MNJ Hospital: ఎంఎన్‌జేలో విజయవంతంగా 100 రోబోటిక్‌ సర్జరీలు

హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 100 రోబోటిక్‌ క్యాన్సర్‌ సర్జరీలను విజయవంతంగా పూర్తిచేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా సర్జరీలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి.

Published : 24 May 2024 03:19 IST

ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే తొలిసారి
ఉచిత చికిత్సలతో క్యాన్సర్‌ రోగులకు ప్రయోజనం

రోబో చికిత్సల ఆపరేషన్‌ థియేటర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 100 రోబోటిక్‌ క్యాన్సర్‌ సర్జరీలను విజయవంతంగా పూర్తిచేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా సర్జరీలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. ఆరు నెలల క్రితం దాదాపు రూ.30 కోట్లతో రోబోటిక్‌ శస్త్రచికిత్స సదుపాయాన్ని ఎంఎన్‌జేలో ప్రవేశపెట్టారు. దీనిపై ఆసుపత్రికి చెందిన నలుగురు ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ప్రత్యేక శిక్షణ పొందారు. గతంలో రోబోటిక్‌ సర్జరీలు పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. వీటి ఖరీదు కూడా చాలా ఎక్కువ. ఎంఎన్‌జేలో ఏర్పాటుచేసిన సదుపాయాలతో పేదలకు ఎంతో ఉపశమనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ శస్త్ర చికిత్సలు చేసే చోట పెద్దకోతల అవసరం ఉండదు. రక్తస్రావం, నొప్పి చాలా తక్కువ. ఎంఎన్‌జేలో ప్రస్తుతం రొమ్ము, గర్భసంచి, పురీషనాళం, పెద్దపేగు, అన్నవాహిక, పొట్ట తదితర క్యాన్సర్లకు రోబోటిక్‌ విధానంలో శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు, ఆయుష్మాన్‌ భారత్‌తో అనుసంధానం చేసేందుకు ఎంఎన్‌జే సంప్రదింపులు జరుపుతోంది. 


భవిష్యత్తులో కార్‌-టి-సెల్‌ థెరపీ సేవలు

- డాక్టర్‌ ముక్తా శ్రీనివాసులు, డైరెక్టర్,  ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి

సర్జికల్‌ అంకాలజీ సూపర్‌ స్పెషాలటీ వైద్య విద్యార్థులకు రోబోటిక్‌ సర్జరీపై శిక్షణ ఇస్తున్నాం. భవిష్యత్తులో అనేక క్యాన్సర్లకు రోబోటిక్‌ విధానం ప్రస్తుతం అందిస్తున్న టార్గెట్‌ థెరపీ, బోన్‌మ్యారో చికిత్సలతోపాటు రక్త క్యాన్సర్‌ చికిత్సలోని అత్యాధునిక కార్‌-టి-సెల్‌ థెరపీ కూడా ఎంఎన్‌జేలో అందుబాటులోకి రానుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని