మన చిప్‌.. మన గర్వ కారణం!

Eenadu icon
By Technology News Desk Updated : 10 Sep 2025 04:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

సెమీకండక్టర్‌ను పరీక్షిస్తున్న యంత్రం

సెమీకండక్టర్‌ చిప్‌ తయారీలో మనదేశం గొప్ప మైలురాయిని చేరుకుంది. ఒకప్పుడు తైవాన్, బ్రెజిల్‌ వంటి దేశాల నుంచి చిప్స్‌ దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు దేశీయంగా తయారు చేసుకునే స్థితికి చేరుకున్నాం. తాజాగా ధన్‌బాద్‌లోని ఐఐటీ ఐఎస్‌ఎం (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ‘ఏపీఈసీ 1’ చిప్‌ రూపొందించి సంచలనం సృష్టించింది. దీనికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ రాజీవ్‌ రంజన్‌తో ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా ముచ్చటింది. మనకు గర్వకారణంగా నిలుస్తున్న ఈ చిప్‌ కథ, ప్రత్యేకతలేంటో చూద్దాం. 

స్మార్ట్‌గ్లాసెస్‌ కోసం

  • ఏపీఈసీ 1 చిప్‌ను చూపు కోల్పోయినవారికి ఉపయోగపడే స్మార్ట్‌గ్లాసెస్‌ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. డేటా నిల్వ, తక్కువ విద్యుత్తు, అత్యధిక సామర్థ్యం అవసరమైన అప్లికేషన్లలో ఇది ఉపయోగపడుతుంది. సీపీయూలు, ఎన్‌ఎం ఆర్కిటెక్చర్, రక్షణ వ్యవస్థల్లోనూ ఉపయోగించుకోవచ్చు. స్వల్ప ఆర్కిటెక్చర్‌ మార్పులతో వేర్వేరు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు. ప్రయోగ్మాతక చిప్‌ను మరింత మెరుగుపరచటానికీ ప్రయత్నిస్తున్నారు. ఇందులో బ్రెయిన్‌ న్యూరోస్ట్రక్చర్‌ మెరుగుపరచటానికి, అదనపు సామర్థ్యాలను జోడించటానికీ పరిశోధన జరుగుతోంది. 

2023లో మొదలు

  • చిప్‌ రూపకల్పన ప్రక్రియ 2023లో మొదలైంది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్రాథమికంగా రూ.1.12 కోట్లు కేటాయించింది. చిప్‌ డిజైన్‌ కోసం మొదట్లో చాలా ఇబ్బందులే ఎదురయ్యాయి. ఎన్నో విఫల ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు సర్క్యూట్‌ను డిజైన్‌ చేశారు. దీన్ని మొహాలీలోని సెమీకండక్టర్‌ ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడ దాన్ని తయారుచేశాక ఐఐటీ ఐఎస్‌ఎంకు అప్పగించారు. తక్కువ విద్యుత్తును వాడుకునే దీన్ని మెమ్రిస్టర్‌ ఎమ్యులేటర్‌గా పిలుచుకుంటున్నారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే రెండు రోజుల వరకూ పనిచేస్తుంది.

చిప్‌ డిజైన్‌ నమూనా 


స్వావలంబన దిశగా

ఇటీవల దిల్లీలో జరిగిన సెమికాన్‌ ఇండియా 2025 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సమక్షంలో ఏపీఈసీ 1 చిప్‌ ఎంతగానో ఆకట్టుకుంది. సెమీకండక్టర్‌ చిప్స్‌ టెక్నాలజీలో మనదేశ పురోగతిని ఇది  చాటి చెప్పింది. అంతేకాదు టారిఫ్‌ యుద్ధాల వంటి అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో స్వాలంబన దిశగా మరో ముందడుగుకు నిదర్శనంగా నిలిచింది. దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గించటమే కాదు, సెమీకండక్టర్‌ పరిశ్రమలో మన ఉనికిని బలోపేతం చేయనుంది.  
- ఈటీవీ భారత్‌ టెక్‌ టీమ్‌


‘‘చిప్‌ తయారీ మాకెంతో గర్వకారణమైన విషయం. ఐఐటీ ఐఎస్‌ఎం గతంలో డిజైన్‌ చేసిన చిప్స్‌ బెల్జియంలో తయారయ్యేవి. తాజా ఏపీఈసీ 1 చిప్‌ పూర్తిగా మనదేశంలోనే తయారైంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ దిశగా ఇదొక గొప్ప ముందడుగు. దిగుమతుల మీద ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుంది. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం కింద సెమీకండక్టర్‌ చిప్‌ తయారీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. ఈ రంగంలో యువతకు చాలా అవకాశాలున్నాయి. పరిశోధనలు ఇంకా జరగాల్సి ఉంది. వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌లో కెరీర్‌ను సృష్టించుకోవాలని యువతను కోరుతున్నా. పురోగమనిస్తున్నకొద్దీ కొత్త ఆవిష్కరణలెన్నో పుట్టుకొస్తాయి’’
- ప్రొఫెసర్‌ రాజీవ్‌ కుమార్‌ రంజన్, ఐఐటీ ఐఎస్‌ఎం

Tags :
Published : 10 Sep 2025 00:48 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు