Caste Survey: అన్ని వర్గాల సూచనలతో కుల సర్వే

రాష్ట్రంలోని అన్నివర్గాల సలహాలు, సూచనలు తీసుకుని కుల సర్వే చేపడతామని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తెలిపారు.

Published : 11 Jun 2024 04:33 IST

బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు 

పీపుల్స్‌ కమిటీ ప్రతినిధులు, మేధావులు, ప్రొఫెసర్లు తదితరులతో  మాట్లాడుతున్న బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్నివర్గాల సలహాలు, సూచనలు తీసుకుని కుల సర్వే చేపడతామని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తెలిపారు. ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న ‘సామాజిక, ఆర్థిక కుల సర్వే’పై కార్యాచరణ ప్రణాళిక తయారీలో భాగంగా సోమవారం పీపుల్స్‌ కమిటీ ఆన్‌ కాస్ట్‌ సెన్సెస్‌ ప్రతినిధులు, మేధావులు, జస్టిస్‌ చంద్రకుమార్, ప్రొఫెసర్లు తదితరులతో ఆయన తొలి సమావేశం నిర్వహించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, బిహార్‌ రాష్ట్రాల్లో నిర్వహించిన కుల సర్వే వివరాలు, ఎదురైన న్యాయ వివాదాలు, ప్రజల స్పందనను ఈ సందర్భంగా వారికి వకుళాభరణం వివరించారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సర్వే నిర్వహించడం, అందులో చేర్చాల్సిన ప్రశ్నలు తదితరాల గురించి కమిటీ ప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో తమ అభిప్రాయాలు పొందుపరచాలని బీసీ కమిషన్‌ను పీపుల్స్‌ ప్రతినిధులు కోరారు. వారం రోజుల్లో రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రతినిధులు, ప్రజా, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన షెడ్యూలు ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో కమిషన్‌ సభ్యులు కృష్ణమోహన్, ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్, కిశోర్‌గౌడ్, మెంబర్‌ సెక్రెటరీ బాలమాయాదేవి, ప్రొఫెసర్లు మురళీ మనోహర్, పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, తిరుమలై, సింహాద్రి, పద్మజాషా, పృథ్వీరాజ్, నరేంద్రబాబు, దేవల్ల సమ్మయ్య, సతీష్‌ కొట్టే తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని