రూ.10 వేల పరిహారం.. రైతుల్ని అవమానించడమే!

Eenadu icon
By Telangana News Desk Published : 01 Nov 2025 04:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు 

ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌టుడే: తుపాను కారణంగా నష్టపోయిన రైతులు, ఇళ్లు నీట మునిగి సర్వం కోల్పోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎకరానికి రూ.10వేల పరిహారం అందిస్తామనడం రైతులను అవమానించడమేనని ధ్వజమెత్తారు. ఖమ్మంలో మున్నేటి వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఆయన పర్యటించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ‘‘కంటితుడుపు చర్యలతో ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది. వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం చెల్లించాల్సిందే. వరద నీరు చేరిన మున్నేటి పరీవాహక ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. సత్తుపల్లిలో భాజపా నాయకులపై కేసులు పెట్టించి రాజకీయ ఒత్తిళ్లతో విచారణ చేస్తున్నారు’’ అని ఆరోపించారు. నేతలు గోలి మధుసూదన్‌రెడ్డి, డి.వాసుదేవరావు, నెల్లూరి కోటేశ్వరరావు, శ్రీలతరెడ్డి, రాఘవరావు, ప్రవీణ్‌కుమార్‌ ఆయన వెంట ఉన్నారు. 

ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం ఇవ్వాలి: ఏలేటి 

ఈనాడు, హైదరాబాద్‌: మొంథా తుపానుతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ‘‘వరి సాగుకు ఎకరానికి రూ.30 వేలు ఖర్చవుతాయి కాబట్టి సర్కారు రూ.30 వేల నష్టపరిహారం ఇవ్వాలి. తుపాను మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలి’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని