Yashasvi Jaiswal: ఇంగ్లాండ్‌పై డబుల్‌ సెంచరీ.. ఐసీసీ ర్యాంకుల్లో దూసుకొచ్చిన యశస్వి

పరుగులు చేస్తే ఆటోమేటిక్‌గా ర్యాంకుల్లోనూ మెరుగుదల కనిపిస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ యశస్వి జైస్వాల్‌. 

Published : 21 Feb 2024 16:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అద్భుత ఫామ్‌లో ఉన్న భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఐసీసీ ర్యాంకుల్లోనూ దూసుకొచ్చాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌పై డబుల్‌ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇది రెండో ద్విశతకం. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో యశస్వి (699 పాయింట్లు) ఏకంగా 14 ర్యాంకులు ముందుకొచ్చి బ్యాటింగ్‌ విభాగంలో 15వ స్థానానికి చేరాడు. 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకొన్నాడు. బ్యాటింగ్‌ జాబితాలో విరాట్ కోహ్లీ (752) ఒక్కడే టాప్‌-10లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాపై వరుసగా సెంచరీలు చేసిన న్యూజిలాండ్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌ (893) అగ్రస్థానంలో ఉన్నాడు. 

ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టులో సెంచరీ చేసిన రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్‌ ర్యాంకుల్లో ఏడు స్థానాలను మెరుగుపర్చుకుని 34వ ర్యాంక్‌కు చేరాడు. బౌలింగ్‌ విభాగంలోనూ మూడు స్థానాలు ముందుకొచ్చి ఆరో ర్యాంక్‌ సాధించాడు. ఈ జాబితాలో భారత్‌ స్టార్‌బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా (876), రవిచంద్రన్ అశ్విన్ (839) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (469)దే అగ్రస్థానం. రెండో ర్యాంకులో అశ్విన్ (330), నాలుగో స్థానంలో అక్షర్ పటేల్ (281) ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని