Basara IIIT: 1 నుంచి బాసర ఆర్‌జీయూకేటీ ప్రవేశాలు

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(బాసర)లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 1 నుంచి 26 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published : 28 May 2024 05:07 IST

దరఖాస్తుకు తుది గడువు జూన్‌ 26
అందుబాటులో 1,500 సీట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం(బాసర)లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 1 నుంచి 26 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు, వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.వెంకటరమణ సోమవారం హైదరాబాద్‌లో వివరాలు వెల్లడించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా 1,500 సీట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అందులో 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడవచ్చని పేర్కొన్నారు. ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేస్తామన్నారు. తొలి ఏడాదికి ఫీజు రూ.37 వేలు ఉండగా..రీయింబర్స్‌మెంట్‌ అర్హత ఉన్న వారు ఆ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. దానికితోడు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.వెయ్యి, కాషన్‌ డిపాజిట్‌ రూ.2 వేలు, ఆరోగ్య బీమా కింద రూ.700... మొత్తం రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ప్రవేశాల కాలపట్టిక...

దరఖాస్తుల సమర్పణ: జూన్‌ 1 నుంచి 26 సాయంత్రం 5 గంటల వరకు
సీట్ల కేటాయింపు: జులై 3న
ధ్రువపత్రాల పరిశీలన: జులై 8 నుంచి 10 వరకు

ముఖ్యాంశాలు...

  • ఈ సంవత్సరం తొలి ప్రయత్నంలో పదో తరగతి పాసైన వారే అర్హులు. వారి వయసు జూన్‌ 1వ తేదీ నాటికి 18 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 21 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంది.
  • గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5 శాతం సీట్లు సూపర్‌న్యూమరీ కింద కేటాయిస్తారు. పూర్తి వివరాలను ఆర్‌జీయూకేటీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 

‘ఆదర్శ’ ఇంటర్‌ దరఖాస్తుల గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు మోడల్‌ స్కూల్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.

టీజీఎస్‌ఆర్టీసీ ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: హైదరాబాద్, వరంగల్‌లలోని టీజీఎస్‌ఆర్టీసీ (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు జూన్‌ 10లోపు https://iti.telangana.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మోటార్‌ వెహికల్, మెకానిక్‌ డీజిల్, వెల్డర్, పెయింటర్‌ ట్రేడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీస్‌లుగా అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ ఐటీఐ కళాశాలలో చేరాలనుకునే విద్యార్థులు 9100664452, 040-23450033, వరంగల్‌ ఐటీఐ కళాశాలలో చేరాలనుకునేవారు 9849425319, 8008136611 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

‘పది’ సప్లిమెంటరీ పరీక్షలకు 51,237 మంది.. 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జూన్‌ 3 నుంచి 13 వరకు జరగనున్న పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 51,237 మంది హాజరుకానున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. వారిలో బాలురు 31,625 మంది, బాలికలు 19,612 మంది ఉన్నారు. పరీక్షల కోసం 170 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. హాల్‌టికెట్లను ఆయా పాఠశాలలకు పంపామని, వెబ్‌సైట్‌ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని