డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రేసులో కాస్త వెనుకబడింది.

Published : 07 Mar 2023 17:47 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో మొదటి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా (Team India)కు మూడో టెస్టులో కంగారులు గట్టి షాకిచ్చారు. అనుహ్యమైన ఆటతీరుతో మూడో టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final) బెర్తును ఖరారు చేసుకుంది. అయితే, మిగిలిన మరో ఫైనల్‌ బెర్తు కోసం భారత్‌, శ్రీలంక పోటీపడుతున్నాయి. 2021-2023 డబ్ల్యూటీసీ చక్రంలో భారత్‌ ఇంకో మ్యాచ్‌ (ఆసీస్‌తో నాలుగో టెస్టు) ఆడనుంది. న్యూజిలాండ్‌తో శ్రీలంక రెండు టెస్టుల్లో తలపడనుంది. 

ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులో భారత్‌ విజయం సాధిస్తే.. శ్రీలంక, న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌తో సంబంధం లేకుండా నేరుగా WTC Finalకు దూసుకెళ్తుంది. ఒకవేళ భారత్‌, ఆసీస్‌ మధ్య జరిగే నాలుగో టెస్టు డ్రా అయి.. న్యూజిలాండ్‌పై శ్రీలంక 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆశలు గల్లంతవుతాయి. కానీ, కివీస్‌తో లంకేయులు క్లీన్ స్వీప్ చేయకుండా అంతకంటే తక్కువ తేడాతో విజయం సాధిస్తే భారత్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టులోనూ భారత్‌ ఓటమిపాలై, న్యూజిలాండ్‌పై సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే శ్రీలంక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. 

ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 నుంచి భారత్, ఆసీస్‌ మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. మార్చి 9 నుంచే న్యూజిలాండ్, శ్రీలంక రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. జూన్‌ 7-11 మధ్య లండన్‌లోని ది ఓవెల్ మైదానంలో  (WTC Final)ను నిర్వహించనున్నారు. జూన్‌ 12 తేదీని రిజర్వ్‌ డేగా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని