CM Revanth Reddy: మాట ఇచ్చా.. మాఫీ చేయాల్సిందే

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated : 16 May 2024 08:34 IST

ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ జరగాలి
బ్యాంకర్లతో సంప్రదింపులు వేగవంతం చేయండి
వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు పూర్తి
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై నివేదికలు రూపొందించండి
ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు
18న రాష్ట్ర మంత్రివర్గం భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలపై అధికారులతో చర్చించారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలిచ్చారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ‘‘అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలి. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నందున, నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయండి. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు వేగవంతం చేయండి. రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలను అధ్యయనం చేయండి. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి. దళారుల జోక్యం ఉండకూడదు. రైతు నుంచి పంటను కొని.. మిల్లింగ్‌ చేసి రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు చేపట్టండి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలి. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోళ్లు జరగాలి. తడిసిన ధాన్యం, తేమ విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడండి. అక్రమాలకు పాల్పడే రైస్‌ మిల్లర్లపై ఉక్కు పాదం మోపాల్సిందే. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు.

జూన్‌ 2 తర్వాత ఏపీకి కేటాయించిన ఆస్తుల స్వాధీనం

జూన్‌ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి పెండింగ్‌ అంశాలన్నింటిపై తక్షణమే నివేదికలు రూపొందించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్తు సంస్థల బకాయిల విషయం ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి రేవంత్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ జరిగిన వాటి వివరాలపై కూడా సమగ్ర నివేదికను తయారు చేయాలని సూచించారు. ఈ నెల 18న(శనివారం) రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న విషయాలు, రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్‌ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌.. జూన్‌ 2 తర్వాత కేవలం తెలంగాణ రాజధానిగా మారనుంది. గత పదేళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌ వంటి భవనాలను జూన్‌ 2 తర్వాత రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలి.

రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీలు వంటి అంశాలను సత్వరమే పూర్తి చేయాలి. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలి. పీటముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలి.

సీఎం రేవంత్‌రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని