SRSP Dam: శ్రీరామా.. కనవేమి?!

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 05:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఎస్సారెస్పీ ఆనకట్టకు పొంచి ఉన్న ప్రమాదం 
దెబ్బతింటున్న రివిట్‌మెంట్‌.. ఇరువైపులా ఏపుగా పొదలు
వరద కాలువకు గండి
రివిట్మెంట్ పటిష్ఠం, జంగిల్‌ క్లియరెన్స్‌కు రూ.21 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదన

వరద ప్రవాహ ఉద్ధృతికి చెదిరిన ఆనకట్ట రివిట్‌మెంట్‌ రాళ్లు 

ఈనాడు, నిజామాబాద్‌: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామసాగర్‌ జలాశయం రివిట్మెంట్ దెబ్బతిని... ఆనకట్ట కుంగిపోతోంది. 14 కిలోమీటర్ల మేర ఉన్న ఆనకట్టకు ఇరువైపులా భారీగా తుమ్మ చెట్లు, పొదలు పెరిగాయి. దీంతో కట్టకు గండం పొంచి ఉందని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సారెస్పీ జలాశయం పూర్తినీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. పూడిక పేరుకోవడంతో 80 టీఎంసీలకు తగ్గింది. ఆయకట్టులో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, ములుగు, సూర్యాపేట, ఖమ్మం, జగిత్యాల, వరంగల్‌ జిల్లాల్లో 9.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలతో జలాశయానికి వరద పోటెత్తింది. ఇలాంటి సందర్భాల్లో వరద ప్రవాహానికి రివిట్మెంట్ ధ్వంసమవుతోంది. రాళ్లు కొట్టుకుపోతున్నాయి. ఆనకట్ట పైభాగం కుంగుతోంది.

పూడుకుపోయిన పీజోమీటర్లు

ఆనకట్ట ఎత్తు పలుచోట్ల 125-250 అడుగుల వరకు ఉంది. కట్ట కింద నుంచి వచ్చే సీపేజీ జలాలు, వర్షపు నీటిని తరలించేందుకు నిర్మించిన ‘టో డ్రెయిన్లు’ కనుమరుగయ్యాయి. వాటి వద్దకు వెళ్లలేనివిధంగా చెట్లు, ముళ్లపొదలు పెరిగాయి. వరద ఉద్ధృతిని కట్ట తట్టుకుంటుందా... లేదా? ప్రవాహం అసాధారణంగా వచ్చిందా? అన్నది పీజోమీటర్ల సాయంతో గుర్తిస్తారు. శ్రీరామసాగర్‌ పరిధిలో 166 పీజోమీటర్లను ఏర్పాటు చేయగా... మట్టిలో పూడుకుపోయాయి. పెద్దఎత్తున పోటెత్తే వరదను కిందకు వదిలే 55 ‘ప్రెజర్‌ రిలీఫ్‌ వెల్స్‌’ సైతం ఉనికిలో లేవు. ప్రధాన కాలువల కట్టలు సైతం దెబ్బతింటున్నాయి. మరోవైపు, వరద కాలువకు నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ సమీపంలోని గాండ్లపేట వద్ద ఈ నెల 9న గండి పడింది. దీని మరమ్మతులకు రూ.3 కోట్ల వరకు అవసరమని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.

వరద కాలువకు గండి పడి వృథాగా పోతున్న నీరు 


రూ.67 కోట్ల ‘డ్రిప్‌’ నిధులు కోరుతూ ప్రతిపాదనలు

‘డ్రిప్‌’ (డ్యామ్‌ రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు)లకు ప్రపంచ బ్యాంకు నిధులను కేంద్ర జల సంఘం కేటాయిస్తోంది. పాత ప్రాజెక్టుల ఆధునికీకరణకు ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు మరమ్మతులు, ఆధునికీకరణకు రూ.67 కోట్ల ‘డ్రిప్‌’ నిధులివ్వాలని ప్రతిపాదనలు పంపినట్లు ఈఈ చక్రపాణి తెలిపారు. తక్షణం చేపట్టాల్సిన రివిట్మెంట్ పటిష్ఠం, జంగిల్‌ క్లియరెన్స్‌కు రూ.21 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదించినట్లు పేర్కొన్నారు. నిధులు విడుదల కాగానే పనులు ప్రారంభిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు