Cricket News: దూకుడే యశస్వి బలం.. క్రికెట్‌కు విండీస్‌ స్టార్‌ గుడ్‌బై!

టీమ్‌ఇండియా (Team India) యువ సంచలనం యశస్వి జైస్వాల్‌పై  కేకేఆర్‌ సహాయక కోచ్‌ అభిషేక్ నాయర్ ప్రశంసలు కురిపించాడు. వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు డారెన్ బ్రావో క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..

Updated : 26 Nov 2023 15:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) యువ సంచలనం యశస్వి జైస్వాల్‌పై  కేకేఆర్‌ సహాయక కోచ్‌ అభిషేక్ నాయర్ ప్రశంసలు కురిపించాడు. వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు డారెన్ బ్రావో క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..

యశస్వి.. నువ్వు అలాగే ఆడేయాలి: అభిషేక్ నాయర్‌

ఆసీస్‌తో టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యం ఉన్నా సరే టీమ్‌ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ మాత్రం ఎలాంటి బెదురు లేకుండా ఆడాడు. కేవలం 8 బంతుల్లోనే 21 పరుగులు సాధించాడు. త్వరగానే పెవిలియన్‌కు చేరినా.. దూకుడుగా ఆడటమే అతడి బలమని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహాయ కోచ్ అభిషేక్ నాయర్‌ ప్రశంసించాడు. ఆడిన ఎనిమిది బంతుల్లోనే రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టేడయం అభినందనీయమని వ్యాఖ్యానించాడు. ‘‘ ఇదే జైస్వాల్ అసలైన బలం. క్రీజ్‌లో కుదురుకోవడానికి మరీ ఎక్కువ సమయం తీసుకోడు. స్వేచ్ఛగా పవర్‌ప్లేలో పరగులు రాబట్టేస్తాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ ముంబయి తరఫున ఇదే ఆటతీరు ప్రదర్శించాడు. ఇప్పుడు ఆడుతున్న ఆటతీరునే మున్ముందు కొనసాగించాలి’’ అని నాయర్‌ అన్నాడు.


కొత్తతరం కోసం వైదొలుగుతున్నా: బ్రావో

వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. విండీస్‌ ప్రపంచకప్‌నకు అర్హత సాధించని విషయం తెలిసిందే. తన రిటైర్‌మెంట్‌పై బ్రావో సోషల్ మీడియా వేదికగా ప్రకటన వెలువరించాడు. ‘‘భవిష్యత్తు గురించి ఇంకా ఏం ఆలోచించలేదు. దాని కోసం మరికొంత సమయం తీసుకుని నిర్ణయం వెల్లడిస్తా. జాతీయ జట్టు కోసం శక్తివంచన లేకుండా కష్టపడ్డా. మేనేజ్‌మెంట్ నుంచి సరైన సమాచారం లేకపోవడంతో అంధకారంలోకి నెట్టేసినట్లు అనిపించింది. మూడు ఫార్మాట్లలో దాదాపు 45 మంది ఆటగాళ్లు విండీస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, అందులో నాకు చోటు దక్కలేదు. దేశవాళీ టోర్నీల్లో అత్యుత్తమంగా ఆడి భారీగా పరుగులు చేసినా ఫలితం లేదు. దీంతో క్రికెట్‌ నుంచి వైదొలగడమే మంచిదనే నిర్ణయానికి వచ్చా. భవిష్యత్తు తరాల కోసం స్థానం ఉంచాల్సిన అవసరం ఉంది. నా డ్రీమ్‌లో ఇప్పటి వరకు బతికేశా. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని బ్రావో పోస్టు పెట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని