Yashasvi Jaiswal: యశస్వి హాఫ్ సెంచరీ.. మరోసారి రికార్డుల మోత!

విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు (WI vs IND) మ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు యశస్వి, రోహిత్‌తోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అర్ధశతకాలు సాధించారు. ప్రస్తుతం తొలి రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 288/4 స్కోరుతో కొనసాగుతోంది.

Updated : 21 Jul 2023 08:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (57) తన ఫామ్‌ను కొనసాగిస్తూ విండీస్‌తో రెండో టెస్టులోనూ (WI vs IND) హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో ఓపెనర్‌గా తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా అవతరించాడు. యశస్వి తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులు, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేశాడు. దీంతో మొత్తం 228 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (303) అందరి కంటే ముందున్నాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ రోహిత్‌దే అగ్రస్థానం కాగా.. సిడ్నీ బార్న్స్‌ (265), డేవిడ్‌ లాయిడ్‌ (260), బిల్‌ వుడ్‌ఫుల్ (258), నిషాన్ మధుసంక (234) యశస్వి కంటే ముందున్నారు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా (224), గ్రేమ్‌ స్మిత్ (224) ఉండటం గమనార్హం. 

భారత్‌ @ 99

భారత్‌ తరఫున తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ (Yashsvi Jaiswal) రికార్డు సృష్టించాడు. యశస్వి కంటే ముందు రోహిత్ శర్మ (303), సౌరభ్‌ గంగూలీ (267).. ఆ తర్వాత శిఖర్ ధావన్‌ (210) ఉన్నారు. అయితే, డెబ్యూ చేసిన తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా శిఖర్ ధావన్‌ (187 పరుగులు) కొనసాగుతున్నాడు. విండీస్‌తో రెండో టెస్టులోనూ రోహిత్ (80) హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా టెస్టు ఫార్మాట్‌లో 2000 పరుగుల మైలురాయిని అతడు దాటేశాడు. 

మరి కొన్ని విశేషాలు

  • యశస్వి జైస్వాల్‌తో కలిసి రోహిత్ రెండోసారి వంద పరుగుల (139) భాగస్వామ్యం నిర్మించాడు. విండీస్‌పై పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా పర్యాటక జట్టు ఓపెనింగ్‌ బ్యాటర్లు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్ - యశస్వి జోడీ మూడో స్థానం దక్కించుకుంది. 
  • ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు బాయ్‌కాట్ - డెన్నిస్‌ అమిస్ (1974లో) 229 పరుగులు, ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆర్థూర్ -మెక్‌డొనాల్డ్ (1955లో) 191 పరుగులు జోడించారు. 
  • నాలుగోస్థానంలో అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాటర్‌ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం విండీస్‌తో రెండో టెస్టులో విరాట్ (87*) హాఫ్ సెంచరీ చేసి కొనసాగుతున్నాడు. దీంతో ఇప్పటి వరకు 7,097 పరుగులు చేసినట్లయింది. ఈ జాబితాలో సచిన్ (13,492 పరుగులు), మహేల జయవర్థనె (9,509), కలిస్ (9,033), బ్రియాన్‌ లారా (7,535) ఉన్నారు.  
  • అంతర్జాతీయ క్రికెట్‌లో పాతిక వేలకుపైగా పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గానూ విరాట్ నిలిచాడు. కలిస్‌ను (25,534) అధిగమించిన విరాట్ 25,548 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్‌లోనూ సచిన్‌దే అగ్రస్థానం. మొత్తం 34,357 పరుగులతో అతడు టాపర్‌గా ఉన్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని