Tom Hartley - Shamar Joseph: అటు ఏడు.. ఇటు ఏడు.. కథ మార్చిన కుర్రాళ్లు

సొంత గడ్డపై తిరుగులేదు అనుకున్న భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఇద్దరు యువ బౌలర్లు అడ్డుగా నిలిచారు. తమ టీమ్‌లను విజయతీరాలకు చేర్చారు.

Updated : 29 Jan 2024 18:57 IST

భారత్‌-ఇంగ్లాండ్ (IND vs ENG), ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ (AUS vs WI).. ఈ రెండు జట్ల మధ్య టెస్టులు మొదలవగానే అభిమానుల్లో ఆసక్తి కూడా అదేస్థాయిలో పెరిగింది. ఇటీవల టెస్టులు కూడా ఆసక్తిగా సాగుతుండటమే దీనికి కారణం. ఈ అంచనాలకు తగ్గట్టే ఫలితాలు కూడా వచ్చాయ్‌! సొంత గడ్డపై తిరుగులేదు అనుకున్న భారత్, ఆస్ట్రేలియా ఓటమి వైపు నిలవగా.. అనూహ్యంగా విజృంభించిన ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ విజయాలతో అదరగొట్టాయి. దీనికి ప్రధాన కారణం ఓ స్పిన్నర్‌.. మరో పేసర్‌! కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న హార్ట్‌లీ ఏడు వికెట్లతో టీమ్‌ఇండియాను చుట్టేస్తే.. పరాజయం కనుచూపు మేరలో ఉన్నా కూడా అసాధారణ బౌలింగ్‌తో ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు పేసర్‌ షమార్‌ జోసెఫ్‌. 

హార్ట్‌లీ గొప్పగా

బలమైన భారత బ్యాటింగ్‌ లైనప్‌కు 231 లక్ష్యం మరీ పెద్దదేం కాదు. కానీ గతంలో భారత పిచ్‌లపై ఆడిన అనుభవం లేకపోయినా.. స్టార్‌ బ్యాటర్లకు బౌలింగ్‌ చేస్తున్నా స్పిన్నర్‌ హార్ట్‌లీ ఏమాత్రం తడబడలేదు. వికెట్‌ నుంచి సహకారం అందుకున్న ఈ కుర్రాడు.. తాను అనుకున్న ప్రదేశాల్లో బంతులు వేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. బ్యాటర్లకు షాట్లు ఆడేందుకు ఎక్కువ విడ్త్‌ ఇవ్వకుండా ఆఫ్‌ స్టంప్‌పై స్థిరంగా బంతులు వేసి అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు. తక్కువ ఎత్తులో బంతులు వెళ్లేలా వేస్తూ కెప్టెన్‌ రోహిత్‌శర్మతో పాటు టాప్‌ఆర్డర్‌ను కూల్చాడు. ఇదే భారత పతనానికి నాంది అయింది. పిచ్‌పై స్కిడ్‌ అవుతూ వస్తున్న బంతులను ఆడేందుకు టీమ్‌ఇండియా బ్యాటర్లు చాలా ఇబ్బందిపడ్డారు. వేగంలో మార్పులు చేస్తూ ఒక్కోసారి స్పీడ్‌గా మరోసారి నెమ్మదిగా బంతులు వేసి హార్ట్‌లీ భారత బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. ఫలితం భారత్‌కు పరాభవం. ఇంగ్లాండ్‌కు ఊహించని విజయం. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఒలీ పోప్‌ (196) ఇన్నింగ్స్‌ కూడా వెల కట్టలేనిదే అయినప్పటికీ.. బలమైన భారత్‌ లైనప్‌ను సొంతగడ్డపై కుప్పకూల్చిన హార్ట్‌లీకే ఎక్కువ ఘనత దక్కుతుంది.

షమార్‌ అనూహ్యంగా

పాదానికి గాయమైతే బరిలో దిగడమే కష్టం. అలాంటిది ఏకంగా ఏడు వికెట్లు తీసి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించడమంటే.. ఇలా అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు వెస్టిండీస్‌ యువ పేసర్‌ షమార్‌ జోసెఫ్‌. ఆస్ట్రేలియాతో అరంగేట్ర టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లోనే 5 వికెట్లు పడగొట్టి ఎవరీ కుర్రాడు అని అందర్నీ తనవైపు తిప్పుకున్న జోసెఫ్‌.. రెండో టెస్టులో విశ్వరూపం చూపించాడు. టీమ్‌ఇండియా మాదిరే ఆస్ట్రేలియా ముంగిట కూడా ఛేదించదగ్గ లక్ష్యమే ఉంది. 216 పరుగులు సాధించడం అంటే సొంతగడ్డపై ఆసీస్‌కు పెద్ద కష్టమేమీ కాదు. పైగా ఓపెనర్‌ స్టీవ్‌స్మిత్‌ జోరు మీద కనిపించాడు. కామెరూన్‌ గ్రీన్‌ కూడా సత్తా చాటినా, ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. దీనికి కారణం షమార్‌ జోసెఫ్‌. పాదం గాయాన్ని కూడా లెక్క చేయకుండా మళ్లీ బరిలోకి దిగిన ఈ పేసర్‌..అద్భుతమైన బౌలింగ్‌తో ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేశాడు. 7 వికెట్లు తీసి వెస్టిండీస్‌కు అపూర్వ విజయాన్ని అందించాడు 27 ఏళ్ల తర్వాత కంగారూ గడ్డపై కరేబియన్‌ జట్టుకు గెలుపు రుచి చూపించాడు. ఎన్నోఏళ్ల తర్వాత విండీస్‌ అభిమానులకు అసలైన టెస్టు వినోదాన్ని అందించాడు. 

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని