Azharuddin: అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం?

Eenadu icon
By Telangana News Team Updated : 29 Oct 2025 17:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: మహమ్మద్‌ అజహరుద్దీన్‌(Mohammad Azharuddin)కు మంత్రి పదవి లభించింది. ఎల్లుండి తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం జరగనుంది. అజహరుద్దీన్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్రమంత్రి వర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది.

మంత్రి వర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఏఐసీసీలో కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో 15 మంది ఉండగా.. మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశముంది. అయితే, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అజాహరుద్దీన్‌కు మాత్రమే ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు కేబినెట్‌ ఏర్పడినా.. ముస్లిం మైనార్టీకి ఒక మంత్రి పదవి ఉండేది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున చాలా మంది ముస్లిం మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఈసారి ఎక్కడా గెలవలేదు. దీంతో ఆ వర్గానికి కేబినెట్‌లో అవకాశం కల్పించేందుకు సాధ్యపడలేదు.

ముస్లిం మైనార్టీ వర్గానికి ఏదో విధంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉంది. అజాహరుద్దీన్‌ జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే, ఆయనకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజాహరుద్దీన్‌, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక చేసింది. అయితే, వీరిద్దరి నియామకానికి గవర్నర్‌ ఇంకా ఆమోదం తెలపలేదు. ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూర్తికాకపోయినప్పటికీ అజాహరుద్దీన్‌ మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసీసీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. మంత్రి వర్గ విస్తరణపై గత రెండ్రోజులుగా ఏఐసీసీలో విస్తృతంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

మొదటి సారి ముఖ్యమంత్రితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో కాంగ్రెష్‌ అధిష్ఠానం ముస్లిం మైనారిటీకి అవకాశం కల్పించింది. ఒక వేళ గవర్నర్‌ కోటాలో అజాహరుద్దీన్‌కు అవకాశం దక్కని పక్షంలో.. త్వరలో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో అజాహరుద్దీన్‌ను ఎమ్మెల్సీని చేసే అవకాశముందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా మిగిలి ఉన్న రెండు మంత్రి పదవులు ఏయే సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై కసరత్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 

Tags :
Published : 29 Oct 2025 15:34 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు