MLC Kavitha: నాపై వ్యాఖ్యల వెనుక భారత రాష్ట్ర సమితి పెద్ద నాయకుడి హస్తం

Eenadu icon
By Telangana News Desk Updated : 04 Aug 2025 06:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

నల్గొండ జిల్లా మాజీ మంత్రి నా గురించి మాట్లాడుతున్నారు
ఆ జిల్లాలో భారత రాష్ట్ర సమితి ఓటమికి కారణం ఆయనే
ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు
72 గంటల దీక్ష చేస్తానని స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్, ఫిల్మ్‌నగర్, న్యూస్‌టుడే: ‘‘నాపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజమంతా స్పందించింది. అయినప్పటికీ ఇంటి ఆడబిడ్డపై చేసిన వ్యాఖ్యలకు భారత రాష్ట్ర సమితి సోదరులు మాత్రం స్పందించలేదు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నాపై చేస్తున్న వ్యాఖ్యల వెనుక భారత రాష్ట్ర సమితి పార్టీ పెద్ద నాయకుడి హస్తం ఉంది. ఆయన మా జాగృతిలో కొందరు కోవర్టులను పెట్టి.. ఇక్కడి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాపై కొందరు వ్యాఖ్యలతో దాడి చేస్తున్నా.. ఆయన ఆదేశాల కారణంగానే భారత రాష్ట్ర సమితి నేతలు స్పందించడం లేదనే స్పష్టమైన సమాచారం నాకుంది’’ అని ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఆమె ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఓటమికి కారణమైన ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నా గురించి మాట్లాడుతున్నారు. ఆయనను ప్రోత్సహిస్తున్నదెవరు? ఉమ్మడి నల్గొండలో భారత రాష్ట్ర సమితి  సర్వనాశనం కావడానికి, 11 నియోజకవర్గాల్లో ఓటమికి కారణం ఆయనే. కేసీఆర్‌ లేకపోతే అసలు ఆయనెవరు?’ అని కవిత ప్రశ్నించారు. ‘భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. అయితే ఆయన వ్యాఖ్యలకు.. నేను కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్‌ అవడానికి మాత్రం సంబంధం ఉంది’ అని ఆమె స్పష్టం చేశారు. ‘నాకు ఎవరి మద్దతు లేదు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వాళ్లకే అలవాటు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసేవారే.. కవిత వెనక ప్రభుత్వం ఉందంటే ఎలా?’ అని ఆమె ప్రశ్నించారు. ‘ఇందిరాపార్కు వద్ద సోమవారం నుంచి 72 గంటల నిరాహారదీక్షను గాంధేయమార్గంలో శాంతియుతంగా చేయనున్నాం. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే.. నన్ను ఎక్కడ ఉంచితే అక్కడే దీక్షను కొనసాగిస్తాం’ అని కవిత స్పష్టం చేశారు.

Tags :
Published : 04 Aug 2025 04:43 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని