Jubilee Hills Bypoll: జూబ్లీ‘త్రి’ల్స్‌

Eenadu icon
By Telangana News Desk Updated : 03 Nov 2025 07:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

రసవత్తరంగా ఉపఎన్నిక
ప్రత్యర్థి బలంగా ఉన్న బస్తీలపై గురి  
మోహరించిన ప్రధాన పార్టీల పదాతి దళాలు
కీలకంగా రహ్మత్‌నగర్, ఎర్రగడ్డ, షేక్‌పేట
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

జూబ్లీహిల్స్‌... ఈ ఉప ఎన్నికలో గెలుపు.. మరెన్నో మలుపులకు మూలం కావొచ్చని భావిస్తున్న ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. విజయాన్ని దక్కించుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ జారవిడుచుకోకూడదని వ్యూహ.. ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. నియోజకవర్గంలో నాలుగు లక్షల మంది ఓటర్లున్నా అందులో 50 శాతం మందే అభ్యర్థుల తలరాతలు మార్చవచ్చని నేతలు విశ్వసిస్తున్నారు. 2009లో 52.76 శాతం, 2014లో 50.18 శాతం, 2018లో 45.59 శాతం, 2023లో 47.49 శాతం ఓట్లు పోలవడమే తాము ఇలా విశ్లేషించడానికి కారణమని చెబుతున్నారు. అంటే మొత్తం ఓట్లలో 30 శాతం ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థికి గెలుపు నల్లేరుపై నడకే. ఏడు డివిజన్లు ఉన్న ‘హిల్స్‌’ను గుప్పెట పట్టేందుకు పార్టీలు బలగాలను మోహరించాయి. ఏ ఓటరు ఎక్కడున్నారు.. ప్రత్యర్థి ప్రాంతాలు ఏవి.. ఏ సంఘాన్ని మచ్చిక చేసుకుంటే ఓట్లు మళ్లుతాయనే వ్యూహాలు ఇక్కడ గంట గంటకూ పదును తేలుతున్నాయి. ఈ నెల 11న జరిగే ఉప ఎన్నికలో సిటింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత రాష్ట్ర సమితి నుంచి మాగంటి సునీత గోపీనాథ్, అధికార కాంగ్రెస్‌ నుంచి నవీన్‌ యాదవ్, భాజపా నుంచి లంకల దీపక్‌రెడ్డి బరిలోకి దిగగా ఆయా పార్టీలు అభ్యర్థుల విజయం కోసం అహరహం శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు.. భారత రాష్ట్ర సమితి నుంచి కేటీఆర్, హరీశ్‌రావు ఇతర నేతలు.. భాజపా నుంచి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఇతర నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బస్తీల్లో ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. 

ఎర్రగడ్డ, షేక్‌పేట, బోరబండల్లో మైనారిటీలు కీలకం

ఎక్కువ ఓటర్లు ఉన్న రహ్మత్‌నగర్, ఎర్రగడ్డ, షేక్‌పేట డివిజన్లే ప్రధానంగా అభ్యర్థి విజయాన్ని నిర్ణయించనున్నాయి. మైనారిటీ ఓటర్లు ఉన్న బోరబండకూ ప్రత్యేక స్థానం ఉంది. పేరుకే జూబ్లీహిల్స్‌ అయినప్పటికీ కాలనీలు, బస్తీలు, మురికివాడలే అధికం. రహ్మత్‌నగర్‌లో దాదాపు 70 వేల ఓట్లు ఉన్నట్లు అంచనా. గడిచిన శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌ పోటీ పడ్డాయి. భారత రాష్ట్ర సమితి ముందు నిలిచింది. లోక్‌సభకు వచ్చేసరికి కాంగ్రెస్‌ పుంజుకుంది. ఎర్రగడ్డ, షేక్‌పేట, బోరబండల్లో మైనారిటీలు కీలకం. ఈ నియోజకవర్గం మొత్తంలో 1.10 లక్షలకు పైగా మైనారిటీ ఓటర్లు ఉంటారని పార్టీలు అంచనా వేస్తుండగా ఈ నాలుగు డివిజన్ల పరిధిలోనే ఎక్కువ మంది ఉన్నారు. 

బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో...

ఈ ఉప ఎన్నికలో బీసీ ఓటు కూడా కీలకంగా మారింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీసీలు సంఘటితం అయ్యారని అంచనా వేస్తున్న పార్టీలు వారిని ఆకట్టుకునే ప్రణాళికలు రచిస్తున్నాయి. వెంగళరావునగర్, సోమాజిగూడ, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో పలు చేతివృత్తుల కాలనీలు ఉన్నాయి. గౌడలు, మున్నూరుకాపులు, యాదవులు తదితర బీసీ వర్గాల ఓట్లు ఉప ఎన్నికలో ప్రధానమవుతున్నాయి. క్రైస్తవ సంఘాల్లో కూడా బీసీలు ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీసీలు వివిధ పార్టీల కింద విస్తరించి ఉన్నారు. పార్టీల నాయకులు.. ఆయా సంఘాల నేతలను పిలిపించుకుని చర్చిస్తున్నారు. వెంగళరావునగర్‌తోపాటు సోమాజిగూడ డివిజన్‌లో గేటెడ్‌ కమ్యూనిటీలు, పెద్ద పెద్ద అపార్టుమెంట్లు ఉన్నాయి. వీటిలో ఒకేచోట పెద్ద సంఖ్యలో ఓటర్లు నివసిస్తున్నారు. దీంతో ఆయా సంఘాల వారితో కొందరు పార్టీ బాధ్యులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. కొన్ని కాలనీలకు చెందిన ముస్లిం, క్రైస్తవ మత పెద్దలతోనూ మాట్లాడుతున్నారు. 

ఎక్కడికక్కడ హామీలు గుప్పిస్తూ జోరుగా ప్రచారం

ఓటర్లను ఆకర్షించడం ఒక ఎత్తు కాగా గత శాసనసభ, లోక్‌సభ, నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కడ ఆధిక్యత వచ్చిందన్నదానిపై నాయకులు దృష్టి పెడుతున్నారు. ప్రత్యర్థికి పోలయ్యే వాటిని కొల్లగొట్టడమే లక్ష్యం అని ఓ పార్టీకి చెందిన డివిజన్‌ ఇన్‌ఛార్జి పేర్కొన్నారు. షేక్‌పేటలో గత శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కన్నా కాంగ్రెస్‌కు ఎక్కువ ఆధిక్యత వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ అంతే. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి ఓటెత్తారు. బోరబండ డివిజన్‌లో 65 వేల ఓట్లుండగా లోక్‌సభ ఎన్నికల్లో మినహా అన్ని ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితివైపే ఓటర్లు ఉన్నారు. రహ్మత్‌నగర్‌ డివిజన్‌లో కార్మికులు ఎక్కువ. జీహెచ్‌ఎంసీ, గత శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు భారత రాష్ట్ర సమితివైపు ఉండగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మొగ్గుచూపారు. యూసుఫ్‌గూడలో ఈ రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లు ఉంటూ వస్తున్నాయి. దీంతో ప్రత్యర్థి బలంగా ఉన్న కాలనీలు, బస్తీలపై నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలను తీరుస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు బాగు చేయడం, సంఘాలకు టెంటు సామగ్రి కొనివ్వడం లాంటి భరోసాలు ఉంటున్నాయి. 

జిల్లాల నుంచి కార్యకర్తలు

నియోజకవర్గంలో 407 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 4.01 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రానికి వంద మందిని ఒక పార్టీ, పది మంది ప్రత్యేక ఇన్‌ఛార్జులను మరొక పార్టీ, తగినంత మంది ప్రచారక్‌లను ఇంకో పార్టీ నియమించుకున్నాయి. ప్రధాన పార్టీలు ఇతర జిల్లాల నుంచి మెరికల్లాంటి కార్యకర్తలను తీసుకొస్తున్నాయి. వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్‌ తదితర జిల్లాల నుంచి రెండు రోజులకు వంద మందిని ఓ పార్టీ ప్రచార బరిలోకి దింపుతోంది. మరోపార్టీ కీలక నేతను ఇన్‌ఛార్జిగా నియమించి ప్రతి వంద మంది ఓటర్లను కలిసేందుకు ఒక బృందాన్ని సిద్ధం చేసుకుంది. కొందరు అభ్యర్థులు ప్రచారానికి ఆటోలను, ద్విచక్రవాహనాలను అద్దెకు తీసుకుని నిత్యం ర్యాలీలు తీస్తున్నారు.


వీధి వీధి తిరుగుతూ ఓటర్ల లెక్కలు...

వీరిద్దరు ఎన్నికల సిబ్బంది కాదు. ఓ పార్టీ తరఫున వీధి వీధి తిరుగుతూ ఓటర్ల లెక్కలు తీస్తున్నారు. డిగ్రీ చదువుతున్న వీరికి.. రోజుకు ఐదు షీట్ల వివరాలను నమోదు చేయడం లక్ష్యం. ప్రతిఫలంగా రూ.500 ఇస్తున్నారని చెబుతున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న కుటుంబాల వివరాలేమిటి... వారంతా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు... దొంగ ఓట్లు ఉన్నాయా.. చనిపోయిన వారెవరైనా జాబితాలో ఉన్నారా అంటూ ఆరా తీస్తున్నారు.

డిజి ప్రచారం... 

పలు పార్టీలు సరికొత్త ప్రచారానికి తెరతీశాయి. డిజిటల్‌ తెరలు కూడళ్లలో ఆకర్షిస్తున్నాయి. రోడ్‌ షోలలో లేజర్‌ బీంలతో ప్రదర్శన ఉంటోంది. ఎల్‌ఈడీ స్క్రీన్లతో పార్టీ గుర్తులను ప్రదర్శిస్తున్నారు. సెన్సర్‌లు, లేజర్‌ బీంలతో పార్టీ గుర్తు, లయబద్ధమైన పాటలతో ఒక పార్టీ ఆకట్టుకుంటోంది. కొన్ని పార్టీలు ప్రత్యేకంగా సోషల్‌ మీడియా వార్‌ రూంలు నడిపిస్తున్నాయి. ప్రత్యర్థి లోపాలను అనుకూలంగా మార్చుకుంటున్నారు. కొందరు లేని మీడియా ఛానెళ్లు, పత్రికల పేర్లతో కంటెంట్‌ను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తూ తమను తికమకకు గురిచేస్తున్నారని ఓటర్లు చెబుతున్నారు.

Tags :
Published : 03 Nov 2025 06:31 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు