Yashasvi Jaiswal: ఉప్పల్‌ టెస్టులో మిస్‌.. ఈసారి సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సెంచరీతో అదరగొట్టేశాడు. తొలి టెస్టులో కొద్దిలో మిస్‌ చేసుకున్న శతకాన్ని ఈసారి అందుకొన్నాడు.

Updated : 02 Feb 2024 15:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20ల్లో దూకుడైన ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) టెస్టుల్లోనూ అదరగొట్టేస్తున్నాడు. కేవలం ఆరు టెస్టుల్లోనే రెండు శతకాలు బాదాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. అంతకుముందు ఉప్పల్‌ మ్యాచ్‌లో  శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇప్పుడు వైజాగ్‌ టెస్టులో ఆ పొరపాట్లు పునరావృతం చేయకుండా.. మూడంకెల మార్క్‌ను అందుకున్నాడు. ఆరంభంలో నిలకడగా ఆడిన యశస్వి ఆ తర్వాత జోరు పెంచి 151 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో జైస్వాల్ (80) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్‌ రోహిత్ శర్మతో కలిసి మొదటి వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. సెంచరీకి దగ్గర్లో తొందరపాటుతో వికెట్‌ సమర్పించుకున్నాడు. ఇంగ్లాండ్‌ పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ జోరూట్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించాడు. కానీ, బౌలర్‌కే రిటర్న్‌ క్యాచ్‌ వెళ్లడంతో యశస్వి నిరాశగా పెవిలియన్‌ చేరాడు. ఇప్పుడు రెండో టెస్టులో మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

మరికొన్ని విశేషాలు..

  • ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇప్పటివరకు భారత్‌ తరఫున తొలి శతకం ఇదే. 
  • యశస్వి కెరీర్‌లో ఇది రెండో శతకం కాగా.. స్వదేశంలో మొదటిది. అంతకుముందు విండీస్‌పై  భారీ సెంచరీ సాధించాడు.
  • ఇంగ్లాండ్‌పై స్వదేశంలో సెంచరీ చేసిన 15వ భారత ఓపెనర్‌ యశస్వి. చివరిసారిగా రోహిత్ శర్మ 2021లో శతకం సాధించాడు.
  • 23 ఏళ్లలోపే.. స్వదేశీ, విదేశీ పిచ్‌ల్లో టెస్టు సెంచరీలు చేసిన నాలుగో భారత బ్యాటర్ యశస్వి. అంతకుముందు సచిన్‌, రవిశాస్త్రి, వినోద్ కాంబ్లి ఈ ఘనతను సాధించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు