TG News: ప్రాణ, ఆస్తినష్టం కలగకుండా చర్యలు.. వరద సహాయక చర్యలపై మంత్రుల సమీక్ష

Eenadu icon
By Telangana News Team Published : 27 Aug 2025 21:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు తెలిపారు. వరద సహాయక చర్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జ, అడిషినల్‌ డీజీ మహేష్‌ భగవత్‌, అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇవాళ సాయంత్రం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితులు సమీక్షించారు.

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్న మెదక్‌, కామారెడ్డి, నిర్మల్‌, సిరిసిల్ల జిల్లాలకు అదనంగా ఎస్‌డీఆర్ఎఫ్‌ బృందాలను పంపాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ల వద్ద విపత్తు నిర్వహణకు సంబంధించిన నిధులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. పోచారం ప్రాజెక్టు డ్యాం పైనుంచి నీరు ప్రవహిస్తోందని, నదికి సమాంతరంగా ఉన్న కాలువకు గండి కొట్టి నీటిని విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు.

భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలలో సహాయ పునరావాస చర్యల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. సచివాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు చెప్పారు. మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు అదనంగా ఎస్‌డీఆర్ఎఫ్‌ బలగాలను పంపిస్తున్నామని, ఇప్పటికే నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని సీఎస్ తెలిపారు. 

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీతక్క తెలిపారు. మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసిందని, కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రులు.. ఇంజినీరింగ్‌ అధికారులు స్థానికంగానే ఉండాలని ఆదేశించారు. వరద సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌లు అందుబాటులో ఉన్నాయని, వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్‌లు వెళ్తాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు