Yuvraj Singh: పంత్‌ ఉంటేనే బాగుంటుంది

టీ20 ప్రపంచకప్‌లో సంజు శాంసన్‌ కన్నా రిషబ్‌ పంతే వికెట్‌ కీపర్‌గా ఉంటే బాగుంటుందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు.

Published : 23 May 2024 02:34 IST

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌లో సంజు శాంసన్‌ కన్నా రిషబ్‌ పంతే వికెట్‌ కీపర్‌గా ఉంటే బాగుంటుందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ప్రపంచకప్‌లో సత్తా చాటుతాడనే విశ్వాసం అతడు వ్యక్తం చేశాడు. ‘‘నేనైతే వికెట్‌కీపర్‌గా రిషబ్‌నే ఎంచుకుంటా. సంజు కూడా గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. కానీ రిషబ్‌ ఎడమచేతి వాటం బ్యాటర్‌. అతడిలో భారత్‌కు విజయాలను అందించే సత్తా అపారంగా ఉంది. గతంలో అలా గెలిపించాడు కూడా’’ అని యువరాజ్‌ చెప్పాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు ఐపీఎల్‌లో సత్తా చాటినా.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య మాత్రం లయను అందుకోలేకపోయాడు. కానీ హార్దిక్‌ టీ20 ప్రపంచకప్‌లో బాగానే ఆడతాడని యువి భావిస్తున్నాడు. ‘‘మంచి విషయమేంటంటే.. జట్టు ఎంపికలో ముందు అంతర్జాతీయ క్రికెట్లో ప్రదర్శనను, ఆ తర్వాతే ఐపీఎల్‌లో ఆటను పరిగణనలోకి తీసుకున్నారు. కేవలం ఐపీఎల్‌ ఫామ్‌నే లెక్కలోకి తీసుకోలేదు. ఐపీఎల్‌లో హార్దిక్‌ బాగా ఆడలేదు. కానీ భారత జట్టు తరఫున ఎలాంటి ప్రదర్శన చేశాడో చూడండి. అతడు జట్టులో ఉండడం ముఖ్యం. హార్దిక్‌ బౌలింగ్‌ చాలా ముఖ్యంగా కాబోతోంది. అతడి ఫిట్‌నెస్‌ కూడా. ప్రపంచకప్‌లో అతడు ప్రత్యేక ప్రదర్శన చేస్తాడని అనిపిస్తోంది’’ అని యువరాజ్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని