Telangana: రోజూ 90 శాతం విద్యార్థుల హాజరు తప్పనిసరి

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో రోజూ 90 శాతానికిపైగా విద్యార్థుల హాజరు ఉండాలని విద్యాశాఖను ఆదేశించింది.

Updated : 26 May 2024 07:59 IST

ప్రతి నెలా 4వ శనివారం ‘నో బ్యాగ్‌ డే’
జూన్‌ 1 నుంచి 11 వరకు బడిబాట
ఈ విద్యాసంవత్సరం మొత్తం పని రోజులు 229
పాఠశాల విద్య అకడమిక్‌ క్యాలెండరు విడుదల
ఈనాడు, హైదరాబాద్‌

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో రోజూ 90 శాతానికిపైగా విద్యార్థుల హాజరు ఉండాలని విద్యాశాఖను ఆదేశించింది. ‘విద్యాహక్కు చట్టం-2009’.. తరగతులు, సబ్జెక్టుల వారీగా పిల్లలు నేర్చుకోవాల్సిన అంశాలను నిర్దేశించినందున లక్ష్య సాధనకు పిల్లలు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని పేర్కొంది. ప్రభుత్వం కొత్త విద్యాసంవత్సరానికి(2024-25) సంబంధించిన అకడమిక్‌ క్యాలెండరును విడుదల చేసి, మార్గదర్శకాలు వెలువరించింది. వాటిని అమలు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించారు. 

నిర్దేశిత విద్యా సామర్థ్యాల సాధనకు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌.. ఇలా అన్ని రకాల పాఠశాలల్లో రోజూ 90 శాతానికిపైగా విద్యార్థులు హాజరవ్వాలని, అందుకు వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రధానోపాధ్యాయులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో మాదిరిగానే ఈ సారీ ప్రతి నెలా 4వ శనివారం ‘నో బ్యాగ్‌ డే’ను అమలుచేయాలి. రోజూ 30 నిమిషాల పాటు పాఠ్యపుస్తకాలు, కథల పుస్తకాలు, దినపత్రికలు, మేగజైన్లు చదివించాలి. టీవీ పాఠాలను యథావిధిగా ప్రసారం చేయాలి. విద్యార్థులతో 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయించాలి. జనవరి 10 నాటికి పదో తరగతి సిలబస్‌ పూర్తి చేయాలి.

మరికొన్ని ముఖ్యాంశాలు..

  • జూన్‌ 1 నుంచి 11వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి. పట్టణాలు, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి విద్యార్థులను బడుల్లో చేర్పించాలి.
  • ఒకటో తరగతిలో చేరే పిల్లల్ని పాఠశాలకు సన్నద్ధం చేసేందుకు జూన్‌లో 3, జులైలో 4, ఆగస్టులో 5 వారాలు విద్యా ప్రవేశ్‌ను అమలు చేయాలి. మిగిలిన తరగతులకు జూన్‌ 12 నుంచి 30 వరకు బ్రిడ్జి కోర్సును అమలు చేయాలి. గతేడాది పాఠ్యాంశాలను బోధించాలి.
  • ప్రతినెలా మూడో శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలి.
  • ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు నిర్వహించాలి. ఆ సందర్భంగా తీసుకున్న తీర్మానాలను నమోదు చేయాలి.
  • సంవత్సరంలో 10 రోజులు (ప్రతి నెలా నాలుగో శనివారం) పిల్లలు పుస్తకాల సంచి లేకుండా బడులకు రావాలి.
  • చివరి పనిదినం: 2025 ఏప్రిల్‌ 23వ తేదీ 
  • వేసవి సెలవులు: 2025 ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు
  • పనిదినాలు: మొత్తం 229 రోజులు.

సెలవులు ఇలా..

  • దసరా సెలవులు ఈ సారీ 13 రోజులే ఇచ్చారు. 2023-24 విద్యాసంవత్సరం వరకు 14 రోజులు ఉండేవి. క్రిస్మస్‌ సెలవులు కూడా అయిదు రోజులే.
  • దసరా: అక్టోబరు 2- 14వ తేదీ వరకు 
  • క్రిస్మస్‌: డిసెంబరు 23- 27వ తేదీ వరకు
  • సంక్రాంతి: 2025 జనవరి 13-17 వరకు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని