Telangana: 19 వేల మంది టీచర్లకు పదోన్నతులు!

రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే విద్యాశాఖ ఉండటంతో.. ఆయన ఆమోదం కోసం దస్త్రం పంపారు.

Published : 07 Jun 2024 06:15 IST

సీఎం ఆమోదానికి ప్రమోషన్లు, బదిలీల దస్త్రం
నేడో, రేపో షెడ్యూలు వెలువడే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే విద్యాశాఖ ఉండటంతో.. ఆయన ఆమోదం కోసం దస్త్రం పంపారు. ఆయన పచ్చజెండా ఊపగానే షెడ్యూలు విడుదల కానుంది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో ఒకట్రెండు రోజుల్లోనే షెడ్యూలు విడుదల కావొచ్చని పాఠశాల విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్రియ పూర్తయితే మరో 19 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కుతాయని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

గత సంవత్సరం జరిగిందిదీ..

గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. పదోన్నతులకు టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరని సెప్టెంబరు నెలాఖరులో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దానికితోడు జీవో 317 వల్ల ఇతర జిల్లాల నుంచి టీచర్లు రావడం వల్ల తమ సీనియారిటీ దెబ్బతిని నష్టపోతున్నామని ఉన్నత న్యాయస్థానంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పటికే మల్టీ జోన్‌-1(వరంగల్‌)లో గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతులు, బదిలీలు పూర్తయ్యాయి. 782 మంది పదోన్నతులు పొందారు. స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలు పూర్తయ్యాయి తప్ప.. పదోన్నతులు పూర్తి కాలేదు. వారిని పాత స్థానాల నుంచి రిలీవ్‌ చేయలేదు. ఎస్‌జీటీల బదిలీలు కూడా ఆగిపోయాయి. 

ఇక మల్టీ జోన్‌-2(హైదరాబాద్‌)లో కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో గెజిటెడ్‌ హెచ్‌ఎంల బదిలీలు, పదోన్నతులు పూర్తయ్యాయి. 147 మందికి పదోన్నతులు దక్కాయి. స్థానిక సంస్థల(జడ్పీ ఉన్నత) పాఠశాలల జీహెచ్‌ఎంల బదిలీలు ముగిశాయి. మిగిలినవారివి ఆగిపోయాయి.

రెండు రకాల షెడ్యూళ్లు..

గతేడాది ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ మొదలు కానుంది. మల్టీ జోన్‌-1లో కొంత ప్రక్రియ పూర్తయినందువల్ల దానికి ఒక షెడ్యూలు, మల్టీ జోన్‌-2కు మరో షెడ్యూలు జారీ కానున్నాయి. మల్టీ జోన్‌-1లో స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. మల్టీ జోన్‌-2కు మరో షెడ్యూలు రానుంది.


పదోన్నతులిలా..

  • భాషా పండితుల పోస్టుల అప్‌గ్రెడేషన్‌పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గత మార్చిలో తీర్పు వెలువరించింది. ఎస్‌ఏ భాషా పండితుల పోస్టులకు భాషా పండితులు అర్హులని, ఎస్‌జీటీలు అర్హులు కారని పేర్కొంది. దాంతో 8,630 మంది భాషా పండితులకు, 1,819 మంది పీఈటీలకు.. మొత్తం 10,449 మందికి ఎస్‌ఏలుగా పదోన్నతులు దక్కనున్నాయి.
  • మల్టీ జోన్‌-2లో 778 మంది గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు అవుతారు. 
  • రెండు మల్టీ జోన్లలో కలిపి 2,400 మంది ఎస్‌జీటీలు ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలు కానున్నారు.
  • రాష్ట్రంలో 6 వేలమంది ఎస్‌జీటీలు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు