Drinking Water: మంచినీళ్లలో మంచి ఎంత?

Eenadu icon
By Telangana News Desk Updated : 05 Sep 2025 20:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ నగర శివార్లలో ఒక పాఠశాలలో మిషన్‌ భగీరథ అధికారులు విద్యార్థులకు తాగునీటిపై అవగాహన కల్పించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేస్తున్న మంచి నీటిని తనిఖీచేశారు. ఆ లీటరు నీటిలో కరిగిన లవణాలు (టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాలిడ్స్‌- టీడీఎస్‌) 200 మిల్లీ గ్రాములు ఉన్నట్లు తేలింది. అది ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణమైన స్థితి. అదే కార్యక్రమానికి హాజరైన పది మంది టీచర్లు ఇళ్ల నుంచి మినరల్‌ వాటర్‌ తెచ్చుకున్నారు. ఆ నీటిని తనిఖీ చేయించగా...టీడీఎస్‌ 30 నుంచి 40 మిల్లీగ్రాములే ఉంది. 

రకరకాల బ్రాండ్లతో కోట్ల కొద్దీ నీళ్ల సీసాలు...
వాటి కోసం లెక్కలేనన్ని ఆర్వో ప్లాంట్లు...
వాటిలో నీటి శుద్ధి మాట అటుంచి...
అవసరమైన ఖనిజ, లవణాలను తీసేస్తే...
కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడినట్లవుతుంది.
అందుకే తాగే నీళ్లలో మంచి ఎంతో చెక్‌ చేసుకోండి...

ప్పుడంతా క్యాన్‌లు, బాటిళ్ల కాలం. వాటిలోని నీళ్లే స్వచ్ఛమనీ, సురక్షితమనీ భావిస్తాం. కానీ అందులో సరిపడినన్ని పోషకాలు, లవణాలు ఉంటున్నాయా? ప్లాంట్లలో ప్రమాణాల ప్రకారమే శుద్ధి జరుగుతోందా?  నిజానికి నీటిలోని మినరల్సే మన దేహంలోని ప్రాణాధారాలు. అందుకే నీటి స్వచ్ఛతతోపాటు అందులోని పోషకాల లెక్క కూడా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  


పోషకాలనూ తీసేసి...

  • భూగర్భ జలాలను బోర్ల ద్వారా రివర్స్‌ ఆస్మాసిస్‌ (ఆర్వో) ప్లాంట్ల ద్వారా శుద్ధిచేసి బాటిళ్లలో, క్యాన్లలో విక్రయిస్తున్నారు. చాలాచోట్ల శుద్ధి చేసే క్రమంలో నీటిలోని లవణాల (టీడీఎస్‌)నూ చాలావరకు తొలగించేస్తున్నారు.
  • ఇలా చేయడం వల్ల శరీరానికి మేలుకన్నా... హాని ఎక్కువ జరుగుతుంది. పీహెచ్‌ తగ్గిపోయి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె జబ్బులు అల్సర్స్‌ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. కాల్షియం లోపం వల్ల కీళ్ల, కాళ్ల నొప్పులు ప్రొటీన్‌ తగ్గి తరచుగా ఒళ్లు నొప్పుల వంటి సమస్యలు తలెత్తుతాయి.

ప్రమాణాలు పాటించరా?

ర్వో ప్లాంట్లలో నీటి శుద్ధికి భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) కొన్ని ప్రమాణాలు నిర్దేశించింది. కానీ, చాలాచోట్ల వాటిని పాటించడం లేదు. అనేక ప్లాంట్లను ఎలాంటి నైపుణ్యం లేని వారు నడిపిస్తున్నారు. క్యాన్లను కొనాల్సి వస్తే వాటి నాణ్యత పరీక్షలు చేయించుకొని అనుమానాలను నివృత్తి చేసుకున్న తర్వాతే వాటిని వినియోగించాలి. నీరు తాగడానికి యోగ్యమైనదా కాదా అని చూడడానికి టీడీఎస్, పీహెచ్‌ మీటర్లు ప్లాంట్లలో తప్పనిసరిగా ఉండాలి. దాంతో ఆ నీటిలో ఖనిజాలను తెలుసుకోవచ్చు. 

రక్షిత నీటిని వాడాల్సి వస్తే మరిగించి, చల్లార్చాలి. లేదా శుభ్రమైన వస్త్రాన్ని మడతలుగా పెట్టి వడగట్టాలి. అల్ట్రా వయొలెట్‌ లైట్ల ఫిల్టర్ల ద్వారా కూడా సులభంగా నీటిని శుద్ధి చేయవచ్చు. 


ఇంట్లో వాడుకునేలా టీడీఎస్‌ మీటర్‌ ఆన్‌లైన్‌లో లభ్యమవుతుంది ధర రూ. 200 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. ఆన్‌ చేసి నీటిలో పెట్టగానే టీడీఎస్‌ (నీటిలో కరిగిన లవణాల మొత్తం శాతం) కనిపిస్తుంది.


పరీక్షలు చాలా...

నీటి నాణ్యతను నిర్దారించేందుకు 60 వరకు పరీక్షలున్నాయి. టీడీఎస్, పీహెచ్, టోటల్‌ ఆల్కాలినిటీ¨, హార్డ్‌ నెస్, మెటల్స్‌ను రసాయన పరీక్షల ద్వారా నిర్ణయిస్తే.. నీటిలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్, పెస్టిసైడ్‌ అవశేషాల కోసం టోటల్‌ కోలిఫాం, ఈ కోలిఫాం వంటి మైక్రో బయాలజీ పరీక్షలు చేస్తారు. 


హైదరాబాద్‌ జలమండలి పరిధిలో నీటి నాణ్యత పరీక్ష కేంద్రాలున్నాయి. మిషన్‌ భగీరథ పరిధిలో రాష్ట్రంలో ప్రతీ జిల్లా, సబ్‌డివిజన్, నియోజకవర్గాల్లో 76 ల్యాబ్‌లున్నాయి. 


ఏపీలో గ్రామీణ నీటిపారుదల శాఖ పరిధిలో 112 ప్రయోగశాలలున్నాయి. రెండు రాష్ట్రాల్లో భూగర్భజలవనరుల శాఖ ప్రయోగశాలలు కూడా ఉన్నాయి. నీటి నాణ్యతపరీక్షలను వాటిలో చేయించుకోవచ్చు. 

Tags :
Published : 05 Sep 2025 20:50 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని