CM Revanth Reddy: ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ కోరడం లేదేం?

ప్రతి విషయంపై సీబీఐ విచారణ కోరే కల్వకుంట్ల కుటుంబం ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఎందుకు డిమాండ్‌ చేయడం లేదో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 29 May 2024 05:19 IST

కల్వకుంట్ల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి సూటి ప్రశ్న
విరిగింది కాళేశ్వరం పన్ను కాదు.. వెన్ను అని వ్యాఖ్య
రాష్ట్రంలో కరెంటు కోతలేమీ లేవని వెల్లడి
రాష్ట్ర గీతం పూర్తి బాధ్యతలు అందెశ్రీకే అప్పగించినట్లు స్పష్టీకరణ

ఈనాడు, దిల్లీ: ప్రతి విషయంపై సీబీఐ విచారణ కోరే కల్వకుంట్ల కుటుంబం ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఎందుకు డిమాండ్‌ చేయడం లేదో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఫోన్‌ ట్యాపింగ్‌ లాంటి పనుల జోలికి పోవడం లేదని స్పష్టం చేశారు. జూన్‌ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించడానికి రేవంత్‌రెడ్డి మంగళవారం దిల్లీకొచ్చారు. ఇక్కడి తుగ్లక్‌ రోడ్డులో తెలంగాణ సీఎం అధికారిక నివాసంలో జరుగుతున్న మరమ్మతులను పరిశీలించారు. అనంతరం కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశాలుగా మారిన రాష్ట్ర గీతం రూపకల్పన, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్‌ కోతలు, ఫోన్‌ ట్యాపింగ్‌లపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఇప్పటివరకు నేను వ్యక్తిగతంగా సమీక్ష చేపట్టలేదు. కేసు దర్యాప్తు విషయంలో పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. దర్యాప్తు చేస్తున్న అధికారులు ఎవరి మాటా వినేరకం కాదు. వారు తమ పని తాము చేసుకుపోతున్నారు. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఎందుకు కోరడం లేదో అర్థం కావడం లేదు. అధికార మార్పిడి జరిగిన తర్వాత చోటుచేసుకున్న అధికారుల బదిలీల సమయంలో ఎస్‌ఐబీ కార్యాలయంలోని కొన్ని వస్తువులు మాయమైనట్లు బయటపడింది. వాటికి సంబంధించిన అంశంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఎవరెవరు బాధ్యులో తేల్చే క్రమంలోనే ట్యాపింగ్‌ వ్యవహారం బయటికొచ్చింది. ఈ కేసులో టెలిగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్లు జోడించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కనిపించకుండా పోయిన హార్డ్‌ డిస్క్‌లు, ధ్వంసమైన డేటా బ్యాకప్‌ ఎక్కడ ఉందో దర్యాప్తు చేస్తున్న అధికారులే తేల్చాలి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం లేదు. అలాంటి పనులు నేను చేయను. తీవ్రవాదులు, జాతివ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరగొచ్చు. అందుకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే ఎస్‌ఐబీ అధికారులు కేంద్ర నిఘా సంస్థలతో నేరుగా మాట్లాడతారు తప్ప నాతో కాదు. ఉగ్రవాదులు, తీవ్రవాదుల గురించి 1980, 1990ల నుంచి సేకరించిన డేటా బ్యాకప్‌ ఉందా.. దాన్ని కూడా మాయం చేశారా అన్న విషయం దర్యాప్తు తర్వాత అధికారులకు తెలుస్తుంది.

నిపుణుల సూచనల మేరకే  కాళేశ్వరంపై ముందుకు..

కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు సమస్యపై నిపుణుల సూచనలతో ముందుకెళ్తాం. 32 పళ్లలో ఒక పన్ను విరగడం లాంటి సమస్య కాదిది.. మనిషికి వెన్నెముక విరగడం లాంటిది. ప్రాజెక్టులో నీరు నిల్వ చేసి, విడుదల చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే 52 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. దానిపై కట్టిన కరెంటు బిల్లులన్నీ సముద్రంలో వదిలిన నీళ్ల లాంటివే. కాళేశ్వరం వద్ద భూమి లోపల ఏముందన్నది కనిపెట్టడం పెద్ద సమస్య. దాన్ని నిపుణులే తేల్చాలి. జియోఫిజికల్, జియో టెక్నికల్‌ సర్వే పూర్తి చేసేంతవరకూ భూమి లోపల ఏముందో తేలదు. ఆ సామర్థ్యం మూడు జాతీయస్థాయి సంస్థలకే ఉంది. ఈ పని కోసం రెండు ఏజెన్సీలను తీసుకొని.. డబుల్‌ చెక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాం.

ఎన్నికలు ముగిశాక కరెంటు విషయాలు చెబుతా..

రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి కరెంటు కోతలు లేవు. చెట్లు పడిపోవడం, విద్యుత్‌ వినియోగం పెరగడంతో ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలిపోవడం వల్ల సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడింది. పునరుద్ధరణకు కొంత సమయం పట్టి ఉండొచ్చు. అంతేతప్ప ఎక్కడా కొరత లేదు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతస్థాయిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. అందుకు అనుగుణంగా సరఫరా చేస్తూ ఎక్కడా సమస్యలు రాకుండా చూస్తున్నాం. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత విద్యుత్‌కు సంబంధించిన అన్ని విషయాలు చెబుతా. 

తెలంగాణ తల్లి విగ్రహం, గీతం, చిహ్నం రూపకల్పనలో నా జోక్యం లేదు..

తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదు. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది త్యాగాలు, పోరాటాలే. అందుకే ఆ త్యాగాలు, పోరాటాలకు చిహ్నంగా తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం, చిహ్నాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర గీత రూపకల్పన పూర్తి బాధ్యతలను రచయిత అందెశ్రీకే అప్పగించాం. ఏ సంగీత దర్శకుడిని ఎంచుకొని ఆ గీత స్వరకల్పన చేస్తారన్నది ఆయన ఇష్టం. తెలంగాణ చిహ్నం రూపకల్పన బాధ్యతలను నిజామాబాద్‌ వ్యక్తికి ఇచ్చాం. ఈ మూడు పనులను ఆయా రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికే పూర్తిగా అప్పగించి స్వేచ్ఛనిచ్చాం. ఇందులో నా జోక్యం లేదు. అది నా పని కూడా కాదు. 


పారదర్శకంగా ఎన్నికలు

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. ఏ వ్యవస్థనూ దుర్వినియోగం చేయలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో ఎంతమంది అధికారులను మార్చారు, తెలంగాణలో ఎంతమందిని మార్చారన్నది అందరికీ తెలుసు. ఒకవేళ అధికారులు మాకు అనుకూలంగా పనిచేసి ఉంటే ప్రతిపక్షాలు చూస్తూ కూర్చోవు కదా! ఎన్నికల సమయంలో ఏ ఒక్క అధికారిపైనా ఆరోపణలు రాలేదు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని