ఆడశిశువు విక్రయంపై చర్యలకు ఆదేశం!

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 05:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, నల్గొండ: నల్గొండలో శిశు విక్రయంపై తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్‌ ఆదేశించింది. నల్గొండ శాంతినగర్‌కు చెందిన కొర్ర బాబు-పార్వతి దంపతులకు నాలుగో సంతానంలోనూ అమ్మాయి పుట్టడంతో కుటుంబానికి భారమవుతుందనే ఉద్దేశంతో ఏపీలోని ఏలూరుకు చెందిన వారికి అమ్మజూపిన ఉదంతం వెలుగు చూడటంతో కమిషన్‌ స్పందించింది. జిల్లా ఐసీడీఎస్‌ సిబ్బంది, ఛైల్డ్‌ ప్రొటక్షన్‌ యూనిట్, సీడబ్ల్యూసీ అధికారులు ఈ అంశంపై విచారణ చేపట్టడంతో విషయం బహిర్గతమైంది. చట్ట విరుద్ధంగా పసికందు దత్తతను ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ ఆదేశించింది. పసికందును పదిరోజులపాటు తెలంగాణ స్టేట్‌హోం పరిరక్షణలో ఉంచాలని ఆదేశించింది. నల్గొండ జిల్లా కేంద్రంలో పదేపదే ఈ తరహాలో ఘటనలు జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కమిషన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. 

సుమోటోగా తీసుకుని లోకాయుక్త విచారణ 

ఆడశిశువు విక్రయ వ్యవహారంపై నివేదిక సమర్పించాలంటూ మహిళాశిశు సంక్షేమశాఖాధికారి కృష్ణవేణితోపాటు జిల్లా బాలల రక్షణ అధికారులకు లోకాయుక్త జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీచేశారు. అంగట్లో ఆడశిశువు పేరిట వివిధ మాధ్యమాల్లో వచ్చిన కథనాలను లోకాయుక్త సుమోటోగా తీసుకున్నారు. శిశువు రక్షణకు తీసుకున్న చర్యలపై నవంబరు 4 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. 

పంచాయతీరాజ్‌ ఉద్యోగి.. చట్టవిరుద్ధంగా ఒప్పందం 

ఆడశిశువును అమ్మకానికి పెట్టిన జంటతోపాటు కొనుగోలు చేసిన జంటను మంగళవారం నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మధ్యవర్తి కొండల్‌ను కలిసి ఏలూరు పంచాయతీరాజ్‌ శాఖలో ప్రభుత్వ ఉద్యోగి సాంబమూర్తి-రజిత దంపతులతో రూ.2.50లక్షలకు అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ముందుగా రూ.10వేలు ఇచ్చి శనివారం శిశువును తీసుకెళ్లారు. మిగతా నగదును సోమవారం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం తల్లితో పాటు సఖీ కేంద్రంలో ఉన్న శిశువును బాలల సంక్షేమ సమితికి అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ బృందం ఈ శిశు విక్రయ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముమ్మర దర్యాప్తు చేపట్టింది. గతంలో జరిగిన శిశు విక్రయాలతో ఈ ముఠాకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని