Alexandr Wang: టీనేజర్లూ.. వైబ్‌ కోడింగ్‌ నేర్చుకోండి!

Eenadu icon
By Technology News Desk Published : 08 Oct 2025 03:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

కేవలం 19 ఏళ్ల వయసులోనే స్కేల్‌ ఏఐ అనే అంకుర సంస్థను స్థాపించాడు. 24 ఏళ్లలోనే బిలియనీర్‌గా అవతరించి రికార్డు సృష్టించాడు. తాజాగా 28 ఏళ్ల వయసులో ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ మెటా ఏఐ సీఈవో బాధ్యతలు చేపట్టి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అతనే అలెగ్జాండర్‌ వాంగ్‌. స్వయంకృషితో వ్యాపారవేత్తగా ఎదిగిన ఆయన ఇటీవల ‘వైబ్‌ కోడింగ్‌’ నేర్చుకోవాలని 13 ఏళ్ల పిల్లలకు సందేశం ఇచ్చారు. ఇంతకీ ఇదేం కోడింగ్‌? దీని గొప్పతనమేంటి?

ఇటీవల కృత్రిమ మేధ (ఏఐ) శరవేగంగా విస్తరిస్తోంది. పరిశ్రమలు, విద్య, వ్యాపార రంగాలతో పాటు రోజువారీ వ్యవహారాలనూ పూర్తిగా మార్చేస్తోంది. మనం చేసే పనులు, క్రియేషన్‌ తీరుతెన్నులనే మారుస్తున్న నేపథ్యంలో కొత్త తరం వీలైనంత త్వరగా ఏఐని అందిపుచ్చుకోవాలని టెక్‌ కంపెనీలు సైతం ప్రోత్సహిస్తున్నాయి. అలెగ్జాండర్‌ వాంగ్‌ తాజా సలహానే దీనికి నిదర్శనం. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో మధ్యలోనే చదువు ఆపేసిన ఆయన చిన్న వయసులోనే స్కేల్‌ ఏఐ సంస్థను స్థాపించాడు. అనతికాలంలోనే బిలియనీర్‌ వ్యాపారవేత్తగా ఎదిగాడు. నిజానికి ఇదో అద్భుతమైన ప్రస్థానం. ఏఐ వ్యవస్థల శిక్షణలో ప్రాథమిక అంశమైన డేటా లేబులింగ్‌ మీద స్కేల్‌ ఏఐ ప్రధానంగా దృష్టి సారించింది. దీన్ని పదేళ్ల పాటు నడిపించిన వాంగ్‌ తన కౌశలాన్ని మెటా ఏఐకి అందించటానికి నడుం కట్టారు.

ఇటీవల ఆయన ఒక పాడ్‌కాస్ట్‌లో ప్రసంగిస్తూ టీనేజర్ల కళ్లు తెరిపించే సలహా ఇచ్చారు. ‘మీరు 13 ఏళ్ల వయసువారైతే మీ సమయమంతా వైబ్‌ కోడింగ్‌కు వెచ్చించండి. మీ జీవితాన్ని దీంతోనే గడపండి’ అని సూచించారు. యువత ఏఐ టూల్స్‌ కోసం కనీసం 10వేల గంటలైనా అంకితం చేయాలనీ ఉద్బోధించారు. మున్ముందు జాబ్‌ మార్కెట్‌లో అందరికన్నా ముందుండాలని కోరుకునేవారికిది గొప్ప మేలు చేస్తుందని పేర్కొన్నారు. ‘పర్సనల్‌ కంప్యూటర్లు వచ్చిన తొలినాళ్లలో వాటి కోసం అత్యధిక సమయాన్ని కేటాయించినవారు, వాటితో ఎదిగిన బిల్‌ గేట్స్, మార్క్‌ జుకర్‌బర్గ్‌ వంటివారు భవిష్యత్‌ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన ప్రయోజనాన్ని పొందారు. ఇప్పుడు అలాంటి సమయమే ఆసన్నమైందని నాకు అనిపిస్తోంది’ అని వివరించారు. 

వైబ్‌ కోడింగ్‌ అంటే?

వైబ్‌ కోడింగ్‌ ఓ అధునాత ప్రోగ్రామింగ్‌ విధానం. ఇది సహజ భాష, ఏఐ అసిస్టెడ్‌ టూల్స్‌ మీద ఆధారపడి పనిచేస్తుంది. సంప్రదాయ కోడింగ్‌కు సంక్లిష్ట ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ మీద పట్టు ఉండాలి. కానీ వైబ్‌ కోడింగ్‌ అలాంటిది కాదు. మామూలు ఇంగ్లిష్‌లో సాధారణ ప్రాంప్ట్‌ రాయగలిగినా చాలు. ఏఐ టూల్స్‌ వీటిని ఫంక్షనల్‌ కోడ్‌ ప్రాంప్ట్‌ల రూపంలోకి మార్చేస్తాయి. దీని సాయంతో యూజర్లు సొంతంగా రిప్లిట్, కర్సర్‌ వంటి వేదికల మీద యాప్స్‌ను సృష్టించుకోవచ్చు. టాస్కులను ఆటోమేట్‌ చేయొచ్చు, వెబ్‌సైట్లు రూపొందించుకోవచ్చు. తమకేం కావాలో వివరంగా వర్ణించగలిగితే చాలు. లోతైన సాంకేతిక పరిజ్ఞానమేమీ అక్కర్లేదు. 

గూగుల్, క్లార్నా వంటి సంస్థలూ వైబ్‌ కోడింగ్‌ను ఉత్పాదకత పెంచుకోవటానికి వాడుకుంటున్నాయి. ఏఐ ప్రోగ్రామింగ్‌ టూల్స్‌ కేవలం 20 నిమిషాల్లోనే ప్రోటోటైప్స్‌ను రూపొందిస్తుండటం గమనార్హం. వీటి కోసం గతంలో వారాల కొద్దీ సమయం పట్టేది. వర్ధమాన టెక్‌ ఉద్యోగులు ఏఐ నైపుణ్యాల మీద పట్టు సాధించటం తక్షణ అవసరంగా మారింది కూడా. ఎందుకంటే కంపెనీలు ఆటోమేషన్‌కు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఎంట్రీ లెవల్‌ టెక్‌ ఉద్యోగాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. ఇది ఉద్యోగ భద్రత మీద ఆందోళనలకూ దారితీస్తోంది. కాబట్టి భవిష్యత్‌ అవసరాలకు తగినట్టుగా ఇప్పటి నుంచే సన్నద్ధం కావటం అత్యావశ్యకమైంది. ఈ నేపథ్యంలోనే అలెగ్జాండర్‌ వాంగ్‌ సలహా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని