Yashasvi Jaiswal: అది నా తప్పే.. రుతురాజ్‌కు ‘సారీ’ చెప్పా: యశస్వి జైస్వాల్‌

భారత బ్యాటింగ్‌ యువ సంచలనం యశస్వి జైస్వాల్‌.. తన సహచరుడు రుతురాజ్‌కు సారీ చెప్పాడట. ఇక రెండో టీ20లో అతడు ఓ రికార్డును బద్దలు కొట్టాడు.

Updated : 27 Nov 2023 10:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20లో భారత్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చిన యువ సంచలనం యశస్వి జైస్వాల్‌.. తన పార్ట్‌నర్‌ రుతురాజ్‌కు సారీ చెప్పాడట. ఈ విషయాన్ని మ్యాచ్‌ అనంతరం ఇంటర్వ్యూలో స్వయంగా జైస్వాలే వెల్లడించాడు. వైజాగ్‌లో తొలి టీ20లో జరిగిన రనౌట్‌ ఘటనను అతడు గుర్తు చేసుకుంటూ..‘‘గత మ్యాచ్‌లో రనౌట్‌ నా తప్పే. అందుకు నేను రుతు భాయ్‌కు సారీ చెప్పాను. నా తప్పును అంగీకరించాను. అతడు చాలా మంచి వ్యక్తి.. జాగ్రత్తగా ఉంటాడు’’ అని యశస్వి వెల్లడించాడు.

ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా ఘన విజయం

ఇక రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌ విషయంలో తనకు కెప్టెన్‌ సూర్యకుమార్‌, కోచ్‌ లక్ష్మణ్‌ నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని జైస్వాల్‌ వివరించాడు. ‘‘మైదానంలో స్వేచ్ఛగా ఆడు అని మ్యాచ్‌కు ముందు సూర్య భాయ్‌, కోచ్‌ లక్ష్మణ్‌ నాకు చెప్పారు. దీంతో నేనేంటో మైదానంలో చూపించాలనుకున్నాను. నామటుకు నేను ఆటను మెరుగుపర్చుకోవాలని అనుకుంటాను. అంతకు మించి మరేదీ ఆలోచించను. నేను ఇప్పటికీ ఆట నేర్చుకుంటున్నాను. అన్ని రకాల షాట్లను మరింత సానబట్టాలని భావిస్తున్నా. ఈ దశలో మానసిక దృఢత్వం చాలా ముఖ్యం. నేను ఆ దిశగా పనిచేస్తున్నాను’’ అని జైస్వాల్‌ తన ప్రణాళికను వివరించాడు. ఈ మ్యాచ్‌ తనకు పూర్తిగా ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. నిర్భయంగా షాట్లు కొట్టానని చెప్పాడు. అంతేకాదు.. తాను షాట్ల ఎంపిక విషయంలో కూడా చాలా స్పష్టంగా ఉన్నట్లు వెల్లడించాడు. 

పవర్‌ ప్లేలో రికార్డు స్థాయి పరుగులు..

భారత్‌-ఆసీస్‌ మధ్య జరిగిన రెండో టీ20లో యశస్వి జైస్వాల్‌ కేవలం 25 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 53 పరుగులు చేశాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే అర్ధ శతకం సాధించిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో ఈ జాబితాలో రోహిత్‌(50), కేఎల్‌ రాహుల్‌ (50) ఉన్నారు. పవర్‌ ప్లేలో భారత బ్యాటర్‌ చేసిన అత్యధిక పరుగులు కూడా యశస్వి చేసిన 53 కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ (52), రుతురాజ్‌ (58), రింకుసింగ్‌ మెరుపు వేగంతో 9 బంతుల్లో 31 పరుగులు చేయడంతో భారత్‌ 235 స్కోర్‌ చేసింది. బౌలింగ్‌లో ప్రసిద్ధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్‌ చెరో మూడు వికెట్లు తీయడంతో భారత్‌ విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు