Money Mule: సైబర్‌ కేసుల్లో పావుల్లా ‘మనీ మ్యూల్స్‌’

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 03:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఏడాదిలో కొల్లగొట్టిన సొమ్ము రూ.17,000 కోట్లు
67.8 శాతం మ్యూల్‌ ఖాతాల ద్వారానే..
చైనా సైబరాసురుల దురాగతాలుగా పోలీసుల గుర్తింపు
కేరళ వయనాడ్‌ జిల్లాలో 500 మందిపై కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: కేరళ వయనాడ్‌ జిల్లాకు చెందిన 27 ఏళ్ల ఇస్మాయిల్‌ని నాగాలాండ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో యువతి సలామత్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు కేసు పెట్టారు. ఇంకో యువకుడు మహ్మద్‌ ఫనీష్‌కు దేహ్రాదూన్‌ పోలీసులు నోటీసులిచ్చారు. వీరంతా వయనాడ్‌ జిల్లాలోని కంబాలక్కడ్‌ పట్టణానికి చెందిన వారే. ఈ ముగ్గురే కాదు..ఈ జిల్లాలో ఏకంగా 500 మంది ఒకేసారి కేసుల్లో చిక్కుకున్నారు. వీరి బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకున్న సైబర్‌ నేరస్థులు.. తాము కొల్లగొట్టిన సొమ్మును వాటిల్లోకి బదిలీ చేయించుకున్నారు. ‘మనీమ్యూల్స్‌’ అంటూ పోలీసులు వీరిపై కేసులు పెట్టారు. ఇది ఒక్క కేరళకే పరిమితం కాదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈ పరిస్థితి ఉంది.  

టెలిగ్రామ్‌లో సంభాషణలు.. చాట్‌రూంలో ప్రచారం

చైనాకు చెందిన సూత్రధారులు ముందుగా భారీ వేతనాలతో భారత్‌లో తమ తరఫున ఏజెంట్లను నియమించుకుంటున్నారు. ఈ-మెయిల్, చాట్‌రూం, జాబ్‌ వెబ్‌సైట్, బ్లాగ్‌ల ద్వారా ఆకర్షణీయమైన ప్రకటనలివ్వడమే వీరి పని. కొందరైతే నేరుగానే గ్రామాలు, చిన్న పట్టణాలకు వెళ్లి బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుంటున్నారు. వయనాడ్‌లో ఇలాగే చేశారు. తాము చెప్పిన పని చేస్తే ఇంటి నుంచే సులభంగా రూ.వేలు, రూ.లక్షలు సంపాదించొచ్చని ఆశపెడుతున్నారు. కమీషన్ల ఆశకు తమ బ్యాంకు ఖాతాల నిర్వహణ బాధ్యతను కొందరు ఈ ముఠాలకు అప్పగిస్తున్నారు. 

డొల్ల కంపెనీల క‘రెంట్‌’ ఖాతాలతో..

కరెంటు ఖాతాల్లో రోజుకు ఎంత నగదు బదిలీ చేయాలనే పరిమితులు పెద్దగా లేకపోవడంతో ముఠాలు ఎక్కువగా వీటిపైనే దృష్టి సారిస్తున్నాయి. తోపుడుబండ్ల వ్యాపారులు, చిన్న హోటళ్ల నిర్వాహకులు, బిచ్చగాళ్లతో డొల్లకంపెనీలు ఏర్పాటు చేసి ఖాతాలు తెరిపిస్తున్నాయి. వాస్తవానికి ఖాతా తెరిచే ముందు బ్యాంకులు విచారించాలి. కానీ కొందరు బ్యాంకర్లు ముఠాలతో కుమ్మక్కై ఆయా ఖాతాలు తెరిచేందుకు అనుమతిస్తున్నారు. హైదరాబాద్‌ శంషీర్‌గంజ్‌లోని ఓ ప్రముఖ బ్యాంకు మేనేజర్‌ ఇలాగే చేసి అరెస్టయ్యారు.ఈ బ్యాంకులోని ఆరు ఖాతాల ద్వారా రూ.175 కోట్ల లావాదేవీలు జరిగాయి.

‘మ్యూల్‌హంటర్‌.ఏఐ’తో ఆర్‌బీఐ నిఘా

సైబర్‌ నేరాల్లో మ్యూల్‌ వ్యవహారాలు శ్రుతిమించుతుండటంతో ఆర్‌బీఐ సాంకేతిక నిఘా ప్రారంభించింది. కృత్రిమ మేధ పరిజ్ఞానంతో కూడిన ‘మ్యూల్‌హంటర్‌.ఏఐ’ను అందుబాటులోకి తెచ్చింది. తరచూ సమీక్షలు జరపడంతో ఇప్పుడు పలు బ్యాంకులు సొంతంగా ఇలాంటి పరిజ్ఞానాన్నే వినియోగిస్తున్నాయి. అనుమానాస్పద లావాదేవీలను గుర్తిస్తే ఈ పరిజ్ఞానమే ఆటోమేటిగ్గా ఆయా ఖాతాలను స్తంభింపజేస్తోంది.


6500 మ్యూల్‌ ఖాతాలు.. రూ.58 కోట్లు బదిలీ..

  • 2025లో సీబీఐ గుర్తించిన మ్యూల్‌ఖాతాలు 8.5 లక్షలు. దేశవ్యాప్తంగా 743 బ్యాంకుశాఖల్లో ఈ లావాదేవీలు జరిగాయి. 
  • 2023-24లో 4.6 లక్షల అనుమానిత మ్యూల్‌ఖాతాలను ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) గుర్తించి స్తంభింపజేసింది. ఏడాది కాలంలో రూ.17వేల కోట్లను సైబర్‌నేరస్థులు కొల్లగొడితే.. వాటిల్లో 67.8 శాతం మ్యూల్‌ఖాతాల ద్వారానే బదిలీ అయ్యాయి. 
  • దేశంలోనే అతిపెద్ద డిజిటల్‌ అరెస్ట్‌ నాలుగురోజుల క్రితం ముంబయిలో వెలుగుచూసింది. 74 ఏళ్ల వృద్ధుడి నుంచి నలభై రోజుల పాటు కాజేసిన రూ.58 కోట్లను బదిలీ చేసేందుకు 6500 మ్యూల్‌ ఖాతాలను వినియోగించినట్లు సమాచారం. 

ఎవరు వీరు..?

సైబర్‌ నేరస్థులు ఆన్‌లైన్‌లో కొట్టేస్తున్న సొమ్మును తొలుత తమకు సంబంధం లేని కొందరి ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. అక్కడి నుంచి మళ్లీ పలు ఖాతాలకు పంపిస్తారు. అలా 10-15 లావాదేవీలు జరుపుతారు. చివరి వ్యక్తితో మాత్రం డెబిట్‌కార్డు ద్వారా ఏటీఎంలో డబ్బు డ్రా చేయిస్తారు. ఇలా చేసినందుకు మధ్యలోని 10-15 మందికి కమీషన్‌ ఇస్తారు. దానికి ఆశపడే వారే ‘మనీ మ్యూల్స్‌’. సైబరాసురులు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..? ఒకవేళ డబ్బు పోగొట్టుకున్న బాధితుడు ఫిర్యాదు చేస్తే పోలీసులు ముందుగా పట్టుకునేది మొదటి మనీమ్యూల్స్‌నే. దర్యాప్తు చేస్తూ పోలీసులు 10-15 మందిని చేరేలోపు సొమ్మును డ్రా చేస్తారు. అనంతరం ఆ డబ్బును క్రిప్టోకరెన్సీల్లోకి మార్చి ఫారిన్‌మనీ ఎక్స్ఛేంజీల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. పోలీసులకు మనీమ్యూల్స్‌ మాత్రమే చిక్కుతున్నారు. సూత్రధారులు దొరికిన దాఖల్లాలేవు. ఇదంతా చైనా ముఠాల పన్నాగంగా పోలీసులు గుర్తించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని