CM Revanth Reddy: అసెంబ్లీకి ఘోష్ నివేదిక
సభలో చర్చించి అన్ని రాజకీయపక్షాల అభిప్రాయాలను స్వీకరిస్తాం
అనంతరమే భవిష్యత్ కార్యాచరణ
కమిషన్ సూచనలను ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది
ఇందులో ఎలాంటి శషభిషలు లేవు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
కాళేశ్వరం నివేదికకు మంత్రిమండలి ఆమోదం 
ఈనాడు - హైదరాబాద్

మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఉత్తమ్, భట్టి విక్రమార్క, తుమ్మల
‘‘ఊరు, పేరు, అంచనాలు మార్చి.. అవినీతికి పాల్పడి.. అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు కూలిపోయింది. కమిషన్ స్పష్టంగా ఈ వివరాలన్నింటినీ పొందుపర్చింది. ఈ నివేదికను రాబోయే రోజుల్లో శాసనసభ, మండలిలోనూ ప్రవేశపెట్టి, అన్ని రాజకీయ పక్షాలకూ వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం కల్పించనున్నాం. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. భవిష్యత్ కార్యాచరణకు.. కమిషన్ సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇందులో ఎలాంటి శషభిషలకు తావు లేదు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘రాజకీయ కక్షపూరిత చర్యలు చేపట్టినట్టో.. ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టో.. చర్చలకు తావివ్వకుండా.. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలనుకుంటోంది. కాబట్టే ఈ రోజు కమిషన్ నివేదికలోని అన్ని వివరాలను మీ ముందు పెట్టాం’’ అని సీఎం వెల్లడించారు.
సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో 665 పేజీల జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టారు. దీనిపై ముగ్గురు అధికారుల కమిటీ రూపొందించిన సంక్షిప్త నివేదికను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు. అనంతరం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను మంత్రిమండలి ఆమోదించింది. తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వివేక్, దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నంప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, సీతక్క, కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

సచివాలయంలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వివేక్, దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, (వెనుక వరుసలో) అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, చిన్నారెడ్డి, సీతక్క, కొండా సురేఖ
మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘2007-08లో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంవత్సరంన్నర తర్వాత మార్చారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరిట తుమ్మిడిహెట్టి దగ్గరి నుంచి చేవెళ్ల వరకూ తీసుకురావాలన్న ప్రణాళికలను ఆనాటి సీఎం కేసీఆర్ మార్చి.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించారు. 2015-16లో మొదలుపెట్టి 2018-19లోపు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చామని కేసీఆర్ చెప్పారు. నిర్మించిన కొద్ది కాలానికే 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం..అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పగుళ్లు రావడంతో.. ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయని సాంకేతిక నిపుణులు, ఎన్డీఎస్‌ఏ సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించాయి. వాటిపై విచారణ చేపట్టాయి.ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలున్నాయని, పూర్తిస్థాయిలో విచారణ జరగాలని.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికల్లో సూచించాయి.
ఆ సందర్భంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న నేను, మా నాయకుడు రాహల్‌గాంధీ మేడిగడ్డను సందర్శించాం. ఇందులో అవినీతి, అశ్రితపక్షపాతం, నిర్లక్ష్య వైఖరి, ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాలున్నాయని, అందువల్లే రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం పూర్తిగా కూలిపోయిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. న్యాయ విచారణకు ఆదేశిస్తామని ఆనాడు మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం.. 14.03.2024న జస్టిస్ పీసీ ఘోష్ ఛైర్మన్‌గా జ్యుడిషియల్ కమిషన్‌ను విచారణకు నియమించాం. దాదాపు 16 నెలలు ఘోష్ కమిషన్.. నాటి ముఖ్యమంత్రి, అప్పటి సాగునీటి, ఆర్థిక మంత్రులు.. ఐఏఎస్, ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థలు, ప్రజాసంఘాలు, పాత్రికేయులు, ముందుకొచ్చిన ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించింది. కేసీఆర్, హరీశ్‌రావు, ఈటలను ప్రశ్నించి... వారి వివరణను విశ్లేషించింది. గత నెల 31వ తేదీన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. దాన్ని సంక్షిప్తంగా విశ్లేషించడానికి ప్రభుత్వం నియమించిన ముగ్గురు అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గ సమావేశంలో వివరించాం. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను మంత్రివర్గంలో ప్రవేశపెట్టి ఆమోదించాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
‘‘భారత రాష్ట్ర సమితి ఈ నివేదికను తప్పుపట్టడం సహజమే. తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా.. తమ తప్పులను ప్రశ్నిస్తే మరో రకంగా మాట్లాడడం వారికున్న అలవాటే. ఇది ఒక స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్. ప్రభుత్వ నివేదిక కాదు. దీనిపై ఇక ఎవరు ఏ రకంగా మాట్లాడతారు.. ఏ రకంగా విశ్లేషిస్తారు.. అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా సీఎం చెప్పారు. ‘‘భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత కూడా ఘోష్ కమిషన్‌కు తన అభిప్రాయాలు చెప్పాల్సింది. ఇప్పుడు నివేదిక ఇచ్చిన తర్వాత ఆమె ఎవరిని ప్రశ్నిస్తున్నారు?’’ అని మరో ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.
ఆ మూడు బ్యారేజీల దుస్థితికి కారణం కేసీఆర్
-డిప్యూటీ సీఎం భట్టి
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీల దుస్థితికి అప్పటి సీఎం కేసీఆర్ కారణమని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.‘‘ఈ మూడు బ్యారేజీల నిర్మాణం కేసీఆర్, హరీశ్‌రావు వ్యక్తిగత నిర్ణయమే తప్ప... ప్రభుత్వ అధికారిక నిర్ణయం కాదు. బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో అక్రమాలు, అవకతవకలకు జవాబుదారీ కేసీఆర్ అని కమిషన్ తేల్చింది. జలవనరుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో కట్టిన మేడిగడ్డ కుంగిపోయింది. ప్రజాధనం దుర్వినియోగమైంది. నీళ్లులేవన్న కారణంతో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చామని 2016లో నాటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. విశ్రాంత ఇంజినీర్లతో కూడిన నిపుణుల కమిటీ సూచన మేరకు మార్చామని చెప్పడం అవాస్తవమని తేలింది.
సొంత నిర్ణయం తీసుకున్న ఆయన.. అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు. కేసీఆర్, హరీశ్‌రావు ఉద్దేశపూర్వకంగా నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనడం సరైనది కాదు. సబ్‌కమిటీ నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం లభించిందని అప్పటి ఆర్థిక మంత్రి చెప్పడం సరికాదు. ఆయన తప్పుగా రిపోర్టు చేశారని కమిషన్ తెలిపింది. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిబద్ధత లేకుండా ఆయన వ్యవహరించారు. అన్నారం, సుందిళ్ల ప్రదేశాల్లో బ్యాక్‌వాటర్ స్టడీస్ తదితర క్షేత్రస్థాయి కీలక అధ్యయనాలు, పరిశోధనలు లేకుండా డిజైన్లు చేశారు. వ్యక్తిగత నిర్ణయాలు, అనవసర జోక్యం, అవినీతితో ప్రజాధనం భారీగా వృథా అయింది’’ అని భట్టి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్‌ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్‌జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 - 
                        
                            

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీల్‌యాదవ్ కౌంటర్ దాఖలు
 


