Hyderabad: మహా నిమజ్జనం.. సర్వం సిద్ధం

Eenadu icon
By Telangana News Team Published : 05 Sep 2025 18:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: లంబోదరుడి నిమజ్జనోత్సవానికి నగరం ముస్తాబైంది. మహా నగరంలో గణేశ్ నిమజ్జనాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రూ.54 కోట్లతో నగరవ్యాప్తంగా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు కల్పించింది. గణేశ్ ఉత్సవ సమితులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, నెక్లెస్‌ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ తోపాటు 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలనుల వద్ద ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో దాదాపు లక్షా 50 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా.. రేపటి మహాక్రతువులో ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్‌లతో సహా దాదాపు 50 వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ సహా వివిధ శాఖలతో ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. 15 వేల మంది సిబ్బందితో గణేశ్ నిమజ్జనానికి సిద్ధమైన బల్దియా... 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం సాఫీగా, వేగంగా జరిగేలా 11 పెద్ద క్రేన్లతో సహా 40క్రేన్‌లను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుండగా... ట్యాంక్ బండ్ వైపు ఏర్పాటు చేసిన క్రేన్ వద్ద బాలాపూర్ గణేశ్‌ నిమజ్జనం చేయనున్నారు.

నగరవ్యాప్తంగా సుమారు 303 కిలోమీటర్ల మేర ఊరేగింపుగా గణనాథులు హుస్సేన్ సాగర్‌కు తరలిరానున్నారు. ఊరేగింపు దారిలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తుగానే 160 యాక్షన్ టీమ్‌లను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ... ఆ మార్గంలో దాదాపు 56,187 తాత్కాలిక లైట్లను అమర్చింది. మరోవైపు స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేలా పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దింపింది. సుమారు 3 వేల మంది కార్మికులు వ్యర్థాల తొలగింపులో నిమగ్నమయ్యారు. 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్ల ద్వారా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అలాగే హైడ్రా, పర్యాటక శాఖల సమన్వయంతో హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. పోలీసు శాఖ సహకారంతో 13 కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి నిమజ్జానికి తరలివచ్చే భక్తులు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చూసేలా ఏర్పాట్లు చేశారు.

హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జన ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వెంకట్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్‌తో కలిసి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో పరిశీలించిన పొన్నం.. అంగరంగ వైభవంగా నిమజ్జనాలు జరిగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు అన్ని విభాగాలతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు పొన్నం వివరించారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథుల శోభాయాత్రలు సాఫీగా సాగేందురు ఊరేగింపు మార్గంలో రోడ్ల మరమ్మతులు పూర్తయ్యాయని, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం వీలైనంత త్వరగా జరిగేలా చూస్తామని పొన్నం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని