Burra Venkatesham: డిగ్రీలో ఐచ్ఛిక కోర్సుగా బీఎఫ్‌ఎస్‌ఐ

బీటెక్‌ తరహాలో ఈసారి డిగ్రీలోనూ ఐచ్ఛిక(ఎలెక్టివ్‌) కోర్సుగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఐ) ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు.

Updated : 07 Jun 2024 06:22 IST

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌ తరహాలో ఈసారి డిగ్రీలోనూ ఐచ్ఛిక(ఎలెక్టివ్‌) కోర్సుగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఐ) ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. దోస్త్‌ తొలి విడత వివరాలు వెల్లడించేందుకు గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయానికి వచ్చిన ఆయన పలు అంశాలను వివరించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఇప్పటికే బీఎఫ్‌ఎస్‌ఐ కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకున్నామని.. జేపీ మోర్గాన్, హెచ్‌ఎస్‌బీసీ, స్టేట్‌ స్ట్రీట్, లండన్‌ స్టాక్‌ సంస్థల ప్రతినిధులు డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇస్తారని చెప్పారు. ఎలెక్టివ్‌ కోర్సుకు సిలబస్‌ను ఆ కంపెనీల ప్రతినిధులే రూపొందిస్తారని, శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇంటర్న్‌షిప్‌ కల్పిస్తారని, ప్రాంగణ నియామకాలూ చేపడతారన్నారు. తొలుత ఈ ఏడాది 5 వేల మంది ఇంజినీరింగ్, మరో 5 వేల మంది నాన్‌ ఇంజినీరింగ్‌(డిగ్రీ) విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుందన్నారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఆ సంఖ్య లక్ష మందికి పెరుగుతుందని చెప్పారు. వారందరికీ బ్యాంకులు, బీమా, ఇతర ఆర్థికపరమైన సంస్థల్లో ఉద్యోగాలు సులభంగా దక్కే అవకాశం ఉంటుందని చెప్పారు. పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్నవారికి గత ఏడాది ఓయూలో సాయంత్రం బీటెక్ కోర్సు ప్రారంభించామని, 2024-25 విద్యాసంవత్సరం నుంచి జేఎన్‌టీయూహెచ్‌లో కూడా ప్రారంభించుకోవడానికి అనుమతి ఇచ్చామన్నారు.

34 డిగ్రీ, 14 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో..

బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సును 34 డిగ్రీ, 14 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశపెట్టేందుకు ఆయా కళాశాలలకు లేఖలు రాశామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాల్లో ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతున్నాయన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఈ రంగాల వైపు మరలుతున్నారని చెప్పారు. ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ మాట్లాడుతూ గత విద్యాసంవత్సరం ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో మైనర్‌ కోర్సుగా బీఎఫ్‌ఎస్‌ఐ ప్రవేశపెట్టామన్నారు

.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు