Telangana: చిన్నారులందరికీ వైద్యపరీక్షలు

రాష్ట్రంలోని చిన్నారులను ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది.

Published : 08 Jun 2024 06:30 IST

మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యక్రమం
పోషకాహారం అందించడానికి వైద్యఆరోగ్యశాఖతో సమన్వయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని చిన్నారులను ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు ఎత్తు, బరువు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులతో పాటు పౌష్టికాహారం అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ సహకారం తీసుకుంటోన్న సంక్షేమశాఖ ఆయా చిన్నారుల సంరక్షణ, పోషకాహారం కోసం ఉమ్మడి ప్రొటోకాల్‌ నిబంధనలు జారీ చేయనుంది. అంగన్‌వాడీ లబ్ధిదారులు, చిన్నారుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖతో పరస్పరం పంచుకోనుంది. అంగన్‌వాడీ కేంద్రాలపై శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో శిశు సంక్షేమశాఖ అధికారులు ఈ కార్యక్రమాలను వివరించారు. 

 66 శాతం సర్వే పూర్తి..

రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, చిన్నారుల పోషకాహారం, ఆరోగ్యం కోసం శిశు సంక్షేమశాఖ వార్షిక సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో ఐదేళ్లలోపు చిన్నారులు 13.61లక్షల మంది ఉంటే ఇప్పటికి 8.92 లక్షల మందికి సర్వే పూర్తయింది. ప్రస్తుత మదింపునకు సంబంధించి వైద్యఆరోగ్యశాఖను భాగస్వామ్యం చేయడంతో వారికి అవసరమైన వైద్య సలహాలు, పరీక్షలు అందుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఎత్తుకు తగిన బరువు ఉన్నారా? వయసుకు తగిన ఎత్తు ఉన్నారా? బలంగా ఉన్నారా? బలహీనంగా ఉన్నారా? వివరాల్ని తెలుసుకునే స్టాడియోమీటరు, ఇన్‌ఫాంటోమీటర్, సాల్టర్‌స్కేల్‌ పరికరాలను అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు అందించింది. చిన్నారుల ఎత్తు, బరువు వివరాలు తీసుకోవడంతో పాటు స్థానిక పల్లె, బస్తీ దవాఖానాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ పరీక్షల ద్వారా పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నవారిని, తక్కువ బరువున్నవారిని గుర్తించి అవసరమైన మందులు, పోషకాహారం  అందివ్వనుంది. ఈ నిమిత్తం అంగన్‌వాడీ లబ్ధిదారులు, పోషకాహారలోపంతో బాధపడుతున్న చిన్నారుల సమాచారాన్ని ఇప్పటికే పోర్టల్‌లో పొందుపరిచిన మహిళాశిశు సంక్షేమశాఖ ఈ వివరాలను వైద్యఆరోగ్యశాఖతో పంచుకోనుంది.

అంగన్‌వాడీల్లో ప్రస్తుత వార్షిక సర్వేలో...

  •  కుటుంబాలు - 58.36 లక్షలు
  • బాలింతలు, గర్భిణులు - 2.2 లక్షలు
  • ఆరేళ్లలోపు చిన్నారులు - 14.9 లక్షలు
  • ఐదేళ్లలోపు చిన్నారులు - 13.61లక్షలు
  • కౌమారదశలోని బాలికలు - 2.8లక్షలు
  • దివ్యాంగులు - 2.03 లక్షలు
  • కొత్తగా చేరిన చిన్నారులు - 2.55 లక్షలు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని