Revanth Reddy: తెలుగువారి కీర్తిని జాతీయస్థాయిలో చాటారు

తెలుగువారి కీర్తిని జాతీయస్థాయిలో చాటిన వ్యక్తి రామోజీరావు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు.

Published : 09 Jun 2024 06:42 IST

సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగువారి కీర్తిని జాతీయస్థాయిలో చాటిన వ్యక్తి రామోజీరావు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు. రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా శనివారం సంతాపం తెలిపారు. ‘‘తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకే దక్కుతుంది. తెలుగు పత్రికా, మీడియా రంగానికి ఆయన లేని లోటు పూడ్చలేనిది. రంగం ఏదైనా విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేసిన వ్యక్తి రామోజీరావు. పత్రిక నిర్వహణ ఒక సవాల్‌ అనుకునే పరిస్థితుల్లో ఐదు దశాబ్దాల పాటు ‘ఈనాడు’ను నంబర్‌ వన్‌ స్థానంలో నడిపారు. ఈటీవీ స్థాపనతో టీవీ మీడియా రంగానికి దశాదిశా చూపిన దార్శనికుడు.. అక్షర వీరుడు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని సీఎం పేర్కొన్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో రామోజీరావుతో భేటీ అయిన విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన దిల్లీ నుంచి రామోజీరావు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.

తెలుగు జాతికి గర్వకారణం రామోజీరావు: భట్టి

ఈనాడు, హైదరాబాద్‌: రామోజీరావు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన రామోజీ ఫిల్మ్‌సిటీలో రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. రామోజీరావు కుమారుడు కిరణ్, కోడళ్లు శైలజ, విజయేశ్వరిలను పరామర్శించి తీవ్ర సంతాపం, సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక, పోలీసు ఉన్నతాధికారులతో రామోజీరావు అంత్యక్రియల ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో ఉండటంతో ప్రభుత్వ ప్రతినిధిగా తాను హాజరైనట్లు తెలిపారు. ‘‘విలక్షణమైన సృజనాత్మకతతో కూడిన వ్యక్తిత్వం రామోజీరావు సొంతం. ఆయన గొప్ప లౌకికవాద తాత్వికవేత్త. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షంగా వ్యవహరించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు తన మీడియా ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు. ఈనాడు - ఈటీవీ సంస్థలతో సామాజిక బాధ్యతలు నిర్వర్తించారు. వరద బాధితులకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. సారా వ్యతిరేక ఉద్యమాన్ని భుజాన వేసుకొని నడిపించారు. వ్యాపార రంగంలో కూడా రామోజీరావు నమ్మకానికి మరోపేరుగా నిలిచారు. 

హైదరాబాద్‌కు గొప్ప మణిహారంగా రామోజీ ఫిల్మ్‌సిటీని నిర్మించారు. సినిమా రంగంలో చెరగని ముద్ర వేశారు. హైదరాబాద్‌ నగర ఖ్యాతిని పెంచారు. ఒక సామాన్యుడు అసామాన్య విజయాలు సాధిస్తారనే దానికి రామోజీరావు ఒక చిరునామాగా నిలిచారు. నమ్మిన విలువలను, ప్రజాస్వామ్యాన్ని చివరి వరకు కాపాడారు. ఆయన సాధించిన విజయాలు తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచాయి. ఆయన మృతి తీరని లోటు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని