B.Tech Cources: సాయంత్రమూ బీటెక్‌ చదవొచ్చు

ఉద్యోగం చేసుకుంటూనే బీటెక్‌ చదివే అవకాశం వచ్చేసింది. ఒకవైపు కొలువు చేస్తూనే...వారాంతంలో రెండు రోజులపాటు తరగతులకు హాజరై ఇంజినీరింగ్‌ పూర్తి చేయవచ్చు.

Updated : 29 May 2024 07:49 IST

పాలిటెక్నిక్‌ డిప్లొమా అర్హత తప్పనిసరి
ఓయూలో గతేడాదే ప్రారంభం
ఈ ఏడాది మరిన్ని కళాశాలలకు అనుమతి లభించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగం చేసుకుంటూనే బీటెక్‌ చదివే అవకాశం వచ్చేసింది. ఒకవైపు కొలువు చేస్తూనే...వారాంతంలో రెండు రోజులపాటు తరగతులకు హాజరై ఇంజినీరింగ్‌ పూర్తి చేయవచ్చు. అదీ మూడేళ్లలోనే బీటెక్‌ పట్టా దక్కించుకోవచ్చు. కాకపోతే పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసి ఉండటం తప్పనిసరి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరమే(2023-24) సాయంత్రం బీటెక్‌ కోర్సులకు పచ్చజెండా ఊపింది. తరగతుల నిర్వహణకు దేశంలో మొత్తం 137 ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుమతి లభించగా రాష్ట్రంలో ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు అవకాశం దక్కింది. రాష్ట్రంలో గతేడాది మరో 11 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు ఏఐసీటీఈ నుంచి ఆమోదం లభించినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఈ ఏడాది ఆ కళాశాలలతో పాటు మరి కొన్నింటికి అనుమతి లభించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ‘గతేడాది ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధమైనా జీఓ జారీ కాలేదు. ఈసారి మళ్లీ ఏఐసీటీఈ నుంచి రెన్యువల్‌కు దరఖాస్తు చేశాం’ అని స్టాన్లీ మెథడిస్ట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల ఛైర్మన్‌ కృష్ణారావు తెలిపారు.

పాలిటెక్నిక్‌ విద్యార్థుల డిమాండు మేరకు...

పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసిన విద్యార్థుల్లో కనీసం 90 శాతం మంది చివరి సంవత్సరం పూర్తయిన వెంటనే బీటెక్‌ చదివితే వేతనం అధికంగా వస్తుందన్న భావనతో లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌ రెండో ఏడాదిలో చేరుతున్నారు. దానికి తోడు ఉద్యోగంలో చేరితే భవిష్యత్తులో బీటెక్, ఎంటెక్‌ లాంటివి చదువుకునే అవకాశం ఉండదని భావించి డిప్లొమా పూర్తయిన వెంటనే బీటెక్‌లో (రాష్ట్రంలో ఈసెట్‌ ద్వారా) ప్రవేశం పొందుతున్నారు. దేశవ్యాప్తంగా డిప్లొమాతో ఉద్యోగాలు చేస్తున్న వేల మంది తమకు విద్యార్హత పెంచుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఫలితంగా గత విద్యా సంవత్సరం (2023-24) నుంచి సాయంత్రం బీటెక్‌ కోర్సులకు ఏఐసీటీఈ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సాయంత్రం కోర్సుల్లో చేరాలంటే కనీసం ఏడాదిపాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి. వారు నేరుగా బీటెక్‌ రెండో ఏడాదిలో చేరొచ్చు. ఒక బ్రాంచికి 30 నుంచి 60 సీట్ల దాకా ఉండొచ్చు. ఓయూలో గత సంవత్సరం సివిల్, మెకానికల్, ఏఐ అండ్‌ ఎంఎల్‌ కోర్సులను ప్రారంభించగా...ఈసారి ఎలక్ట్రికల్‌ బ్రాంచికి ఏఐసీటీఈ నుంచి అనుమతి వచ్చింది. ఒక్కో దాంట్లో 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. కనీసం 10 మంది చేరితేనే తరగతులు నడపాల్సి ఉంటుంది. వారాంతంలో శని, ఆదివారాల్లో తరగతులు నిర్వహిస్తారు. జూన్‌ 10వ తేదీ నాటికి ఈ ఏడాది సాయంత్రం కోర్సులకు అనుమతులు పొందిన కళాశాలల సంఖ్య తెలుస్తుందని ఓ అధికారి తెలిపారు. గతేడాది సివిల్, మెకానికల్‌ బ్రాంచ్‌లకు మంచి స్పందన వచ్చిందని, అన్ని సీట్లు నిండాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి, ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ ఆచార్య శ్రీరాం వెంకటేష్‌ చెప్పారు. త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుందని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని