Harish Rao Father: మాజీ మంత్రి హరీశ్‌రావుకు పితృ వియోగం

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 04:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

వృద్ధాప్య సమస్యలతో కన్నుమూసిన తన్నీరు సత్యనారాయణ
నివాళులర్పించిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ 

సత్యనారాయణ పార్థివదేహం వద్ద విషణ్న వదనంతో మాజీ సీఎం కేసీఆర్‌. చిత్రంలో గంగుల కమలాకర్, బాల్క సుమన్, కౌశిక్‌రెడ్డి, హరీశ్‌రావు, శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌; మణికొండ, రాయదుర్గం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ(75) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ కోకాపేటలోని క్రిన్స్‌ విల్లాస్‌లో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ..భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ 7వ సోదరి భర్త. ఆయనకు హరీశ్‌రావుతో పాటు మహేశ్‌రావు సంతానం. సమాచారం తెలిసిన వెంటనే కేసీఆర్‌ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి బయల్దేరి కోకాపేట చేరుకున్నారు. సత్యనారాయణ పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటించారు. హరీశ్‌రావు, సోదరి లక్ష్మి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. బావతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు కేసీఆర్‌ సతీమణి శోభ, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. హరీశ్‌రావును ఓదార్చారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం సహా పార్టీ కార్యక్రమాలన్నింటినీ భారత రాష్ట్ర సమితి రద్దు చేసుకుంది. భారత రాష్ట్ర సమితి ముఖ్యనేతలు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, పద్మారావు గౌడ్‌ సహా పార్టీ నేతలు  పార్థివదేహానికి నివాళులు అర్పించారు. 

పార్థివదేహం వద్ద కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావు, కేటీఆర్‌ తదితరులు

  • కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, వివేక్, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్‌ బండ ప్రకాశ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీలు రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, రాకేశ్‌రెడ్డి, భాజపా నాయకుడు మురళీధర్‌రావు తదితరులు పార్థివదేహం వద్ద పుష్పాంజలి ఘటించారు.
  • ఫిల్మ్‌నగర్‌ మహా ప్రస్థానంలో మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు పూర్తయ్యాయి. కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, పార్టీ నేతలు పాడె మోశారు. హరీశ్‌రావు తండ్రి చితికి నిప్పంటించారు. 

సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రుల సంతాపం..

సత్యనారాయణ మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. హరీశ్‌రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. 

  • హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల ఏపీ మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో సంతాపం తెలిపారు. 
  • టి.సత్యనారాయణ మృతిపట్ల వైకాపా అధ్యక్షుడు జగన్‌ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన హరీశ్‌రావును ఫోన్లో పరామర్శించారు.

హరీశ్‌రావును ఓదారుస్తున్న మంత్రి వివేక్‌. చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని