Solar Power: సౌరవిద్యుత్‌పై ‘స్వదేశీ’ భారం

సౌరవిద్యుత్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఆర్థికభారాన్ని మోపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు రావాలంటే తప్పనిసరిగా ‘స్వదేశంలో తయారైన సౌర సామగ్రి అవసరం’ (డొమెస్టిక్‌ కంటెంట్‌ రిక్వైర్‌మెంట్‌-డీసీఆర్‌) అనే నిబంధనను కేంద్రం విధించింది.

Published : 25 May 2024 04:52 IST

విదేశీ సౌరఫలకాలు వాడితే రాయితీలు రద్దు
స్వదేశీ సామగ్రి కొనుగోలు చేస్తే ఆర్థికభారం
ఒక్కో ఇంటికి రూ.30 వేల దాకా అదనపు ఖర్చు

ఈనాడు, హైదరాబాద్‌: సౌరవిద్యుత్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఆర్థికభారాన్ని మోపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు రావాలంటే తప్పనిసరిగా ‘స్వదేశంలో తయారైన సౌర సామగ్రి అవసరం’ (డొమెస్టిక్‌ కంటెంట్‌ రిక్వైర్‌మెంట్‌-డీసీఆర్‌) అనే నిబంధనను కేంద్రం విధించింది. ఒక్కో ఇంటికి 3 కిలోవాట్ల వరకూ రాయితీ ఇస్తామంది. స్వదేశీ సామగ్రి వాడితే రాయితీ ఇచ్చే 3 కిలోవాట్లకు రూ.21,000, ఇతర సామగ్రికి రూ.9 వేలు.. మొత్తం ఒక్కో ఇంటికి రూ.30 వేల వరకూ అదనంగా ఆర్థికభారం సామాన్యులపై పడుతోంది. ప్రభుత్వ భవనాలు, ఇతర ప్రాజెక్టుల్లో సైతం డీసీఆర్‌ వాడకాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. 

11 కంపెనీలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు 

మూణ్నెల్ల కిందట కేంద్రం ‘ప్రధానమంత్రి సూర్య ఘర్‌ యోజన’ను ప్రారంభించింది. ఈ పథకం కింద కోటి ఇళ్ల పైకప్పులపై సౌరవిద్యుత్‌ ఏర్పాటు చేస్తారు. డీసీఆర్‌ వ్యయం తగ్గించేందుకు దేశంలో 11 కంపెనీలకు 39,600 మెగావాట్ల సౌర మాడ్యూల్స్‌ తయారీకి రూ.14,007 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను కేంద్రం ప్రకటించింది. ఈ సొమ్ముతో ఎక్కువ నాణ్యత, సామర్థ్యం గల సౌర మాడ్యూల్స్‌ తయారు చేయాలని ఆదేశించింది. రాబోయే రెండేళ్లలో దేశంలో వీటి తయారీ వార్షిక సామర్థ్యాన్ని 48 వేల మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించింది. స్వదేశీ సౌరఫలకాలు, సౌర సెల్స్‌ వినియోగాన్ని పెంచేందుకు విదేశాల నుంచి దిగుమతులను తగ్గించేందుకు సౌర మాడ్యూల్స్‌ ధరపై 40 శాతం, సౌర సెల్స్‌ ధరపై 25 శాతం చొప్పున దిగుమతి సుంకాన్ని విధిస్తోంది. 2030 నాటికి దేశంలో 3 లక్షల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల సౌరవిద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ఇప్పటికి 83 వేల మెగావాట్ల ప్లాంట్లే ఉన్నాయి. ఇంకా 2 లక్షల మెగావాట్లకు పైగా ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటే పెద్దఎత్తున సౌర మాడ్యూల్స్, సౌర సెల్స్‌ అవసరం. కానీ దేశీయ ఉత్పత్తులనే వాడాలనే ఆంక్షల వల్ల అదనపు ఆర్థికభారం పడుతోందని సౌరకంపెనీలు సైతం ఇటీవల కేంద్ర నూతన, పునరుద్ధరణీయ ఇంధన మంత్రిత్వశాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ)కు విన్నవించాయి. స్వదేశీ సామగ్రి వాడని సౌర కంపెనీలపై ఐపీసీ 420 సెక్షన్‌ కింద క్రిమినల్‌ కేసు పెట్టి, పదేళ్ల పాటు బ్లాక్‌లిస్టులో పెట్టాలని, వాటి బ్యాంకు గ్యారంటీలను సీజ్‌ చేయాలని, వాటికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలనూ ఎంఎన్‌ఆర్‌ఈ ఇటీవల ఆదేశించింది. 


వ్యయం తగ్గిస్తేనే ప్రజలు ముందుకొస్తారు 

దేశీయంగా తయారవుతున్న సౌర మాడ్యూల్స్, సౌర సెల్స్‌ వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశం మంచిదే. కానీ డిమాండుకు తగ్గట్టుగా తక్కువ ధరల్లో నాణ్యమైన సామగ్రి సరఫరా లేదు. ఆ సామర్థ్యం పెంచేదాకా విదేశీ సామగ్రిని వాడే అవకాశం కల్పిస్తే ప్రజలకు ఆర్థికభారం తగ్గుతుంది. ‘పీఎం సూర్య ఘర్‌ యోజన’ కింద 3 కిలోవాట్ల సౌరవిద్యుత్‌ను పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒక్కో ఇంటికి అదనంగా రూ.30 వేల వరకూ ఆర్థికభారం పడుతోంది. దీన్ని తగ్గించి కనీసం ఈ పథకం వరకైనా విదేశీ సామగ్రితో సమాన ధరలకు డీసీఆర్‌ను ఇప్పించే ఏర్పాటుచేస్తే రూ.21 వేల కోట్లు ఆదా అవుతాయి. ఈ పథకంపై కేంద్రం వ్యయం తగ్గిస్తేనే ప్రజలు ముందుకొస్తారు.

అశోక్‌కుమార్, ఛైర్మన్‌ తెలంగాణ సోలార్‌ అసోసియేషన్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు