Kaleshwaram Project: ‘కాళేశ్వరం’ ఇంజినీర్లపై చర్యలకు తర్జనభర్జన

మేడిగడ్డ బ్యారేజీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో ముందు నుంచి పని చేస్తున్న  ఇంజినీర్లను మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తికాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చిన అంశం ఇటీవల చర్చకు వచ్చినప్పుడు ఆయన ఈ మేరకు స్పందించినట్లు సమాచారం.

Published : 23 May 2024 05:42 IST

మొదటి నుంచి ఉన్న టీమ్‌ను మార్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం
ఇప్పటికీ శ్రీకారం చుట్టని నీటిపారుదల శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో ముందు నుంచి పని చేస్తున్న  ఇంజినీర్లను మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తికాకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చిన అంశం ఇటీవల చర్చకు వచ్చినప్పుడు ఆయన ఈ మేరకు స్పందించినట్లు సమాచారం. ‘‘మొదటి నుంచి ఉన్న టీమ్‌ అలాగే కొనసాగుతుంటే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? వారు కీలకమైన అంశాలు వెలుగులోకి రాకుండా చూడటానికే ప్రయత్నిస్తారు తప్ప సమాచారం ఎందుకు ఇస్తారు? అలాంటి వారందరినీ మార్చి ఉత్సాహంగా పని చేయగలిగిన వారిని, ఎక్కువ సర్వీసు ఉన్నవారిని నియమించడం వల్ల ప్రయోజనం ఉంటుంది’’ అని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. అయితే బాధ్యులైన ఇంజినీర్లపై చర్యలకు నీటిపారుదల శాఖ తర్జనభర్జన పడుతోంది. ఎన్డీఎస్‌ఏ, జ్యుడిషియల్‌ కమిషన్‌ నుంచి పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకోవడం మంచిందంటూ ముఖ్యమంత్రి ఆదేశాల అమలుకు ఇంకా శ్రీకారం చుట్టలేదని తెలిసింది. 

ఇదీ నేపథ్యం...

2019 వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజీకి సమస్య ప్రారంభం కాగా, సీసీబ్లాకులు, ఆప్రాన్‌తో పాటు మరికొన్ని మరమ్మతుల గురించి ఇంజినీర్లు నిర్మాణ సంస్థకు లేఖలు రాశారు. తర్వాత సంవత్సరాల్లో కూడా సమస్యలు పునరావృతం కాగా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి లేఖలు రాశారు. అయితే నిర్మాణ సంస్థ మరమ్మతులకు పూనుకోలేదు. గత అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగి ఏడో బ్లాక్‌లో పియర్స్‌ దెబ్బతిన్నప్పుడు, తామే బ్యారేజీ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని ప్రకటించింది. తర్వాత వెనక్కు తగ్గింది. పని పూర్తవడంతోపాటు డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ కూడా ముగిసిందని, తాజా పనులకు అనుబంధ ఒప్పందం చేసుకొంటేనే చేస్తామని తెలిపింది. పని పూర్తయినట్లు 2021 మార్చి 15న సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దానిపై ఎస్‌ఈ కౌంటర్‌ సంతకం చేశారు. 2020 నవంబరు 11న అప్పటి కాళేశ్వరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(రామగుండం) రాష్ట్ర స్థాయి స్టాండింగ్‌ కమిటీ కోసం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(జనరల్‌)కు లేఖ రాశారు. 2020 ఫిబ్రవరి 29నే పని పూర్తయిందని, ప్రభుత్వం వద్ద ఉన్న బ్యాంకు గ్యారంటీలను వెనక్కు ఇవ్వాలని అందులో కోరారు. 2020 ఫిబ్రవరి 29 నుంచే డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ప్రారంభమైందని, ఈ సమయంలో ఏమైనా లోపాలుంటే చేపడతామని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ అండర్‌ టేకింగ్‌ ఇచ్చిందని కూడా అందులో పేర్కొన్నారు. అయితే 2021 మార్చి 31న పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఏడాది పాటు ప్రభుత్వం గడువు పొడిగించింది. పునరుద్ధరణ పనులు నిర్మాణ సంస్థ చేయాలా లేక  ఖర్చును ప్రభుత్వం భరించాలా అన్నది చర్చనీయాంశం కాగా, నిర్మాణ సంస్థే భరించాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌ 15న ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఒప్పందం ఇంకా మనుగడలో ఉందని కూడా స్పష్టం చేశారు. పని పూర్తయినట్లు పొరపాటున సర్టిఫికెట్‌ ఇచ్చానని ఈఈ పేర్కొన్నట్లు తెలిపారు.

ఏజెన్సీకి లేఖ ఎప్పుడు రాశారు? 

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద వీటన్నిటిపైనా చర్చ జరిగింది. పని పూర్తి కాకుండానే పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని, తర్వాత పని గడువు పొడిగించారని, మరమ్మతుల గురించి రాసినా నిర్మాణ సంస్థ పట్టించుకోనట్లు చెప్తున్నారని... అలాంటప్పుడు క్రిమినల్‌ చర్యలు ఎందుకు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు. బాధ్యులైన ఇంజినీర్లపైన కూడా చర్య తీసుకోవాలి కదా అంటూ టీమ్‌ మొత్తాన్ని మార్చాల్సి ఉందని, లేకుంటే అక్కడి నుంచి సమాచారం కూడా రాదని స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. దెబ్బతిన్న పనుల గురించి ఏజెన్సీకి ముందుగానే లేఖ రాశారా లేక బ్యారేజీ కుంగిన తర్వాత సృష్టించారా అన్న కోణంలో కూడా పరిశీలించాలని చెప్పినట్లు తెలిసింది. కాళేశ్వరంపై వేసే కమిటీల్లో ఎక్కువ సర్వీసు ఉన్నవారిని నియమించాలని, నెలకో రెండు నెలలకో పదవీ విరమణ చేసే వారిని నియమించవద్దని ఆదేశించినట్లు తెలిసింది. 


మేడిగడ్డను పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్‌ నిపుణులు

దెబ్బతిన్న పియర్ల వద్ద పరీక్షలపై ఆరా

బుధవారం మేడిగడ్డ బ్యారేజీ దిగువన ఏడో బ్లాక్‌ ప్రాంతంలో పరిశీలిస్తున్న సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ నిపుణులు 

మహదేవపూర్, కాళేశ్వరం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పుణెకు చెందిన సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌(సీడబ్ల్యూపీఆర్‌) స్టేషన్‌ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. నిపుణులు జె.ఎస్‌.ఎడ్‌లబాడ్కర్‌ (జియో టెక్నికల్‌), డా.ధనుంజయ్‌ నాయుడు (జియో ఫిజికల్‌), డా.ప్రకాష్‌ పాలయ్‌ (ఎన్‌డీటీ స్టడీస్‌) ఈ బృందంలో ఉన్నారు. వారు పుణె నుంచి నేరుగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. ఎల్‌అండ్‌టీ అతిథి గృహంలో ఇంజినీర్లతో చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో తిరుగుతూ అణువణువునా పరీక్షించారు. ఏడో బ్లాక్‌ ప్రాంతంలో 20 పియర్‌ పగుళ్లు, దెబ్బతిన్న గేటును చూశారు. మిగతా గేట్లు, పియర్స్‌ పరిస్థితులను గమనించారు. దిగువన సీసీ బ్లాక్‌లు ఏ విధంగా కొట్టుకుపోయాయో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి పరీక్షలు చేశారో అడగగా ఈఆర్‌టీ, జీపీఆర్‌టీ పరీక్షలు చేసినట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. బ్యారేజీలో ఎలాంటి పరీక్షలు చేయాలో తెలియజేస్తామని, నాలుగు రోజుల్లో లేదా వారంలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని బృందం సభ్యులు తెలిపారు. ఏడో బ్లాక్‌ ఏ విధంగా దెబ్బతిందో, ప్రస్తుత పరిస్థితులు ఏమిటో సీఈ సుధాకర్‌ వివరించారు. మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజీకి చేరుకొని అప్, డౌన్‌ స్ట్రీమ్‌లను చూశారు. 28, 35, 38, 44 గేట్ల వద్ద లీకేజీ, సీపేజీలు, చేసిన మరమ్మతులను పరిశీలించారు. బ్యారేజీకి ఎగువన పియర్స్‌ వద్ద ఇసుక మేటల్ని ఎంత మేర తొలగించిందీ వారికి ఈఈ యాదగిరి వివరించారు. ఈ బృందం బుధవారం రాత్రి కాళేశ్వరంలో బస చేసి గురువారం పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీ పరిశీలనకు వెళ్లనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని