Telangana Formation Day: రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియా!

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.

Published : 29 May 2024 05:17 IST

ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం దిల్లీలోని 10-జన్‌పథ్‌లో ఆమెతో భేటీ అయి.. వేడుకలకు హాజరు కావాలని కోరారు. అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియాను ప్రత్యేక అతిథిగా పిలవాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా ఆమె భాగస్వామ్యాన్ని ఈ పదేళ్ల ఉత్సవాల్లో ప్రజలు కోరుకుంటున్నారు. 4 కోట్ల రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు ఆమెను సత్కరించడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేయదలచుకున్నాం. మా ఆహ్వానానికి సానుకూలంగా స్పందించినందుకు పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కర్నీ దశాబ్ది ఉత్సవాలకు అధికారికంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ సముచిత గౌరవం కల్పిస్తాం’’ అని పేర్కొన్నారు. 

పాకిస్థాన్‌ ప్రధాని పుట్టినరోజుకు వెళ్లింది మోదీయే

పాకిస్థానీయులను కాంగ్రెస్‌ వాళ్లు ప్రేమిస్తున్నారని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ఎవరూ పిలవకున్నా పాకిస్థాన్‌ ప్రధాని పుట్టినరోజుకు ఆయన వెళ్లారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున నగదు వేస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మరచిపోయిన మోదీ.. ఇప్పుడు లేనిపోని మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాకిస్థాన్, ముస్లింల గురించి పదేపదే మాట్లాడే భాజపా నాయకులు.. తమ రాజకీయ ఎజెండా ఏంటో స్పష్టత ఇవ్వాలని, పదేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లలో అన్ని రంగాల్లో విఫలమైన మోదీ.. ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేక ఇతరులను దూషిస్తున్నారన్నారు. ప్రధాని హోదాకు ఇది తగదన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. భాజపాకు తమిళనాడు, కేరళల్లో డిపాజిట్లు రావని..    అయినా అత్యధిక సీట్లు గెలుస్తామని చెబుతోందని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని