IPL 2023: టోర్నీ సగం ముగిసినా.. ఇంకా వీరి ఆట మొదలవలేదు!

ఐపీఎల్‌లో సగానికిపైగా మ్యాచ్‌లు ముగిసినా.. ఇంకా కొందరు ఆటగాళ్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అలాంటివారిలో సీనియర్లతోపాటు భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్నవారూ ఉండటం గమనార్హం.

Published : 01 May 2023 15:25 IST

ఇంటర్నెట్ డెస్క్: అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అన్న చందంగా ఐపీఎల్‌లో (IPL) కొందరి ఆటతీరు మారింది. తమపై ఫ్రాంచైజీలు ఉంచిన నమ్మకాలను నిలబెట్టుకోలేకపోతున్నారు. అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. కుర్రాళ్లు జోరుగా పరుగులు రాబడుతుంటే.. భారీగా ఆశలు పెట్టుకున్న కొందరు క్రికెటర్లు మాత్రం దారుణంగా విఫలమై జట్టుకు భారంగా మారామా..? అన్నట్లుగా తయారయ్యారు. మరి ఈ సీజన్‌లో అలాంటి ఆటగాళ్లు ఎవరో ఓ సారి తెలుసుకుందాం..

  1. ఆండ్రూ రస్సెల్‌: అత్యంత దారుణమైన ప్రదర్శన ఇస్తున్న క్రికెటర్లలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ ఒకడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచుల్లో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కోల్‌కతాను విజేతగా నిలిపే ఇన్నింగ్స్‌ ఒక్కటీ లేదు. ఇక బౌలింగ్‌లోనూ గొప్పగా రాణించలేదు. 12 ఓవర్లు వేసి 73 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఎక్కువగా బౌలింగ్‌ చేయడానికి కూడా అలిసిపోతున్నా.. కేకేఆర్‌ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది. అయితే, క్రీజ్‌లో కుదురుకుంటే మాత్రం భారీగా హిట్టింగ్‌ చేయగల సమర్థత రస్సెల్ సొంతం.
  2. పృథ్వీ షా: టీమ్‌ఇండియాలోకి అతడిని ఎందుకు తీసుకోవడం లేదు..? అని అభిమానుల నుంచి బీసీసీఐకి వచ్చే ప్రశ్న పృథ్వీషా విషయంలో జరిగింది. తీరా, ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన షా కేవలం 47 పరుగులే చేశాడంటే అతడి ఫామ్‌ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఓపెనర్‌గా వచ్చే పృథ్వీ కేవలం 8 బౌండరీలను మాత్రమే కొట్టాడు. స్ట్రైక్‌రేట్‌ (117.50) కూడా గొప్పగా ఏమీ లేదు. దీంతో అతడిని మేనేజ్‌మెంట్ కాస్త పక్కన పెట్టేసింది. 
  3. మొయిన్‌ అలీ: సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చే మొయిన్ అలీ అలవోకగా భారీ షాట్లు కొట్టగలడు. సీఎస్‌కే  ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్నప్పటికీ.. మొయిన్ అలీ నుంచి భారీ ఇన్నింగ్స్‌ మాత్రం రాలేదు. ఆ జట్టు ఓపెనర్లు రుతురాజ్‌, డేవన్‌ కాన్వేతోపాటు దూబె ఆడుతుండటంతో మొయిన్ అలీ రాణించకపోయినా నడిచిపోతోంది. అయితే, ఫ్లేఆఫ్స్‌ చేరిన తర్వాత ప్రతి మ్యాచూ కీలకం. ఈ సీజన్‌లో 8 మ్యాచుల్లో 7 ఇన్నింగ్స్‌ల్లోగాను 107 పరుగులు మాత్రమే చేశాడు. 
  4. అంబటి రాయుడు: సీఎస్‌కే ఆటగాడికి ఈ సీజన్‌ డిజాస్టర్. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చినా.. తన ప్రభావం పెద్దగా చూపించడం లేదు. 9 మ్యాచుల్లో 7 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేశాడు. కేవఅలం 83 పరుగులు మాత్రమే సాధించాడు. అదీనూ 136.07 స్ట్రైక్‌రేట్‌తో ఆ మాత్రం రన్స్ నమోదు చేశాడు. ఇలాగే కొనసాగితే ఇదే సీజన్‌ అతడికి చివరిదిగా మారే అవకాశం లేకపోలేదు. మిగతా మ్యాచుల్లో రాణించాల్సిన అవసరం ఉంది. 
  5. దినేశ్ కార్తిక్‌: గత సీజన్‌లో సూపర్ ‘ఫినిషర్’ అని అందరితో శభాష్‌ అనిపించుకున్న దినేశ్ కార్తిక్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత టీ20 ప్రపంచకప్‌లో విఫలమై విమర్శలపాలైన డీకే మీద ఆర్‌సీబీ నమ్మకం ఉంచినా.. నిలబెట్టుకోవడంలో విఫలమవుతూ ఉన్నాడు. మ్యాచ్‌లను ముగించాల్సిన కీలక సమయంలో ఔటై తీవ్ర నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచుల్లో అతడు చేసిన పరుగులు 83. ఐపీఎల్ 2022 సీజన్‌లో 200కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ఆడిన డీకే స్ట్రైక్‌రేట్ ఇప్పుడు మాత్రం 131.75 కావడం గమనార్హం. 
  6. సునీల్ నరైన్: కోల్‌కతా జట్టులో మరో సీనియర్‌ ఆటగాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో జట్టుకు అండగా నిలవాల్సిన సునీల్‌ నరైన్లో మునుపటి వేగం లోపించింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. గత సీజన్‌లో ఓపెనర్‌గా వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు మాత్రం భారీ షాట్లు కొట్టే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో 9 మ్యాచుల్లో 7 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసిన సునీల్ కేవలం 13 పరుగులను మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ కేవలం ఏడు వికెట్లను తీశాడు. మిస్టరీ స్పిన్నర్‌ అయిన అతడు భారీగా పరుగులు సమర్పించేశాడు. 
  7. రియాన్‌ పరాగ్: తన వింత చేష్టలతో సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న రియాన్‌ పరాగ్‌.. ఆట మాత్రం ఘోరంగా ఉంది. ఐదు మ్యాచుల్లో 112.50 స్ట్రైక్‌రేట్‌తో 54 పరుగులను మాత్రమే చేశాడంటే అతడి ఫామ్ పరిస్థితి అర్థమైపోతుంది. గత సీజన్‌లో ఉన్నంత దూకుడుగా ఈసారి ఆడలేకపోయాడు. దీంతో నాలుగు మ్యాచుల్లో ఆర్‌ఆర్‌ మేనేజ్‌మెంట్ పక్కన పెట్టేసింది. అతడికి అవకాశాలు ఇవ్వడంపై ఆరంభంలో నెట్టింట తీవ్రమైన విమర్శలు వచ్చాయి. 
  8. హ్యారీ బ్రూక్: రూ. 13.25 కోట్లను వెచ్చించి మరీ కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. మిగిలిన మ్యాచుల్లో అతడి గణాంకాలను చూస్తే దారుణంగా ఉంది. కోల్‌కతాపై సరిగ్గా శతకం బాదిన బ్రూక్.. మిగతా ఏడు మ్యాచుల్లో చేసిన పరుగులు కేవలం 63 మాత్రమే. మిడిలార్డర్‌లో పంపించినా తన ప్రదర్శనలో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో అతడికి భారీ మొత్తం వృథా అనే  కామెంట్లు వచ్చాయి. మీమ్స్‌ తెగ హడావుడి చేసేశాయి. 
  9. వీరు ముగ్గురు కూడానూ: రాహుల్‌ త్రిపాఠి, మయాంక్‌ అగర్వాల్, ఐదెన్ మార్‌క్రమ్ నుంచి కూడా సరైన ప్రదర్శన రాలేదు. గతేడాది దూకుడును త్రిపాఠి కొనసాగించలేకపోతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఇప్పటి వరకు త్రిపాఠినే (170) టాప్‌ స్కోరర్.  కానీ, బ్యాటింగ్ ప్రదర్శన గొప్పగా లేదు. కెప్టెన్ మార్‌క్రమ్‌ కూడా పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్నాడు. ఏడు మ్యాచుల్లో 132 పరుగులను మాత్రమే చేశాడు. మయాంక్‌ అగర్వాల్ (169 పరుగులు) తన సీనియరిటీకి తగ్గ బ్యాటింగ్‌ చేయడం లేదు. పవర్‌ప్లేలోనూ మరీ నెమ్మదిగా ఆడేస్తూ విమర్శలపాలవుతున్నాడు. 
  10. వృద్ధిమాన్ సాహా: గతేడాది ఓపెనర్‌గా వీరవిహారం చేసిన సీనియర్ ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా ఈసారి మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోతున్నాడు. మరోవైపు శుభ్‌మన్‌ గిల్ దూకుడుగా ఆడేస్తుంటే.. సాహా వెనుకబడిపోయాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచులు ఆడిన సాహా 151 పరుగులను మాత్రమే చేశాడు. స్ట్రైక్‌రేట్‌ కూడా గొప్పగా లేదు. ఓపెన్‌ర్‌గా వచ్చే సాహా 130.17 స్ట్రైక్‌రేట్‌తోనే ఆడటం గమనార్హం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని