Vaccine: ఒకే యువతికి రెండు డోసులు! 

సెల్‌ఫోన్‌లో సంభాషిస్తూ నర్సు తనకు వెంటవెంటనే రెండుసార్లు టీకా వేసిందంటూ ఓ యువతి ఆందోళన వ్యక్తంచేసిన ఘటన హైదరాబాద్‌ శివారు పెద్దఅంబర్‌పేట...

Updated : 20 Jun 2021 11:24 IST

ఆలస్యంగా వెలుగుచూసిన నర్సు నిర్వాకం

పెద్దఅంబర్‌పేట్, న్యూస్‌టుడే: సెల్‌ఫోన్‌లో సంభాషిస్తూ నర్సు తనకు వెంటవెంటనే రెండుసార్లు టీకా వేసిందంటూ ఓ యువతి ఆందోళన వ్యక్తంచేసిన ఘటన హైదరాబాద్‌ శివారు పెద్దఅంబర్‌పేట పురపాలిక పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కుంట్లూరు రాజీవ్‌ గృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీప్రసన్న(21) వెల్లడించిన వివరాలివీ.. ‘‘గురువారం ఉదయం 8.30 గంటలకు టీకా తీసుకునేందుకు పెద్దఅంబర్‌పేటలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు వెళ్లా. 11 గంటల సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సు పద్మ నాకు టీకా వేశారు. అదే సమయంలో ఆమెకు ఫోన్‌ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతూనే అక్కడే కూర్చోవాల్సిందిగా ఆమె సూచించింది. ఏమైనా చెబుతుందేమోననే ఉద్దేశంతో అక్కడే కూర్చున్నా. సెల్‌లో మాట్లాడుతూనే ఆ నర్సు మరో దఫా టీకా ఇచ్చేసింది’’ అని లక్ష్మీప్రసన్న పేర్కొంది. ఆందోళనకుగురై అక్కడే టేబుల్‌పై పడుకున్న లక్ష్మీప్రసన్నకు సిబ్బంది కొబ్బరినీళ్లు తాగించి సెలైన్‌ ఎక్కించారు. టీకా రియాక్షన్‌ కాకుండా మరో ఇంజక్షన్‌ ఇచ్చి అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండురోజుల పాటు ప్రత్యేక గదిలో ఉంచి పరిశీలించారు. యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో శనివారం ఉదయం ఆమెను ఇంటికి పంపారు.

‘‘యువతికి రెండు డోసులు ఇచ్చినట్లు నిర్ధారణ కాలేదు. సిరంజిలోకి మందు లోడ్‌ చేసిన సమయంలో నర్సుకు ఫోన్‌ వచ్చింది. అప్పటికి ఆమె టీకా వేయలేదు. ఫోన్‌ మాట్లాడాక ఒక్కసారే వ్యాక్సిన్‌ వేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని అదనపు డీఎంహెచ్‌వోను ఆదేశించాం.’’ అని రంగారెడ్డిజిల్లా డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని