చుక్కలు లెక్కెడుతూ.. ‘చిత్రం’ చూడొచ్చు..

Eenadu icon
By Telangana News Desk Published : 31 Oct 2025 08:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

భాగ్యనగరంలో ఓపెన్‌ ఎయిర్‌ స్క్రీనింగ్‌కు ఆదరణ

ఆకాశంలో మిణుకుమిణుకుమంటూ కనిపించే నక్షత్రాలు.. చెట్ల నుంచి వీచే చల్లటి గాలుల నడుమ..ఈలలు, గోలలు లేని ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి నచ్చిన సినిమా చూస్తుంటే.. ఆహా! అదో ‘చిత్ర’మైన మధురానుభూతి కదూ. అచ్చం అలాంటి డ్రైవ్‌ ఇన్‌ థియేటర్‌ అనుభవాన్ని అందిస్తున్న ‘ఓపెన్‌ ఎయిర్‌ సినిమా స్క్రీనింగ్‌ థియేటర్‌’ ఈవెంట్లకు హైదరాబాద్‌లో ఆదరణ పెరుగుతోంది. రోజువారీ ఒత్తిళ్ల నుంచి దూరంగా కొత్త వాతావరణంలో గడపాలని భావించేవారు ఎక్కువగా హాజరవుతున్నారు. 20 నుంచి 30 మంది సామర్థ్యంతో హోటళ్లు, పార్కుల్లోని బహిరంగ ప్రదేశాల్లో బీన్‌ బ్యాగ్‌లు, పరుపులు..సౌకర్యవంతమైన సీటింగ్‌తో పాటు ఆహారం, పానీయాలు అందిస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హాలీవుడ్, బాలీవుడ్‌ హిట్‌ సినిమాల నుంచి క్లాసిక్, రొమాంటిక్‌ కామెడీల వరకు వివిధ రకాల చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. రాజధానిలో 2023 నుంచి ఈ ట్రెండ్‌ మొదలైంది. వర్షాలు, అసాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటే ముందుగానే రద్దు చేస్తారు. హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో వీటిని నిర్వహిస్తూ ఐటీ ఉద్యోగులను ఆకర్షిస్తున్నారు.

ప్రైవేటు స్క్రీనింగ్‌ సైతం.. పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలు ఉంటే ప్రైవేటు స్క్రీనింగ్‌లకు అవకాశం ఇస్తున్నారు. కనీసం 20 మంది వీక్షకులు ఉంటేనే ఇందుకు అనుమతిస్తున్నారు. నిర్వాహక సంస్థల వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేస్తే.. వారే సంప్రదించి ఏర్పాట్లు చేస్తారు. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఇలాంటి అనుభవాన్ని అందించేందుకు ప్రైవేటు స్క్రీనింగ్‌లను బుక్‌ చేస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.

షరతులు వర్తిస్తాయ్‌..

  • ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.
  • వేదిక వద్ద నిబంధనలు తప్పకుండా పాటించాలి.
  • ఆలస్యంగా వస్తే లోపలికి ప్రవేశం నిషేధం.
  • మారణాయుధాలు, హెల్మెట్లు, లేజర్‌ పరికరాలు, సంగీత వాయిద్యాలు తీసుకురాకూడదు. 

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని